సినీ పరిశ్రమ గురించి తెలుసుకొని మాట్లాడు పవన్: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్రపరిశ్రమను ఇబ్బంది పెడుతోందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ వెల్లంపల్లి పేర్ని నానిలు  నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ అయితే పవన్ కళ్యాణ్ సంపూర్ణేష్ బాబులను పోల్చి విమర్శలు గుప్పించారు.

ఆన్ లైన్ టికెట్లను ప్రభుత్వమే విక్రయించాలన్న నిర్ణయంపై నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ మండిపడ్డారు. ఆన్ లైన్ పోర్టల్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. దానివల్ల జరిగే నష్టం ఏంటని నిలదీశారు. ఆన్ లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్రపరిశ్రమలో కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. దీనిపై పవన్ రచ్చ చేయడం సరికాదన్నారు. పవన్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని గుర్తు చేశారు. జవాబుదారీతనం తీసుకురావలన్నదే సీఎం జగన్ ఆలోచన అని అన్నారు.  పారదర్శకత కోసమే ఆన్ లైన్ పోర్టల్ తీసుకొస్తున్నామన్నారు.  అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని మంత్రి అనిల్ తెలిపారు.

ఇక తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. 'ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై సినీ పెద్దల వినతిని ఆమోదిస్తే ప్రభుత్వంపై విషయం చిమ్మడమేంటని ' ప్రశ్నించారు. సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇందుకు తాజాగా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమానే ఉదాహరణగా పేర్కొన్నారు. సినీ పరిశ్రమ గురించి పవన్ కళ్యాణ్ నిజాలు తెలుసుకోవాలన్నారు.

ఏపీలో 1100 థియేటర్లలో 800 నడుస్తున్నాయని.. తెలంగాణలో కేవలం 419 థియేటర్లు మాత్రమే నడుస్తున్నాయని మంత్రి నాని తెలిపారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయన్నారు. నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తోందని తెలిపారు. పవన్ మాటలు జగన్ మీద విషయం చిమ్మే ప్రయత్నమని లవ్ స్టోరీ నిర్మాత నారంగ్ చెప్పాలని మంత్రి నాని సూచించారు. ఈ సందర్భంగా పవన్ పై నాని వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు. 'పీకే గాడు సన్నాసి' అంటూ తిట్టిపోశారు.

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటి? తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసిందని.. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను కేసీఆర్ ను తిట్టాలని మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ చూస్తోందని.. దమ్ముంటే పీకే కేంద్రాన్ని ప్రశ్నించాలని సవాల్ చేశారు.

 ఇక మంత్రి వెల్లంపల్లి సైతం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలతో చెలరేగారు. మొత్తంగా ఈరోజు పవన్ వ్యాఖ్యలకు ముగ్గురు మంత్రులు విరుచుకుపడ్డారనే చెప్పాలి.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×