భారత్ గొప్పతనాన్ని ‘ఛాయ్ వాలా’తో భలేగా ముడి వేశారుగా?

మాది చిల్లర కొట్టు సార్.. మా నాన్న కూరగాయల వ్యాపారం చేస్తారండి.. మా తండ్రిది టీ బంకు.. ఇలా తమ తండ్రి గురించి చెప్పుకోవటానికి మొమమాటపడుతుంటారు. ఇంకొందరు మాత్రం.. తమ తండ్రి పడిన కష్టాన్ని చెబుతూ.. అంత కష్టంలోనూ కష్టపడి తమను చదివించారంటూ గొప్పగా చెప్పుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ కాస్త భిన్నం. ఆయన తన తండ్రి గురించి కంటే కూడా.. తన గురించే ఎక్కువ చెబుతారు. చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడే రైల్వే స్టేషన్ లో టీ అమ్మేవాడినన్నన విషయాన్ని చెబుతారు. మొదట్లో ఈ మాటను ఆయన రాజకీయ ప్రత్యర్థులు చాలా చిన్నగా చూసేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు అయితే ఎటకారం కూడా చేశారు. కానీ.. ఆ మాట ఎంత శక్తివంతమైనదన్న విషయం మోడీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కానీ అర్థం కాలేదు.

ఏం గాంధీ వంశీకులు మాత్రమే ప్రధానమంత్రులు కావాలా? చిన్నతనంలోనే టీ అమ్మిన  కుర్రాడు పెరిగి పెద్దయ్యాక ప్రధాని మంత్రి కావటం తప్పు అవుతుందా? చిన్నతనంలో అతను టీ అమ్మిన దాన్ని ఎటకారం చేస్తారా? అంటూ ఆగ్రహించిన భారత సమాజం మోడీని అక్కున చేర్చుకోవటమే కాదు.. ఆయన్ను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునే వరకు ఊరుకోలేదు. ఆ తర్వాత నుంచి మోడీ నోటి నుంచి టీ అమ్మే వాడినన్న మాట వచ్చిన ప్రతి సందర్భంలోనూ.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఒకటికి రెండుసార్లు.. ఆయన ఏ సందర్భంలో ఎందుకు ఆ మాటను ప్రస్తావిస్తున్నారన్న విషయాన్ని నిశితంగా పరిశీలించటం షురూ చేశారు.

చాలా రోజుల తర్వాత మరోసారి తన ఛాయి వాలా విషయాన్ని ప్రస్తావించారు మోడీ. ఈసారి విశ్వవేదిక మీద ఆయన ఆ విషయాన్ని మహా గొప్పగా చెప్పుకున్నారు. తొలిసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన మోడీ.. పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో తన గురించి చెప్పుకుంటూ.. దానికి తన దేశం గొప్పతనంతో ముడిపడేలా కలిపిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. టీ స్టాల్ లో టీ అమ్ముకునే చిన్నారి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం తన దేశం కల్పించిందన్నారు. తొలుత ముఖ్యమంత్రిగా పని చేశానని.. ఇప్పుడు ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పిన ఆయన.. భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

దేశంలో పదుల సంఖ్యలో భాషలు.. విభిన్న జాతులు.. వేషధారణ ఉన్న ప్రజలతో పాటు..అనేక సంస్కృతుల సమ్మిళ సమాహారంగా భారత్ ఒక ఉప ఖండంగా ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం దేశాన్ని నాశనం చేస్తుందని.. ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. గత వందేళ్లలోలేని విపత్తును కరోనా కారణంగా ప్రపంచ ఎదుర్కొందన్న మోడీ..   అఫ్ఘాన్ గురించి మాట్లాడిన మోడీ.. ఆ దేశంలోని మహిళలు.. చిన్నారులు.. మైనార్టీల కోసం పాటుపడాలన్నారు.

అఫ్ఘాన్ లో శాంతి స్థాపన ముఖ్యమని చెప్పిన ఆయన.. అంతర్జాతీయ వేదిక మీద దాయాది పాక్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. నెగిటివ్ ఆలోచనలు ఉగ్రవాదానికి దారి తీస్తాయని.. దానిని రాజకీయంగా వాడుకోవద్దన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రాజకీయ వస్తువుగా అనుకుంటుందన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి భారత్ ఉదాహరణ అన్న మోడీ.. భారత్ అభివృద్ది చెందితే ప్రపంచం కూడా వృద్ది చెందుతుందని చెప్పారు.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×