జాగ్రత్త పడకపోతే కష్టమేనా ?

తాజాగా వెల్లడైన పరిషత్ ఫలితాలతో అధికార వైసీపీ అప్రమత్తమవ్వాల్సిన అవసరం వచ్చింది. మొక్కే కదాని ఉపేక్షిస్తే రేపు పెద్ద చెట్టై కూర్చున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. రెండు విషయాల్లో వైసీపీ నాయకత్వం అప్రమత్తవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మొదటిదేమో కొన్ని మండలాల్లో ఎంఎల్ఏల మాటకు స్ధానికి నాయకత్వం ఎదురుతిరిగింది. రెండో సమస్యేమో టీడీపీ+జనసేన పార్టీలు ఎనిమిది మండలాల్లో చేతులు కలపటం. దాదాపు పదిమండలాల్లో ఎంఎల్ఏలు చెప్పిన అభ్యర్ధికి మద్దతు తెలపటానికి గెలిచిన ఎంపీటీసీలు ఇష్టపడలేదు.

ఆముదాలవలస ఎంఎల్ఏ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చెప్పిన వ్యక్తిని మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నుకోవటానికి మిగిలిన ఎంపీటీసీలు ఇష్టపడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితునిగా ప్రచారంలో ఉన్న టెక్కలి నేత ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ సూచించిన వ్యక్తిని మండల అధ్యక్షునిగా ఎన్నుకోవటానికి మిగిలిన ఎంపీటీసీలు ఇష్టపడలేదు. ఇలాంటి నియోజకవర్గాలు సుమారు 10 ఉన్నాయి.

ఈ నియోజకవర్గాల్లోని వైసీపీ తరపున గెలిచిన ఎంపీటీసీలే ఎక్కువ. అంటే దాదాపు ఎన్నిక ఏకపక్షంగా జరిగినట్లే లెక్క. అయినా స్పీకర్ ఎంఎల్ఏలు ఎంఎల్సీలు సూచించిన నేతలకు మద్దతుగా ఇవ్వటానికి మిగిలిన ఎంపీటీసీలు ఇష్టపడటంలేదంటే అర్ధమేంటి ? వీళ్ళ నియోజకవర్గాల్లోని అన్నీ మండలాల్లో ఇదే పరిస్దితి ఉందనికాదు. ఒక్క మండలంలోనే అయినా సొంత ఎంపీటీసీల దగ్గరే స్పీకర్ ఎంఎల్ఏలు ఎంఎల్సీ మాట చెల్లుబాటు కాలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది.

క్షేత్రస్ధాయిలోని పరిణామాలు చూస్తుంటే ఎంఎల్ఏలు ఎంఎల్సీ మీదున్న వ్యతిరేకత వల్లే వాళ్ళు సూచించిన నేతలకు మిగిలిన ఎంపీటీసీలు అడ్డంతిరిగినట్లు అర్ధమవుతోంది. దీన్ని వెంటనే సర్దుబాటు చేసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారిపోతుంది. ఈ సమస్యను ఇలాగే వదిలేసినా లేదా నిర్లక్ష్యం చేసినా రేపటి అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. ఒక్కమండలంలోని ఎంపీటీసీలంతా రేపటి ఎన్నికల్లో పార్టీ ఎంఎల్ఏ అభ్యర్ధికి ఎదురు తిరిగితే చాలు ఆ నియోజకవర్గంలో  వైసీపీ గెలుపు కష్టమవుతుంది.  

ఇక రెండో సమస్య అయిన మొత్తం ఎనిమిది మండలాల్లో టీడీపీ+జనసేనలు చేతులు కలిపాయి. ఈ రెండుపార్టీలు కలవటంవల్ల  ఎంపీపీ అధ్యక్ష పదవులకు వైసీపీ దూరమైపోయింది. ఈ ఎనిమిది మండలాల్లో కూడా ఉభయగోదావరిలోనే ఏడు మండలాలున్నాయి. జనసేనకు అరాకొరా బలం ఉందంటే అది ఉభయగోదావరి జిల్లాల్లోనే. పరిషత్ ఎన్నికల్లో 177 ఎంపీటీసీలను జనసేన గెలుచుకోవటం మామూలు విషయంకాదు. దిక్కూ దివాణం లేని పార్టీకి అన్ని ఎంపీటీసీలు వచ్చాయంటేనే ఆశ్చర్యంగా ఉంది.

ఎంపీటీసీలే అనుకుంటే  2 జడ్పీటీసీలను కూడా గ్లాసుపార్టీ గెలిచింది. ఇప్పటివసరాలకు మాత్రమే టీడీపీ జనసేనలు కలిసాయని వైసీపీ నేతలు అనుకునేందుకు లేదు. భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరితే సాధారణ ఎన్నికల్లో వైసీపీ కాస్త ఇబ్బందనే చెప్పాలి. కాబట్టి రెండుపార్టీల కలయికను వైసీపీ సీరియస్ గా తీసుకుని ఇప్పటినుండే రెడీ అవ్వాలి. మరి అధికారపార్టీ నేతలు ఏమి చేస్తారో చూద్దాం.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×