అచ్చ తెలుగుమ్మాయ్.. చదివింది బీఏ.. 205 దేశాల సిబ్బందికి బాస్

అచ్చ తెలుగుమ్మాయ్. తన సొంత కష్టంతో అదరగొట్టేసింది. ఒక పెద్ద కంపెనీకి బాస్ గా ఎంపికయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయసేవల సంస్థల్లో ఒకటైన డెంటన్స్ కు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా నియమితులైన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె పేరు.. నీలిమ పాలడుగు. ఎవరి సాయం లేకుండా.. కష్టపడే తత్త్వంతో పాటు.. మిగిలిన వారి కంటే భిన్నంగా పని చేసే ఆమెకు సంబంధించిన అంశాల్ని చూస్తే.. ఒక్కరు ఇన్ని పనులు చేయగలరా? అన్న సందేహం కలుగక మానదు. ఆసక్తిని రేపే ఆమెకు సంబంధించిన వివరాల్ని చూసినప్పుడు.. సాటి తెలుగువాడిగా గర్వపడటమే కాదు.. ఆమె పెద్ద స్ఫూర్తిదాతగా కనిపిస్తారు. ఆమె తన ప్రయాణం గురించి ఏం చెప్పారు? ఉద్యోగంతో పాటు ఇంకేం చేస్తారు? లాంటి విషయాల్ని ఆమె మాటల్లోనే చూస్తే..
మాది విశాఖపట్నం. నాన్న.. అమ్మ.. తమ్ముడు.. ఇదే మా కుటుంబం. కొటక్ స్కూల్లో స్కూలింగ్.. సెయింట్ జోసెఫ్ లో బీఏ పూర్తి చేశా. చిన్నతనంలో సైకాలజిస్టు అవ్వాలనుకున్నా. అందుకే బీఏలో సైకాలజీ.. పొలిటికల్ సైన్స్.. ఇంగ్లిషు లిటరేచర్ ను ఎంపిక చేసుకున్నా. నేను అనుకున్నట్లుగా సైకాలజిస్టును కాలేకపోయినా.. హెచ్ ఆర్ గా బాధ్యతల్ని చేపట్టటం ద్వారా చాలామంది మనస్తత్వాల్ని అర్థం చేసుకునే వీలు కలిగింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత టైటాన్ షోరూంలో ఒక ఉద్యోగిగా కొంతకాలం పని చేశారు. ఈ అనుభవం తర్వాతి రోజుల్లో న్యూజిలాండ్ లో ఉద్యోగం సాధించేందుకు సాయం చేసింది. కుటుంబం విషయానికి వస్తే.. భర్త సుధాకర్. తనది హనుమాన్ జంక్షన్. పెళ్లి తర్వాత కొన్నాళ్లు న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాలో ఉన్నాం. పద్దెనిమిదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాం. ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెద్దది.. అబ్బాయి చిన్నోడు. అమ్మాయికి కథక్ ఇష్టం. అబ్బాయికి సోకర్ అంతే ప్రాణం.

ఉద్యోగంలో భాగంగా మెరిల్ లించ్.. పీడబ్ల్యూసీ.. ఇంటర్నేషనల్ మెషిన్స్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల్లో పని చేశాను. ప్రస్తుతం డెలాయిట్ లో హెచ్ ఆర్ విభాగంలో గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నా. తాజాగా డెంటన్స్ గ్లోబల్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా ఎంపికయ్యా. డెలాయిట్ కు 85 దేశాల్లో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటే.. డెంటన్స్ కు 205 దేశాల్లో శాఖలు ఉన్నాయి. ఇప్పుడీ ఉద్యోగులందరికి సారథ్యం వహించనున్నా. నిత్యం శ్రమించటం.. కొన్ని సందర్భాల్లో ఇంటిని.. ఆఫీస్ ను మేనేజ్ చేయటం కష్టం. అలాంటి సందర్భాల్లో ఓర్పుగా నేర్పుతో వ్యవహరిస్తే.. సమస్యను అధిగమించటం కష్టం కాదు. నా సక్సెస్ లో మావారి సహకారం చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో భాగంగా రాత్రిళ్లు పని చేయాల్సి వచ్చేది. అలాంటివేళలో ఆయన ఇచ్చిన సహకారం మరవలేనిది.

ఉద్యోగం ఉద్యోగమే. వ్యక్తిగత ఇష్టాలు వేరే. వాటిని బ్యాలెన్స్ చేస్తా. పర్వతారోహణ అంటే ఇష్టం. ప్రతి ఏటా హిమాలయాల్లోని వివిధ పర్వతాల్ని అధిరోహిస్తూ ఉంటాను. దీనికోసం ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాటిని అధిగమించటం ద్వారా.. భయాన్ని పోగొట్టుకున్నా. తొలిసారిగా ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించా. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే కిలిమంజారో పర్వతాన్ని మొదటి ప్రయత్నంలోనే ఎక్కేశా. ఈ సందర్భంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా. ఇప్పుడు మాత్రం ముందస్తుగా ట్రైనింగ్ తీసుకొని మాత్రమే పర్వతాల్ని ఎక్కుతున్నా. దీంతో పాటు.. ఆఫ్రికన్ చిన్నారుల చదువుల కోసం క్లైంబ్ ఫర్ ఏ చైల్డ్.. భారత్ తో నాన్హి కలి.. రెస్క్యు ఎయిడ్ ప్రాజెక్టులతో సాయం చేస్తున్నానని చెప్పారు. ఇలా ఇంటిని.. జాబ్ ను బ్యాలెన్సు చేసుకుంటూ అత్యుత్తమ స్థానానికి ఎదగటం..అంత తేలికైన విషయం కాదు. హేట్సాఫ్ చెప్పాల్సిందే.× RELATED ఏపీలో రాజధానిపై మీ అభిప్రాయమేంటి? తుపాకీ సర్వే ఫలితం ఇదే!
×