రిపబ్లిక్

చిత్రం : ‘రిపబ్లిక్’

నటీనటులు: సాయి తేజ్-ఐశ్వర్యా రాజేష్-రమ్యకృష్ణ-జగపతిబాబు-ఆమని-సురేఖా వాణి-రాహుల్ రామకృష్ణ-మనోజ్ నందం-శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్
నిర్మాతలు: భగవాన్-పుల్లారావు
స్క్రీన్ ప్లే: దేవా కట్టా-కిరణ్ జయకుమార్
కథ-మాటలు-దర్శకత్వం: దేవా కట్టా


‘వెన్నెల’ ఎంటర్టైనర్‌ తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లాంటి గొప్ప సినిమాతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు దేవా కట్టా. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన దేవా.. ఇప్పుడు ‘రిపబ్లిక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసక్తికర ప్రోమోలతో.. దేవా నుంచి వచ్చిన మరో ‘ప్రస్థానం’లా కనిపించిందీ చిత్రం. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

పంజా అభిరామ్ (సాయి తేజ్) చిన్నతనం నుంచే చాలా తెలివైన విద్యార్థి. అవినీతి పరుడైన తండ్రి అంటే అస్సలు పడని అతను చాలా నిజాయితీతో పెరిగి పెద్దవాడవుతాడు. ఎంఐటీలో సీట్ తెచ్చుకుని అమెరికా వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అతను.. ఒక ఎన్నిక సందర్భంగా తన ఓటు గల్లంతయినందుకు అక్కడి సిబ్బందితో గొడవ పెట్టుకుంటాడు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ తనను సవాల్ చేయడంతో పంతం పట్టి సివిల్స్ రాస్తాడు. పరీక్ష పాసై ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తాడు. తన జిల్లాకే కలెక్టరవుతాడు. ఐతే ఈ ప్రాంతానికే చెందిన విశాఖ వాణి (రమ్యకృష్ణ) ఆధ్వర్యంలో నడిచే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. చేపల చెరువుల పేరుతో అవినీతి.. అక్రమాలు చేస్తూ విశాఖ వాణి లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెలుసుకున్న అభిరామ్.. ఆమెపై పోరాటానికి సిద్ధమవుతాడు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు.. వ్యవస్థలో మార్పు కోసం అభిరామ్ చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కిందా అన్నది తెర మీదే చూడాలి.

కథనం-విశ్లేషణ:

దేవా కట్టా అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘ప్రస్థానం’. ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాల్లేకపోవడం వల్లో.. సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్లో.. ఇంకేవైనా కారణాల వల్లో.. సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదు. కానీ తర్వాత ఈ చిత్రం ‘కల్ట్’ స్టేటస్ తెచ్చుకుంది. దేవా నుంచి అందరూ ఎప్పట్నుంచో కోరుకుంటున్నది ‘ప్రస్థానం’ లాంటి సినిమానే. అతను కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు ‘రిపబ్లిక్’ రూపంలో. సమాజం.. వ్యవస్థలు.. ప్రజలు.. నాయకులు.. అధికారులు.. రాజకీయాలు అంటూ చాలా సీరియస్ ఇష్యూస్ లోకి దిగిపోయాడు దేవా. శాసన వ్యవస్థ.. కార్యనిర్వాహక-న్యాయ వ్యవస్థల్ని ఎలా కమ్మేసిందో.. ప్రజల్ని ఓట్లు వేసే పావులుగా మార్చేసి వాళ్ల జీవితాలతో ఎలా ఆడుకుంటోందో కొంచెం లోతుగానే చర్చించే ప్రయత్నం జరిగిందీ చిత్రంలో. సమకాలీన పరిస్థితుల పట్ల దేవాకు ఉన్న అవగాహన.. అతడిలో గూడుకట్టుకున్న ఆవేదన ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తాయి.

