కెప్టెన్సీ వేటుపై నోరువిప్పిన వార్నర్.. ఏం చెప్పాడంటే

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి తనని తప్పించడంపై డేవిడ్ వార్నర్ మొదటిసారి పెదవి విప్పాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తొలుత కెప్టెన్సీ నుంచి వార్నర్‌ని తప్పించిన హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్.. ఆ తర్వాత తుది జట్టులో కూడా చోటివ్వలేదు. అయినప్పటికీ.. మౌనంగా ఉండిపోయి.. జట్టుని సపోర్ట్ చేస్తూ వచ్చిన వార్నర్ టోర్నీ ముగిసిన తర్వాత పెదవి విప్పాడు.

వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా టీమ్ ని నడిపించాడు. కానీ హైదరాబాద్ గెలుపు బాట పట్టలేకపోయింది. కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోయా. కానీ అలా ఎందుకు తప్పించారో కనీసం కారణం కూడా నాకు సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ చెప్పలేదు. జట్టు ఓనర్స్ తో పాటు వీవీఎస్ లక్ష్మణ్ టామ్ మూడీ బేలిస్ పై నాకు గౌరవం ఉంది. టీమ్ పరంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే అది కచ్చితంగా ఏకగ్రీవంగానే తీసుకుని ఉంటారు. కానీ నన్ను కెప్టెన్సీని నుంచి తప్పించడానికి గల స్పష్టమైన కారణాన్ని మాత్రం వారు చెప్పకపోవడం మరింత బాధించింది.

ఒకవేళ నేను ప్రశ్నించినా ఆ ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు. అన్నీ మరిచి ముందుకు సాగిపోవాలంతే అని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్లో 8 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 195 పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా.. కనీసం ఒక్కటి కూడా గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాంతో హైదరాబాద్ సీజన్లో మొదటిగా ఆడిన ఆరు మ్యాచ్ లకి గానూ ఐదింట్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వార్నర్‌ని కెప్టెన్సీ నుంచే కాకుండా జట్టుని కూడా తప్పించేశారు. ఐపీఎల్ 2022 సీజన్లో హైదరాబాద్‌కి ఆడటం తనకి ఇష్టమేనని చెప్పుకొచ్చిన వార్నర్ మొత్తం ఫ్రాంఛైజీ ఓనర్ల చేతుల్లో ఉందని స్పష్టం చేశాడు.

హైదరాబాద్ నా రెండో ఇల్లు లాంటిది. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆరాధించారు. ఓ కుటుంబ సభ్యుడిలా చూశారు. హైదరాబాద్ కు వచ్చిన ప్రతీసారి ఎంతో అప్యాయంగా మాట్లాడారు. నా పిల్లల పట్ల అంతే అభిమానాన్ని చూపెట్టారు. ఇవన్నీ నా జీవితంలోనే మర్చిపోలేని మధుర క్షణాలు. హైదరాబాద్ అభిమానులకోసమైనా వచ్చే ఏడాది సన్‌రైజర్స్ జట్టుకు ఆడాలనిపిస్తోంది. కానీ మేనేజ్ మెంట్ తీసుకునే నిర్ణయంపైనే అది ఆధారపడి ఉంది.

నా ఐపీఎల్ భవితవ్యం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కొత్తగా రెండు జట్లు రానున్న నేపథ్యంలో మెగా వేలం జరగనుంది. ఏ జట్టుకు ఆడతానో ఇప్పుడే చెప్పలేను. సన్ రైజర్స్ హైదరబాద్ తరఫున టైటిల్ గెలిచా. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు బ్యాట్ తో రాణించా. నాకిచ్చిన ప్రతీ బాధ్యతను నెరవేర్చా. లోయరార్డర్లో ఆడాల్సి వచ్చినా బరిలోకి దిగా. హైదరాబాద్ తరఫున సుమారు 100 మ్యాచ్‌లు ఆడా. నా శక్తి సామర్థ్యాల మేరకు రాణించా. అందుకు చాలా గర్వంగా ఉంది అని డేవిడ్ వార్నర్ తెలిపాడు. వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎన్నో కఠినమైన సీజన్లను ఆడింది. ఓడిపోయే మ్యాచులను కూడా డేవిడ్ భాయ్ ఒంటిచేత్తో గెలిపించాడు. అద్భుత ఓపెనింగ్ ఇచ్చి ఎన్నోసార్లు భారీ స్కోర్లు అందించారు. పెద్దపెద్ద స్టార్లు లేకపోయినా.. జట్టులో మంచి సమతూకం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించాడు.


× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×