జేసీ వారసుడి దూకుడు.. వైసీపీ ఖాళీ అవుతోందిగా!

అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయిన జేసీ బ్రదర్స్.. దివాకర్ ప్రభాకర రెడ్డిలకు కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మరోసారి.. వారి హవా కనిపిస్తోంది. దాదాపు 40 సంవత్సరాలు ఇక్కడ అప్రతిహత విజయం దక్కించుకున్న జేసీ బ్రదర్స్.. పార్టీలు ఏవైనా.. గెలుపు గుర్రం ఎక్కడం.. తమ మాటే చెల్లేలా చేసుకోవడం.. వంటివి అందరికీ తెలిసిందే.అ యితే.. గత ఎన్నికల్లో తమ వారసులను నిలబెట్టిన విషయం తెలిసిందే. ప్రభాకర్ తనయుడు అస్మిత్‌రెడ్డి.. తాడిపత్రి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయగా.. దివాకర్ తనయుడు పవన్ రెడ్డి.. అనంతపురం పార్లమెంటు స్తానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే.. ఆ తర్వాత.. అస్మిత్ ప్రభాకర్‌రెడ్డిలపై కేసులు నమోదు కావడం.. కొన్ని రోజులు జైల్లో కూడా గడపడం.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం.. కేసులు.. ఇలా అనేక విషయాలు సంచలనంగా మారాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తాడిపత్రి మునిసిపాలిటీని ప్రభాకర్‌రెడ్డి టీడీపీ తరఫున దక్కించుకున్నారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీ దూకుడు చూపించినా.. ఇక్కడ మాత్రం ప్రభాకర్‌రెడ్డి పాగా వేశారు. ఆదిలో జగన్ వల్లే ఇక్కడ గెలిచానని చెప్పి.. సంచలనం సృష్టించిన ఆయన.. తర్వాత తర్వాత.. మళ్లీ తనయుడి రాజకీయాలు పుంజనుకునేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న అస్మిత్ రెడ్డి.. వచ్చే ఎన్నికలపై వ్యూహాన్ని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ``మన ఊరు-మన బాధ్యత`` పేరుతో ప్రతి రోజూ ప్రజల్ని కలుస్తున్నారు. ఇంటింటికి తిరిగి సమస్యల్ని తెలుసుకుం టూ నియోజకవర్గంలో  పర్యటనలు కొనసాగిస్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అంతేకాదు.. పార్టీ తరపున వ్యక్తిగతంగాను కూడా అస్మిత్ దూకుడు పెంచారు. వైసీపీ నేతలను సాధ్యమైనంత మందిని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎంతో బలమైన కంచుకోట అయినప్పటికీ.. గత ఎన్నికల్లో ఇక్కడ జేసీ వారసుడిగా ఆయన పరాజయం పాలయ్యారు.

దీనిపై ఇటీవల కాలంలో అస్మిత్ దృష్టి పెట్టారు. ఏం జరుగుతోంది?  ఏం జరగాలి? అనే  అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లపైనే సమయం ఉన్నా.. ఏమో.. ముందస్తు కనుక వస్తే.. ఏం చేయాలనే వ్యూహంతో వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది.  పైగా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అప్పుడే వ్యతిరేకత పొడచూపడం కూడా అస్మిత్‌కు కలిసి వస్తున్న అంశంగా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా అస్మిత్ వైపు మొగ్గు చూపుతున్నారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేత మధు రాజు టీడీపీలో చేరారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ అస్మిత్ రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.

ఆయనతో పాటూ మరికొందరు కార్యకర్తలు అభిమానులు సహా 300మంది వరకు పార్టీలో చేరారు. వారికి జేసీ కుటుంబం సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరడం ఆనందంగా ఉందని.. వైసీపీలో కష్టపడిన కార్యకర్తలకు అభిమానులకు ఎలాంటి గుర్తింపు లేదని.. అందుకే టీడీపీ చేరామని చెబుతున్నారు. సో.. ఈ పరిణామాలను బట్టి అస్మిత్ దూకుడు పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి.
× RELATED హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు .. రూ. 31 లక్షల జరిమానా
×