జగన్ వర్సెస్ పవన్: స్టార్ హీరోల మద్ధతు ఎవరికి?

పరిశ్రమ సమస్యలపైనా.. ఎగ్జిబిటర్ల ఇబ్బందులపైనా `రిపబ్లిక్` సినిమా ప్రచార వేదికపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. తొలిసారి పవన్ పరిశ్రమ ఇబ్బందుల్ని గుర్తించి ఓ నాయకుడిగా స్పందించడం సర్వత్రా చర్చకు దారి తీసింది. దీంతో పరిశ్రమ నుంచి ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పవన్ వెనుక పరిశ్రమ శక్తులు ఉన్నాయని.. ఆయన్ని ముందుకు తొసింది అవేనని  గుసగుస వినిపిస్తోంది. ప్రజల సమస్యలతో పాటు..పరిశ్రమ సమస్యల్ని కూడా తన నెత్తిని వేసుకుని మోస్తానని మాటివ్వడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిటర్ల నుంచి హీరో నానికి ఎదురైన ఇబ్బందుల్ని గుర్తించి నానీని పవన్ వెనకేసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా పవన్ కి నేచురల్ స్టార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే  తాజాగా యంగ్ కార్తికేయ కూడా పవన్ కి థాంక్స్ చెప్పారు.  పరిశ్రమ సమస్యలకి ఏపీ ప్రభుత్వం త్వరగా పరిష్కారం చూపించాలని ట్విటర్ వేదికగా కోరారు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి మద్ధతు కూడా ఇవ్వను. కానీ పవన్ గారు లేవనెత్తిన సమస్యలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలో సభ్యుడిగా మా అందరి తరుపున పవన్ గళం విప్పారు కాబట్టి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా అందరిపైనా ఉందన్నారు కార్తికేయ. అయితే ఇలా చిన్న హీరోలంతా స్పందించడం ముఖ్యం కాదు. కార్తికేయ చెప్పినట్లు ఇది పరిశ్రమ సమస్య కాబట్టి మిగిలిన అగ్ర హీరోలంతా పవన్ కి మద్దతివ్వాలి.

దాన్ని హీరోలంతా నైతిక బాధ్యతగా తీసుకోవాలి.  మెగా ఫ్యామిలీ హీరోలు కాకుండా మహేష్..ఎన్టీఆర్..ప్రభాస్..రానా లాంటి స్టార్లు పవన్ కి మద్దతుగా ట్వీట్లు చేయాలి. సక్సెస్ అయ్యేంత వరకూ ఆ హీరోలంతా పవన్ వెంట ఉండాలి. ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగించే వారు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్ని పక్కనబెట్టి స్పందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి సమస్యలకు వీలైనంత  త్వరగా పరిష్కారం దొరుకుతుందన్న వాదన వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వానికి మంత్రి పేర్ని నానీకి వైకాపా నాయకులు అండగా ఉన్నట్టే.. ఇప్పుడు పవన్ కి అండగా స్టార్ హీరోలు ముందుకు వస్తారనే భావిస్తున్నారు.

పరిశ్రమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడే ప్రముఖునితోనే ఇండస్ట్రీ ఉండాలని విశ్లేషిస్తున్నారు. టిక్కెట్ ధరలు పెంచే ముందు సామాన్యుడి రోజు కనీస వేతనం కూడా గుర్తు పెట్టుకోవాల్సి  ఉంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక  టిక్కెట్ ధరలు తగ్గడంతోనే కామన్ మ్యాన్ ఏసీ హాల్లో  కూర్చొని సినిమా చూడగలుగుతున్నాడని ఒక సెక్షన్ మద్ధతుగా నిలుస్తోంది. లేదంటే సినిమా ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితమయ్యేదని విమర్శిస్తోంది. అయితే రెండిటినీ మధ్యే మార్గంగా ఎవరికీ సమస్య కాకుండా పరిష్కరించుకోవడం పరిశ్రమకు అటు ప్రభుత్వానికి అవసరం. అలాగే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి కాబట్టి వాటి స్థానంలో ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? అన్నదానిపైనా చర్చ సాగాల్సి ఉంది.
× RELATED యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్
×