ఇందులో రాసిన కొన్ని సంభాషణలు నేరుగా హృదయాల్ని తాకుతాయి. మెదళ్లలో ఆలోచనా రేకెత్తిస్తాయి. కానీ ఇవన్నీ బాగానే చేసినా.. సినిమాకు ‘కమర్షియాలిటీ’ అనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని దేవా మరిచాడు. అలాగే చివరికొచ్చేసరికి ‘అసలే పర్పస్ తో ఈ సినిమా తీశారు’ అనే ప్రశ్నతో అయోమయంలోకి నెడుతుంది ‘రిపబ్లిక్’. ఆద్యంతం సీరియస్ గా సాగే ఈ సినిమాలో కొంత వరకు కమర్షియల్ గానూ వర్కవుటయ్యే అంశాలున్నప్పటికీ.. ద్వితీయార్ధంలో దారి తప్పిన కథనం.. ప్రేక్షకులకు రుచించని ముగింపు సినిమా మీద ఇంప్రెషన్ ను తగ్గించేశాయి. ఎన్నో ఆశలు రేకెత్తించి.. చివరికి ఒక మామూలు సినిమాలాగే ముగుస్తుంది ‘రిపబ్లిక్’.

కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రతినిధిగా నిలిచే హీరో.. రాజకీయ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే విలన్ మధ్య ఒక రసవత్తర పోరుకు రంగం సిద్ధం చేయడం ద్వారా ఒక దశలో ఎంతో ఎగ్జైటింగ్ గా కనిపించే ‘రిపబ్లిక్’... ఆ పోరు అనుకున్నంత ఉత్కంఠభరితంగా లేకపోవడం.. ముగింపులో తేలిపోవడంతో చాలా సాధారణంగా మారింది. ‘రిపబ్లిక్’ ఆరంభం.. మధ్య దశ వరకు మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రధాన పాత్రలు.. వాటితో ముడిపడ్డ ఆరంభ సన్నివేశాలు సినిమా మీద అంచనాలు పెంచుతాయి. ముందుగా చిన్న చేపల్ని తినేసి.. ఒక దానిపై ఒకటి దాడి చేసుకునే ‘డెవిల్ ఫిష్’ల గురించి ఉపోద్ఘాతంతో సినిమాను మొదలుపెట్టిన దేవా.. రాజకీయ నాయకుల మీద పదునైన వాగ్బాణాలు వేయబోతున్న సంకేతాలు కనిపిస్తాయి సినిమా ఆరంభంలో. ఆ తర్వాత బాల్యంతో మొదలుపెట్టి.. వర్తమానం వరకు హీరో వ్యక్తిత్వం గురించి చెబుతూ పోలింగ్ బూత్ లో ఓటు వేసే సన్నివేశంతో హీరో పాత్రను మొదలుపెట్టిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.

డబ్బులు తీసుకుని ఓట్లు వేసే జనాల ఆలోచన తీరు ఎలా ఉంటుందో పదునైన మాటలతో చెప్పే ప్రయత్నం చేశాడు దేవా ఈ సన్నివేశంలో. హీరో అనే కాకుండా అతడి తండ్రిగా జగపతిబాబు..  విశాఖ వాణిగా రమ్యకృష్ణ.. ఎన్నారైగా ఐశ్వర్యా రాజేష్.. ఇలా ప్రతి ఒక్కరి పాత్రలూ ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రతి పాత్రకూ ఒక నేపథ్యాన్ని పెట్టడం.. ఒక వ్యక్తిత్వంతో కనిపించడం ప్రేక్షకుల్లో ఆయా పాత్రల పట్ల ఆసక్తి రేకెత్తిస్తాయి. వాటిపై అంచనాలు పెట్టుకునేలా చేస్తాయి. దృఢమైన వ్యక్తిత్వం-సంకల్ప బలం ఉన్న హీరో ఒకవైపు.. కుట్రలు కుతంత్రాలతో ఎదిగి అధికారం అందుకున్న విలన్ ఒకవైపు.. ఇలా ఇద్దరి పాత్రలను బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరూ తొలిసారి ఎదురు పడే సన్నివేశం కూడా బాగా తీర్చిదిద్దారు. అందులోని సంభాషణలు తూటాల్లా పేలాయి. ఇంటర్వెల్ సమయానికి ఇద్దరి పోరుకు వేదిక సిద్ధం చేయడంతో ఇక రసవత్తర పోరు చూడబోతున్నామన్న అంచనాలు కలుగుతాయి.

