జగన్ కి భారీ షాకులు... వారితో పెట్టుకుంటే...?

కేంద్రంలో బీజేపీకి ఏపీలో రాజకీయం అంటే పెద్ద లెక్కలోనిది కాదు ఏ రోజు ఏపీ బాగుందని ఇపుడు కొత్తగా బావుకోవడానికి ఏముందని కూడా బీజేపీ పెద్దల ఆలోచన. అయితే ఏపీలో రాజకీయ పార్టీలను మాత్రం కేంద్ర బీజేపీ ఎపుడూ ఒక కంట కనిపెడుతూనే వస్తోంది. ఏపీలో చంద్రబాబు జగన్ వారి రెండు పార్టీలూ బీజేపీ తన అదుపులో ఉంచుకోవడానికి చేయని ప్రయత్నం లేదనే చెబుతారు. దానికి తగినట్లుగానే బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దాసోహం అనే అంటున్నాయి.

ఇక్కడ చూస్తే ఎవరి రాజకీయం వారిది. రెండు ప్రాంతీయ పార్టీలు ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశ్యంతో కేంద్రంలో బలమైన బీజేపీ మద్దతు కోరుకుంటున్నాయి. అయితే అటు కేంద్రంలో సగం పాలన గడచిపోయింది. 2022 లో జరిగే ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలు ముగిస్తే అసలు కధ మొదలవుతుంది. 2024 ఎన్నికల వేడి నాటి నుంచే రాజుకుంటుంది.

కేంద్రంలోని బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు. దాంతో కొత్త మిత్రులను వెతుక్కోవాల్సి వస్తోంది. ఏపీ వరకూ చూసుకుంటే చంద్రబాబు జగన్ ఇద్దరూ బీజేపీకి ఈ రోజు దాకా మిత్రులు కాని మిత్రులుగానే ఉన్నారు. అయితే ఇది క్లారిటీగా లేదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మిత్రులుగా ఉంటామని చెప్పాలి. రేపటి రోజున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మునిగినా తేలినా వెంట ఉంటామని బాస చేయాలి.

అలాంటి నమ్మకం భరోసా అయితే అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఇచ్చే సీన్ అయితే ఇప్పటికి లేదు. ముందుగా చంద్రబాబు రాజకీయ వ్యూహాన్నే తీసుకుంటే ఆయన 2024 నాటికి తనకు ఏపీలో అధికారంతో పాటు కేంద్రంలో కలసి వచ్చే కూటమి వైపే ఉండాలనుకుంటారు. ఆ విషయంలో ఆయన ఎత్తులు ఈ రోజుకు బయటపడవు నిజం చెప్పాలంటే ఆయన కూడా 2022 ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల మీదనే దృష్టి పెట్టి ఉన్నారు.

ఆ ఎన్నికల ఫలితాలు వస్తే అపుడు తన వ్యూహాలకు పదును పెట్టాలనుకుంటున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయనకు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా పెద్దగా పట్టింపు లేదు. ప్రస్తుతం మాత్రం బాబుని దరిచేయనీయకుండా బీజేపీ ఉంటే చాలు. ఆ కారణంగానే ఆయన బీజేపీతో స్నేహం కాని స్నేహం చేస్తున్నారు. అయితే బీజేపీకి ఇది చాలదు జగన్ వంటి వారు రేపటి ఎన్నికల ఫలితాల తరువాత తమకు సాయం చేయడానికి బాహాటంగా ముందుకు రావాలి.

అందుకోసమే బీజేపీ ఇపుడు కొత్త ఎత్తులకు దిగుతోంది అంటున్నారు. నిజానికి ఈ గేమ్ స్టార్ట్ చేసింది అమిత్ షా అనే చెప్పాలి. ఆయన తిరుపతి వస్తూనే బీజేపీ స్ట్రాటజీ మొత్తం మార్చేశారు. అమరావతి రాజధాని రైతులకు మద్దతు బీజేపీ ఇవ్వడం అంటే జగన్ని ఇరుకున పెట్టడమే. ఇక అంతటితో ఈ దూకుడు ఆగలేదు. ఏకంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ వరదల్లో కొట్టుకుపోవడానికి ఏపీ సర్కార్ వైఫల్యమే కారణం అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలాగే అన్నమయ్య ప్రాజెక్ట్ గల్లంతు మీద కేంద్రం విచారణకు కూడా ఆదేశించడం ఇక్కడ విశేషం.

ఇపుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా పెద్దల సభలోనే ఏపీ సర్కార్ పరువు తీసేశారు. ఏపీకి 57 వేల కోట్ల అప్పులు వివిధ బ్యాంకుల ద్వారా ఉన్నాయన్న నగ్న సత్యాన్ని బయటపెట్టి మరీ జగన్ ఏలుబడి మీద విమర్శలు వచ్చేలా చేశారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా కేంద్రం కుండబద్ధలు కొట్టేసింది. కేవలం ఇరిగేషన్ కంపోనెంట్ కి మాత్రమే తాము నిధులు ఇస్తామని తేల్చిచెప్పింది. నత్తనడకగానే ప్రాజెక్ట్ పనులు సాగుతాయని కూడా చెప్పకనే చెప్పింది. దాంతో పోలవరం ఎపుడు పూర్తి అవుతుంది అంటే దానికి జవాబు లేదు.

ఇలా అనేక అంశాలలో కేంద్ర వైఖరి ఏపీకి ఇరకాటంగానే మారేలా ఉంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ కేంద్రానికి మద్దతుగా ఉంటానని చెబితే ఈ సీన్ మొత్తం మారుతుందేమో కానీ లేకపోతే 2022లో మరిన్ని రాజకీయ చిత్రాలు కూడా చూపిస్తారు అనే అంటున్నారు. అది జగన్ సీబీఐ కేసుల దాకా కధను తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి షాకుల మీద షాకులకు వైసీపీ పెద్దలు రెడీ అయిపోవాల్సిందే.


× RELATED జీతాలు పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
×