బాబు ఆ పని ఎందుకు చేయరు...!

టీడీపీలో ధిక్కార స్వరాలు ఉండవు. ఉన్నా కూడా చంద్రబాబు లైన్లోకి దిగిపోయి.. వాటిని సరిదిద్దే ప్రయ త్నాలు చేస్తారు. నేతలు ఎవరైనా గళం విప్పితే.. సరిచేస్తారు. అయితే.. గత ఎన్నికల్లో.. టీడీపీ తరఫున విజయం దక్కించుకుని.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నవారి విషయంలో చంద్రబాబు చర్యలు తీసుకోలేక పోవడం.. ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో 23 మంది సభ్యులు టీడీపీ టికెట్ పై విజయం దక్కించుకున్నారు. అయితే.. వీరిలో నలుగురు.. మాత్రం పార్టీకి దూరమయ్యారు. వీరు పార్టీకి దూరం కావడంతోపాటు.. వైసీపీకి అనుకూలంగా ఉన్నారు.

ఇక ఇలా జంప్ చేసిన వారిలో మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉన్నా.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం దూకుడుగా ఉన్నారు. చంద్రబాబుపైనా.. ఆయన కుమారుడుపైనా.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో రగడ వెనుక.. వంశీ వ్యాఖ్యలే ఉన్నాయని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా.. వంశీని తీవ్రస్తాయిలో హెచ్చరించింది. ఇక టీడీపీ నాయకులు కూడా అదే రేంజ్లో విమర్శలు గుప్పించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒక టాక్ వస్తోంది. అదేంటంటే.. వంశీ విషయంలో చంద్రబాబు ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే!

ఆశ్చర్యంగా అనిపించినా.. నిజం. ఎందుకంటే.. టెక్నికల్గా వంశీ ఇప్పటికీ.. టీడీపీ తరఫునే సభ్యుడిగా ఉన్నారు. పార్టీకి కానీ.. అసెంబ్లీ సభ్యత్వానికి కానీ.. ఆయన రాజీనామా చేయలేదు. కానీ..అధికార వైసీపీకి మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వంశీ విమర్శలు చేస్తే.. తమకు సంబంధం ఏంటని.. వైసీపీ నాయకుల నుంచి గుసగుస వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికీ.. చంద్రబాబు పార్టీలోనే వంశీ ఉన్నారు. నెల నెలా ఆయన టీడీపీ సభ్యుడిగానే అసెంబ్లీ నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వంశీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

పోనీ.. రాజకీయాలు చంద్రబాబుకు కొత్త అనుకుంటున్నారా? అది కానేకాదు. మరి ఇప్పుడు ఆయనను ఎందుకు పార్టీలోనే కొనసాగించాలి?  కమ్మ సామాజిక వర్గం దూరమవుతుందని అనుకుంటున్నారా?  అసలు వంశీ చేస్తున్న వ్యాఖ్యలతో తాము తలెత్తుకోలేక పోతున్నామని.. గోరంట్ల బుచ్చయ్య వంటివారు బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు సాచివేత ధోరణి ఎందుకు? అనేది ప్రశ్న. వంశీని తన పార్టీ సభ్యుడిగానే కొనసాగిస్తూ.. ఆయనతో మాటలు పడడం వల్ల.. పబ్లిక్లో చంద్రబాబు ఇమేజ్ తగ్గుతోందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
× RELATED జీతాలు పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
×