కానీ ‘రిపబ్లిక్’ రెండో అర్ధం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఒక ఐఏఎస్ అధికారి.. అధికార పార్టీ అధినేతకు వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఐతే సివిల్ సర్వెంట్లను రాజకీయ నాయకులు నియంత్రించే అవకాశం లేకుండా ఒక చట్టం తీసుకొస్తే..? ఈ కొత్త ఆలోచన ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ చట్టాన్ని ఆయుధంగా మలుచుకుని హీరో.. శక్తిమంతురాలైన విలన్ మీద ఎలా పోరాడతాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తాం. కానీ వీరి పోరు చప్పగా సాగి నిరుత్సాహ పరుస్తుంది. హీరో పాత్ర చిత్రణ.. వివిధ సన్నివేశాల్లో సంభాషణలు చూస్తే.. వ్యవస్థలో మార్పు కోసం పాటు పడతాడని.. ఒక విస్తృతమైన సమస్యను తీసుకుని దాని మీద పోరాడతాడని..  అనుకుంటాం. కానీ చేపల చెరువులు అనే స్థానిక సమస్యను తీసుకుని దాని మీద పోరాటం మొదలుపెడతాడు. దాని వల్ల సినిమా పరిధే తగ్గిపోయింది. దీని వల్ల హీరో-విలన్ పాత్రలు కూడా కుచించుకుపోయాయి. ఈ సమస్య చుట్టూ కూడా నడిపిన కథనం కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు.

రమ్యకృష్ణ.. ఐశ్వర్యారాజేష్.. జగపతిబాబు.. ఈ ముగ్గురికీ మూడు బ్యాక్ స్టోరీలు నడిపారు. కానీ ఏదీ అంత ఆసక్తికరంగా.. ఎమోషనల్ గా కనెక్ట్ చేసేలా లేదు. దాని వల్లే ద్వితీయార్ధం సాధారణంగా తయారైంది. చాలా మామూలు సన్నివేశాలతో సాగిపోయే ద్వితీయార్ధం.. ముగింపులో మరింత నిరాశకు గురి చేస్తుంది. కోర్టులో ఒకవైపు విలన్ కు అంతా అనుకూలంగా చూపించి.. ఉన్నట్లుండి హీరో ఒక స్పీచ్ ఇవ్వగానే జడ్జి విలన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంలో లాజిక్ కనిపించదు. ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని.. ఆ తర్వాతేమో రియలిస్టిక్ క్లైమాక్స్ తో సినిమాను ముగించారు. వాస్తవం ఇంతే చేదుగా ఉంటుంది.. సొసైటీ ఇప్పుడిలాగే ఉంది అని చెప్పడం దర్శకుడి ఉద్దేశం కావచ్చు కానీ.. ఆ ముగింపు చూశాక ఈ సినిమా పర్పస్ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక దశ వరకు సమాజంలో ఒక మార్పు ఆశించి తీసిన సినిమాలా.. ఒక ఆశావాద చిత్రంలా కనిపించే ‘రిపబ్లిక్’ను ఇలా ‘హోప్ లెస్’గా ముగించడంలో ఔచిత్యం కనిపించదు. సీరియస్ పొలిటికల్ డ్రామాలను ఇష్టపడేవారికి ‘రిపబ్లిక్’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. సగటు ప్రేక్షకులకు మాత్రం ఇది ఏమాత్రం రుచిస్తుందన్నది సందేహమే.

