జగన్ మొదలెట్టేసినట్లేనా... ?

ఏపీ ముఖ్యమంత్రిగా కుర్చీలో ఇలా కూర్చున్నారో లేదో అలా విపక్షం ఆయన ఎపుడు దిగిపోతారా అనే ఎదురుచూస్తూ వచ్చింది. ఏ సీఎం కి లేని విధంగా కనీసం హానీ మూన్ పీరియడ్ ని కూడా జగన్ ఇవ్వకుండా విపక్షాలు మొదట్లోనే ఆందోళన స్టార్ట్ చేశాయి. ఇపుడు సగం కాలం పూర్తి అయింది కాబట్టి అధికార పార్టీలోనూ వేడి పుడుతోంది. అందుకు సాక్ష్యం జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు. గత రెండున్నరేళ్ల కాలంలో జగన్ మీద గట్టిగా హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ఒక ప్రయత్నం అయితే సాగింది. దాన్ని ఎప్పటికపుడు వైసీపీ నేతలు తిప్పికొడుతున్నా కూడా విపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.

దాంతో దాన్ని ఎలా నరుక్కురావాలో అలాగే జగన్ చేస్తున్నారు అనుకోవాలి. విశాఖలోని శారదాపీఠం స్వామీజీ జగన్ కి నిండు దీవెనలు ఇస్తూ ఆయన పాలన సవ్యంగా సాగాలని ఈ రోజుకూ కోరుకుంటూ ఉంటారు. జగన్ కూడా సీఎం కాగానే శారదాపీఠం వచ్చి మరీ అక్కడ కార్యక్రమాలను తిలకించి వెళ్ళారు. అంతకు ముందు రుషీకేశ్ లో గంగానదిలో ఆయన స్నానమాచరించి స్వరూపనందేంద్ర ఆశీస్సులతో ప్రత్యేక  పూజలు చేశారు. అలా తన మీద హిందూ వ్యతిరేక ముద్రను తగ్గించుకుంటూ వస్తున్న జగన్ ఇపుడు హఠాత్తుగా కర్నాటకకు  చెందిన దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దీవెనలు కూడా అందుకున్నారు.

స్వామీజీ ఆశ్రమం విజయవాడలో కూడా  ఉంది. అక్కడకు వచ్చిన స్వామీజీని జగన్ తాజాగా కలుసుకోవడం రాజకీయంగా విశేషంగానే పేర్కొంటున్నారు. స్వామీజీతో జగన్  భేటీ వెనక చాలా అంశాలు ఉన్నాయని అంటున్నారు. తనపైన అదే పనిగా హిందూ వ్యతిరేక ముద్ర వేస్తున్న విపక్షాలకు చెక్ చెప్పడానికే ఆయన స్వామీజీ ఆశీర్వాదాలు తీసుకున్నారని చెబుతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన స్వామీజీ కూడా జగన్ అన్ని మతాలు గౌరవిస్తారు ఆయన హిందూ వ్యతిరేకి కాదు అని కితాబు ఇచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయి.

ఇక ఈ మధ్యన జగన్ తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా  అక్కడికి వెళ్ళినపుడు స్వామి వారి ప్రసాదాన్ని వాసన చూశారంటూ టీడీపీ నేత లోకేష్ చేసిన కామెంట్స్ కూడా ఈ సందర్భంగా ప్రస్థావనార్హం.  లోకేష్ తో పాటు రెబెల్ ఎంపీ రాజు కూడా జగన్ మీద ఇలాగే కామెంట్స్ చేశారు. జగన్ ఏం చేసినా విమర్శలు చేయడం ఆయనను ఒక మతానికి వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు చూస్తున్న వేళ జగన్ కూడా తనదైన వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు. రానున్న రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందువల్ల ప్రతీ చిన్న విషయం జనాలలోకి వెళ్ళిపోతోంది. దాన్ని కట్టడి చేసేందుకు విపక్షాలకు చెక్ చెప్పేందుకు జగన్ ఇక మీదట మరింత దూకుడుగానే పాలిటిక్స్ చేస్తారు అంటున్నారు.
× RELATED జీతాలు పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
×