విశాఖపై లోకేష్ ఫోకస్... ?

విశాఖ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ ద్వారం. విశాఖ టీడీపీకి కంచుకోట. జగన్ ప్రభంజనం ఒక వైపు బలంగా వీచినా కూడా విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ పరం అయ్యాయి. అంతే కాదు కేవలం మూడంటే మూడు వేల ఓట్ల తేడాతో విశాఖ ఎంపీ సీటుని టీడీపీ కోల్పోయింది. నాడు జనసేన కనుక రంగంలో లేకపోతే విశాఖ ఎంపీ సహా మరిన్ని ఎమ్మెల్యే సీట్లు టీడీపీ సొంతమని రాజకీయ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది మొదట్లో జరిగిన విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో ముప్పయి వార్డులను టీడీపీ గెలుచుకుని సత్తా చాటింది. అంటే సిటీలో గట్టి పట్టున్నట్లే కదా అన్నది తమ్ముళ్ల మాట.

దీంతో విశాఖలో బలాన్ని పెంచుకుని తద్వారా ఉత్తరాంధ్రా జిల్లాలకు సరికొత్త ఊపు తేవాలని టీడీపీ భారీ ప్రణాళికలనే రూపొందిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా వేళ కూడా అనేక సార్లు విశాఖ వచ్చిన లోకేష్ ఇపుడు మరో మారు స్మార్ట్ సిటీలో టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 20న విశాఖ పర్యటనకు లోకేష్ వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లిలో టీడీపీ ఆఫీస్ ని ఆయన ప్రారంభిస్తారు. అంతే కాదు విశాఖలో మరి కొన్ని పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు.

ఇక విశాఖ సిటీలో ఈ మధ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన మైనర్ బాలిక ఫ్యామిలీని పరామర్శిస్తారని అంటున్నారు. ఏపీలో మహిళలకే కాదు మైనర్లకు కూడా ఎటువంటి రక్షణ ప్రస్తుత ప్రభుత్వంలో లేదని ఈ మధ్యనే ట్వీట్ చేసి రచ్చకు రంగం సిద్ధం చేసిన లోకేష్ విశాఖ టూర్ లో వైసీపీ సర్కార్ మీద మరిన్ని బాణాలు వేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు.

ఇక విశాఖ పొలిటికల్ గా ఇపుడు ఏపీ రాజకీయానికి హాట్ స్పాట్ గా మారుతోంది. వైసీపీ ఎటూ పరిపాలనా రాజధాని అంటోంది. దాంతో టీడీపీ కూడా తన యాక్టివిటీని ఒక్కసారిగా పెంచేసింది. ముందు లోకేష్ తరువాత అంటే వచ్చే నెలలో చంద్రబాబు కూడా విశాఖ టూర్ పెట్టుకుంటారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పోయిన చోటనే వెతుక్కోవాలని అంటారు. విశాఖ నుంచి మొదలుపెట్టి మొత్తం ఏపీ అంతటా సైకిల్ స్పీడ్ పెంచేయడానికి చినబాబు చూస్తున్నారుట. వచ్చే ఎన్నికల్లో అయితే చంద్రబాబు లేకపోతే లోకేష్ కచ్చితంగా విశాఖ నుంచి పోటీకి దిగుతారు అని టీడీపీలో చర్చ సాగుతున్న నేపధ్యంలో చలో విశాఖ అంటూ ఇద్దరు బాబులు చేస్తున్న రాజకీయం పసుపు శిబిరంలో సరికొత్త పరవశాన్ని రేపుతోంది అంటున్నారు.
× RELATED వైసీపీ అధ్యక్ష పదవికి ఎంపీ రఘురామ పోటీనట?
×