టీఆర్ ఎస్... బీజేపీని బెదిరిస్తుందా?

తెలంగాణ అధికార పార్టీ కేంద్రంలోని బీజేపీని బెదిరిస్తోందా?  వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టడం ద్వారా తన పంతం నెగ్గించుకు నేందుకు ప్రయత్నిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్ని రోజులుగా.. కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తప్పుడు విధానాలు అవలంభిస్తోందని పేర్కొంటూ.. ఆయనే స్వయంగా ధర్నా చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని మంత్రులపైనా.. తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అగ్గి పుట్టిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తన మంత్రివర్గంతోనూ ఎమ్మెల్యేలతోనూ ధర్నాలు చేయించారు.

పంజాబ్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? అని కేసీఆర్ కేంద్రాన్ని నిగ్గదీశారు. అంతేకాదు.. ఢిల్లీవెళ్లి అంతు చూస్తామన్నారు. యాసంగి వరిని కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకునేది లేదన్నారు. అయితే.. కేంద్రం మాత్రం తాము ఎప్పుడో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశామని.. ఇదంతా రాజకీయం కోసమే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమని.. క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. బాయిలల్డ్ రైస్‌ను గింజ కూడా కొనేది లేదని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వాలే తమకు లేఖలు కూడా ఇచ్చాయని.. కేంద్ర మంత్రి తెలంగాణ కే చెందిన కిషన్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. దీంతో కేంద్రం వైఖరి.. కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఈ క్రమంలో అటు కేంద్రంపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి లోక్‌సభలో బలం చాలానే ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో మూడు సాగు చట్టాల విషయంలో రాజ్యసభలో టీఆర్ ఎస్ ఎంపీలు మద్దతిచ్చారు. అలాగే.. ఆర్టికల్ 370 రద్దు విషయంలోనూ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. కేంద్రాన్ని రాజ్యసభలో ఇరుకున పెట్టి.. తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అంటే..రాజ్యసభలో తనకు ఉన్న ఎంపీలను ఆకస్మికంగా రిజైన్ చేయించేసి.. మరోసారి.. గత తెలంగాణ ఉద్యమ సమయంలో అనుసరించిన పంథానే అనుసరించాలని కేసీఆర్ స్కెచ్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

టీఆర్ ఎస్‌కు మొత్తం రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో  బండ ప్రకాశ్‌ను ఇటీవల శాసన మండలికి తీసుకున్నారు. దీంతో ఒక సీటు ఖాళీ అయింది. మరో సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు కేసీఆర్‌కు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇక మిగిలింది.. ఐదుగురు సభ్యులు మాత్రమే. వీరితో రాజీనామా చేయించి.. బీజేపీకి షాక్ ఇచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ వీరు రాజీనామా చేసినా.. తనకుఉ న్న బలం చేత తిరిగి వీరిని గలిపించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. దీంతో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి బీజేపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం.. తెలంగాణలో జోరుగా సాగుతోంది.

ఇదిలావుంటే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ వంటి కీలక పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించేందుకు రెడీ అయ్యారు.   సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ బీజేపీ నేతలకు ఆయన కబురు పంపినట్టు తెలిసింది. ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాజీనామాల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించి బీజేపీకి ఝలక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని.. టీఆర్ ఎస్ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మరి దీనికి కేంద్రం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
× RELATED జీతాలు పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
×