'గాడ్ ఫాదర్' స్క్రిప్టులో మళ్ళీ మార్పులు..?

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్ లో ''గాడ్ ఫాదర్'' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ స్టోరీలోని ప్లాట్ లైన్ ను మాత్రమే తీసుకొని చిరు ఇమేజ్ కు తగినట్లుగా దర్శకుడు స్క్రిప్టు రెడీ చేశారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి చిన్న బ్రేక్ పడిందని టాక్ నడుస్తోంది.

'గాడ్ ఫాదర్' ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన తర్వాతే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ఈ స్క్రిప్టులో చిరంజీవికి కొన్ని సందేహాలు తలెత్తడంతో మళ్ళీ కీలకమైన మార్పులు సూచించారట. ఇప్పుడు దర్శకుడు మోహన్ రాజా వాటికి అనుగుణంగా సీన్స్ రీ రైట్ చేస్తున్నారట. ఈ కారణం చేతనే షూటింగ్ ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో 'ఆచార్య' పెండింగ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయడానికే చిరు ఈ సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నారని.. అది ఫినిష్ అయిన వెంటనే మళ్ళీ తన 153వ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'గాడ్ ఫాదర్' చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్ర చేస్తారని టాక్. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
× RELATED డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన కోట పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ
×