ఒక్కొక్కరిగా వాళ్లు టీడీపీకి దూరం

2019 ఎన్నికల్లో జగన్ ధాటికి చిత్తయిన తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దయనీయంగా మారిందనే సంగతి తెలిసిందే. అయితే పార్టీని తిరిగి పుంజుకునేలా చేసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే దిశగా బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కక్కొరిగా పార్టీకి దూరమవుతుండడం బాబుకు ఆందోళన కలిగించే విషయమే. వరుసగా టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటుండడంతో ఆ పార్టీ పరిస్థితేంటో నేతల వైఖరి ద్వారానే స్పష్టమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివిధ కారాణాల వల్ల నాయకులు స్వచ్ఛందంగా తప్పుకోవడం పార్టీలో ప్రమాదకరమైన సంకేతాలకు కారణం కానుంది.

టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేదనా? బాబు నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడమా? ఇలా సీనియర్ నేతలు రాజకీయాలకు దూరం కావడానికి కారణాలు ఏమిటీనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది.  2019 ఎన్నికలకు ముందే సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి రాజకీయాలకు వీడ్కోలు పలికారు. ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడంతో పత్తికొండ స్థానాన్ని ఆయన కొడుకు శ్యాంబాబుకు ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.  ఇక అనంతపురంలోనూ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇక్కడా ఆయన తనయుడు పోటీ చేసి ఓడిపోయారు. చిత్తూరు జిల్లాలో కీలకంగా ఉన్న గల్లా కుటుంబం నుంచి రాజకీయ సన్యాసం మాట వినిపించింది. గల్లా అరుణాకుమారి పార్టీ పదవుల నుంచి తప్పుకోవడం అందుకు నిదర్శనం. గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉండడంతో ఆమె పూర్తిగా వాటికి దూరమయ్యారు.

ఇక మాజీ ఎంపీ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా చాలా కాలంగా సైలెంట్గా ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన ఆయన వాటి ప్రస్థావన కూడా తేవడం లేదు. ఇప్పుడిక విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ తన కుటుంబం పోటీ చేయదని చంద్రబాబుకు ఆయన నేరుగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో వేరే వాళ్లకు టికెట్ ఇచ్చుకోవచ్చని బాబుతో డైరెక్టుగానే చెప్పేసినట్లు తెలిసింది. తనపై ఆరోపణలు చేసిన బుద్దా వెంకన్న బొండా ఉమపై బాబు చర్చలు తీసుకోకపోవడమే నాని ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బాబు.. సీనియర్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనన్న ఆసక్తి మొదలైంది. యువ నాయకులకు అవకాశం ఇచ్చినప్పటికీ సీనియర్ల మార్గనిర్దేశనం పార్టీకి అవసరం. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×