విక్రమ్ సాహసాలకు .. ప్రయోగాలకు 31 ఏళ్లు!

విక్రమ్ .. తమిళనాట సీనియర్ స్టార్ హీరోలలో రజనీకాంత్ .. కమలహాసన్ తరువాత వినిపించే పేరు. ఒక వైపున రజనీకాంత్ తన స్టైల్ తో కోలీవుడ్ ను ఊపేస్తున్నారు. మరో వైపున కమల్ ప్రయోగాత్మకమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఆ తరువాత వరుసలో ఉన్న హీరోలు కూడా ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటూ వెళుతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే విక్రమ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే అక్కడున్న పోటీని తట్టుకోగలమా లేదా అనే ఆలోచనలో ఆయన ఉండగానే తెలుగు నుంచి విక్రమ్ కి అవకాశాలు వెళ్లాయి.

తెలుగులో 'చిరునవ్వుల వరమిస్తావా' అనే ఒక చిన్న సినిమాతో కథానాయకుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'అక్క పెత్తనం చెల్లెలి కాపురం' .. 'బంగారు కుటుంబం'లో ఆయన ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆ సినిమాలు చూసినవారుగానీ .. ఆ సినిమాలు చేసినవారుగాని విక్రమ్ ఇంత గొప్ప స్టార్ అవుతాడని ఊహించి ఉండరు. బహుశా ఈ స్థాయికి ఎదుగుతానని విక్రమ్ కూడా అనుకుని ఉండకపోవచ్చు. తెలుగులో నాయిక ప్రధానమైన కథల్లో సపోర్టింగ్ రోల్స్ ఎక్కువగా వస్తుండటం విక్రమ్ కి కాస్త అసంతృప్తిని కలిగించింది. దాంతో ఆయన తిరిగి ఆయన చెన్నై దారి పట్టారు. అలా వెనక్కి వెళ్లిన విక్రమ్ .. చియాన్ విక్రమ్ గా 31 ఏళ్ల నటప్రస్థానాన్ని పూర్తి చేశాడు.

ఈ సారి ఆయన రజనీకాంత్ .. కమల్ లోని ప్రత్యేకతలను చాలా దగ్గరగా పరిశీలించారు. ఒక పనిని పనిగా కాకుండా తపస్సులా చేయడమే వాళ్లు ఆ స్థాయికి రావడానికి కారణమనే విషయం ఆయనకి అర్థమైంది. అప్పటి నుంచి ఆయన ఆలోచనా విధానం మారిపోయింది. ఏ పాత్ర కోసమైనా ముందుగా ఎవరినో అనుకుని తప్పనిసరి పరిస్థితుల్లో తనని తీసుకోకూడదు. తన కోసమే పాత్రలను క్రియేట్ చేసే పరిస్థితి రావాలనే పట్టుదలతో ఆయన రంగంలోకి దిగాడు .. కసిగా కసరత్తులు చేశాడు. 'ఉల్లాసం' సినిమా ఆయన ఉనికిని తెలిపితే ఆ తరువాత వచ్చిన 'సేతు' సినిమా ఆయనను నిలబెట్టేసింది.

ఈ సినిమా నుంచి విక్రమ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 'శివపుత్రుడు' .. 'అపరిచితుడు' వంటి సినిమాలు అసమానమైన ఆయన నటనకు అద్దం పడతాయి. 'అపరిచితుడు'లో ఆయన నటన పరంగా విశ్వరూప విన్యాసమే చేశాడు. 'ఐ' సినిమా చూసిన తరువాత తెరపై అలా కనిపించడానికి చాలా గట్స్ ఉండాలని అనుకోనివారు లేరు. ఒక పాత్ర కోసం బరువు పెరగడం .. మరో పాత్ర కోసం బరువు తగ్గడం .. ఏది చేసినా .. ఎలా చేసినా తెరపై పాత్ర తప్ప విక్రమ్ కనిపించడు అదే ఆయన ప్రత్యేకతగా మారిపోయింది.

కథ కొత్తగా ఉండాలి .. తన పాత్ర వైవిధ్యంతో ఉండాలి .. గతంలో మాదిరిగా మరో సినిమాలో తాను కనిపించకూడదనేది ఆ ఆయన పెట్టుకున్న నియమం. తన డైలాగ్ డెలివరీనీ .. బాడీ షేప్ ను కూడా ఆయన పాత్రను బట్టి మార్చుకుంటూ ఉంటారు. అలా కొత్తదనం కోసం ఆయన పడిన కష్టమే ఈ రోజున ఆయనను అంతా 'చియాన్' అని పిలుచుకునేలా చేస్తోంది. రజనీకాంత్ .. కమల్ వంటి స్టార్ హీరోల నుంచి గట్టిపోటీనే ఎదుర్కొంటూనే సూర్య .. విజయ్ .. అజిత్ వంటి స్టార్ హీరోల ధాటిని కూడా కూడా తట్టుకుని ఆయన నిలబడేలా చేసింది ఆయనలోని ఆ ప్రత్యేకతనే. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విలక్షణమైనవే కావడం విశేషం. నటుడిగా 31 ఏళ్ల ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.
× RELATED నిద్ర పట్టడం లేదా పుష్ప?
×