నటీనటులు:

సాయితేజ్ కెరీర్లో చాలా వరకు చేసిన ఎంటర్టైనర్లే. అందుకే అతను సరదా పాత్రలకే బాగా సూటవుతాడు అనిపిస్తుంది. ఐతే ‘చిత్రలహరి’తో సీరియస్ పాత్ర ట్రై చేసి ఓకే అనిపించిన తేజు.. ఇప్పుడు ‘రిపబ్లిక్’లో పంజా అభిరామ్ గా అంతకుమించిన సీరియస్ పాత్ర చేశాడు. దానికి న్యాయం చేయడానికి అతను బాగానే కష్టపడ్డాడు. పాత్రకు తగ్గట్లు అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇలాంటి పాత్రను.. కథను చేయడానికి అంగీకరించినందుకు అతణ్ని అభినందించాలి. ఐతే ఎమోషనల్ సన్నివేశాల్లో అతను ఆశించినంతగా హావభావాలు పలికించలేకపోయాడు. ఈ తరహా సన్నివేశాలు వచ్చినపుడల్లా బేలగా ముఖం పెట్టడం తప్ప ఏమీ చేయలేదు. కొన్ని చోట్ల సంభాషణలు పలికిన తీరు కూడా ఆకట్టుకోదు. ఐశ్వర్యా రాజేష్ బాగా చేసింది. ఆమె పాత్ర ఆరంభంలో అంచనాలు రేకెత్తించి.. ఒక దశలో చాలా కీలకంగా కనిపించి.. ఆ తర్వాత సైడైపోయింది. రమ్యకృష్ణ పాత్ర కూడా అంతే. ఇంట్రడక్షన్లో.. అలాగే హీరోతో ఫస్ట్ ఫేసాఫ్ సీన్లో ఎంతో ఆసక్తి రేకెత్తించే ఆ పాత్రను తర్వాత సరిగా ఉపయోగించుకోలేదు. జగపతిబాబు ఎప్పుడూ చేసే పాత్రలకు భిన్నంగా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. దానికి న్యాయం చేశాడు. ఎస్పీ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఓకే. రాహుల్ రామకృష్ణ ఉన్న కొంతసేపూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆమని లాంటి పేరున్న నటి ఇందులో ఎందుకు నటించిందో అర్తం కాదు. అంత నామమాత్రమైన క్యారెక్టర్ తనది. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

మణిశర్మ సంగీతం బాగానే సాగింది. సినిమాలో పాటలకు ప్రాధాన్యం తక్కువే కానీ.. ఉన్న మూడు పాటలూ సందర్భానుసారం బాగానే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మణిశర్మ స్థాయితో పోలిస్తే కొంచెం తక్కువ ప్రమాణాలతో సాగింది. రమ్యకృష్ణ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో.. యాక్షన్ ఘట్టాల్లో మణిశర్మ తన మార్క్ చూపించాడు. మిగతా చోట్ల ఆర్ఆర్ ఇంకొంచెం మెరుగ్గా ఉండాల్సిందనిపిస్తుంది. సుకుమార్ ఛాయాగ్రహణం బాగుంది. మిగతా సాంకేతిక అంశాలూ ఓకే. నిర్మాణ విలువలకు లోటు లేదు. ఇక దేవా కట్టా రచయితగా.. దర్శకుడిగా అంచనాలను అందుకోలేకపోయాడు. నిజాయితీతో కూడిన ఒక ప్రయత్నం చేయడం అభినందించదగ్గ విషయమే కానీ.. ప్రేక్షకులను ఆ విషయంలో కన్విన్స్ చేయడం కూడా ముఖ్యం. దేవా అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది సంభాషణల విషయంలో. కొన్ని చోట్ల డైలాగ్స్ రిపిటీటీవ్ గా అనిపించినప్పటికీ.. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించేలా.. కొన్ని చోట్ల చప్పట్లు కొట్టించేలా సంభాషణలు సాగాయి. దేవా ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని ఆసక్తికరంగా చెప్పే కథనం మిస్సయింది. ఒక దశ వరకు ఓకే అనిపించినా.. మధ్యలో కథనం పక్కదారి పట్టింది. స్క్రీన్ ప్లే లోపమే సినిమాకు సమస్యగా మారింది.

చివరగా: రిపబ్లిక్.. మంచి ప్రయత్నమే కానీ

రేటింగ్: 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED హీరో
×