సమస్యకు కారణం అతడేనంటున్న ప్రకాష్ రాజ్

మా ఎన్నికల ఫలితాలు వెలువడి ఓడిపోయినా కూడా ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గడం లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటూ పంతం పట్టాడు. దీంతో ‘మా’ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మంచు విష్ణు ప్యానెల్ దౌర్జన్యాలను ప్రజలకు చూపించాలనే  పట్టుదలతో ప్రకాష్ రాజ్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకోసం వడివడిగా ముందుకెళుతున్నారు.

ఇక ‘మా’ ఎన్నికల్లో దౌర్జన్యాలకు సాక్ష్యాలైన సిసీ ఫుటేజీని తీసుకోవడానికి ప్రకాష్ రాజ్ కు అభ్యంతరం ఏమీ లేదని.. ఆయన తీసుకోవచ్చంటూ మంచు విష్ణు ప్రకటించడం మరింత కాకరేపుతోంది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ తాజాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు మరో నటుడు తన ప్యానల్ సభ్యుడు బెనర్జీతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద మీడియాతో ప్రకాష్ రాజ్ మాట్లాడారు.

ఎన్నికల రోజు మంచు విష్ణు ప్యానల్ దౌర్జన్యానికి పాల్పడిందని తాను నమ్ముతున్నానని తెలిపారు.అందుకే సీసీ టీవీ ఫుటేజీ అడిగామన్నారు.దీనికి ఎన్నికల అధికారి నిబంధన పేరుతో నిరాకరించారు.. కోర్టుకు వెళ్లాలని సూచించారన్నారు.

తమకు ప్రత్యర్థి మంచు విష్ణుతో  ఎలాంటి సమస్యా లేదన్నారు. తమ సమస్య మొత్తం ఎన్నికల అధికారితోనే అని ప్రకాష్ రాజ్ తేల్చిచెప్పారు. పారదర్శకంగా ఎన్నికలు జరగలేదని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.

తమ ఫిర్యాదులను ఎన్నికల అధికారి పట్టించుకోలేదని.. ఓట్ల లెక్కింపుపై కూడా సందేహాలున్నాయని.. వాటిని నివృత్తి చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చానని ప్రకాష్ రాజ్ తెలిపారు. మొత్తానికి ‘మా’ ఎన్నికల అక్రమాలను బయటపెట్టడానికి ప్రకాష్ రాజ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
× RELATED జీతాలు పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
×