పవన్ పై ఏపీ మంత్రుల అటాక్

రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కావాలంటే తనను ఒక్కడిని టార్గెట్ చేసుకోండి కానీ సినీ పరిశ్రమను వదిలేయాలని ప్రభుత్వం టికెట్లు అమ్ముకోవడం సరికాదంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే సమాధానమిస్తున్నారు. పదునైన వ్యాఖ్యలతో అధికార నేతలు ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు.

టికెట్ల విక్రయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆన్లైన్ పోర్టల్ అంటే పవన్‌కు ఎందుకంత భయమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అయినా లేదా మరే ఇతర నటుడు నటించినా కష్టం అనేది ఒకటే అని తెలిపారు. రాజకీయ ఉనికి కోసం తపించే పవన్ ఈ విషయాన్ని కూడా అందుకే వాడుకుంటున్నారని విమర్శించారు. తన ఒక్కడి కోసం వైసీపీ ప్రభుత్వం చిత్రసీమను ఇబ్బంది పెడుతుందని పవన్ మాట్లాడడం సరికాదని అనిల్ తప్పుపట్టారు. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి కొంతమంది సినిమా పెద్దలే ప్రభుత్వంతో చర్చించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం జగన్‌ను తిట్టడం పవన్‌కు ఫ్యాషనైపోయిందని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆయన అలా మాట్లాడారని అనిల్ పేర్కొన్నారు.

ఇక పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే తమకు లేదని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చిరంజీవి నాగార్జున లాంటి సినీ పెద్దలు సినిమా థియేటర్లు టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని వాళ్లతో సంబంధిత మంత్రి చర్చలు చేస్తున్నారని ఆన్లైన్లో టికెట్లను ప్రభుత్వం విక్రయిస్తే పవన్‌కు నష్టమేంటని మంత్రి ప్రశ్నించారు. పావలా కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన అలా మాట్లాడారని పవన్ అడ్డంగా కోట్లు సంపాదించుకున్నారని సినీ పరిశ్రమలో దోపిడిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాజకీయాల్లో పవన్ పనికిమాలిన స్టార్ అని వెల్లంపల్లి ఘాటుగా సమాధానమిచ్చారు.

సినిమా టికెట్ల విషయంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి బొత్స సత్యనారాయాణ అన్నారు. టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచేస్తామంటే కుదరదని ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వైసీపీ ప్రభుత్వం మంత్రుల గురించి మాట్లాడేటపుడు పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×