సుకుమార్- కొరటాల తరహాలో గురూజీ..!

టాప్ డైరెక్టర్ లుగా నేమ్.. ఫేమ్ పొందిన తరువాత చాలా మంది దర్శకులు కొత్త బాధ్యతల్ని తీసుకుంటూ మరో దర్శకుడికి అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పటికే లెక్కల మాస్టారు సుకుమార్.. అభ్యుదయ చిత్రాల దర్శకుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చేరిన విషయం తెలిసిందే. సొంతంగా నిర్మాణ సంస్థలని ప్రారంభించి ఇప్పటికే వీరు ఇతర దర్శకులకు తమ శిష్యులకు అవకాశాలు ఇచ్చారు.. ఇస్తున్నారు. ఇదే బాటలో గురూజీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా నడవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

సూర్యదేవర నాగవంశీకి చెందిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నారు. సమర్పకుడిగానే కాకుండా నిర్మాతగానూ త్రివిక్రమ్  వ్యవహరించబోతున్నారు. అయితే బయటికి మాత్రం నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి పేరు వుంటుందట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ భాగస్వామ్యంలో నిర్మించబోయే తొలి చిత్రాన్ని `జాతిరత్నాలు` ఫేమ్ నవీన్ పొలిశెట్టితో వుండబోతోంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడబోతోంది. ఇటీవల `జాతిరత్నాలు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి ఈ మూవీ తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఈ మూవీని త్రివిక్రమ్ కు చెందిన నిర్మాణ సంస్థ ఫ్యార్ట్యూన్ ఫోర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనుంది. రాజమండ్రిలో ఇప్పటికే ఫ్యార్ట్యూన్ ఫోర్ సినిమాస్ పేరుతో  త్రివిక్రమ్ కు సినిమా థియేటర్ కూడా వుండటం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి మూవీతో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా మారుతుండటంతో అంతా ఆల్ ది బెస్ట్ గురూజీ అంటున్నారు.

స్క్రిప్టు- దర్శకత్వ పర్యవేక్షణతో బిజీ

త్రివిక్రమ్ ఇటీవల తాను చేసే సినిమాలకే కాదు.. తన శిష్యులు స్నేహితుల చిత్రాలకు స్క్రిప్టు పనులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలతోనూ బిజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ స్క్రిప్ట్ లంటే విపరీతమైన నమ్మకం. ఇద్దరు స్నేహితులు కావడం..త్రివిక్రమ్ గొప్ప రైటర్ కావడంతో పవన్ అతన్ని ఎక్కువగానే నమ్ముతారు. అందుకే ఇటీవల పింక్- భీమ్లా నాయక్ స్క్రిప్టులకు త్రివిక్రమ్ పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఆయన మాటలు కూడా అందిస్తున్నారు. బాలీవుడ్ సినిమా `పింక్` చిత్రాన్ని `వకీల్ సాబ్` టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది వేణు శ్రీరామ్. కానీ కథలో మార్పులు చేర్పులు చేసింది త్రివిక్రమ్ అని ప్రచారంలో ఉంది. ఆ సినిమా మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ సాగర్ చిత్రం దర్శకత్వంలో మలయాళం సినిమా `అయ్యప్పునం కోషియమ్` ని `భీమ్లా నాయక్`  టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్  భాగస్వామ్యం పబ్లిక్ గానే ఉంది. వకీల్ సాబ్ విషయంలో  పైపైన టచ్ అప్ లు ఇచ్చి పేరు వేసుకోకపోయినా `భీమ్లా నాయక్` కి మాత్రం డైరెక్ట్ గా స్క్రీన్ న్ ప్లే అందిస్తున్నారు త్రివిక్రమ్. ఇంకా దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే.సాగర్ చంద్ర ట్యాలెంటెడ్ అయినా దర్శకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కాబట్టి త్రివిక్రమ్ బ్యాకప్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

తాజాగా మాటల మాంత్రికుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా క్రియేటివ్ మేకర్ క్రిష్ కి కొన్ని విషయాల్లో సాయపడుతున్నట్టు టాక్ వినిపించింది.  ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే పిరియాడిక్ చిత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భారీ పోరాట సన్నివేశాలే ఉన్నాయి. వీటిలో కొన్ని మార్పుల బాధ్యతల్ని త్రివిక్రమ్ కి అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది.
× RELATED 'లవ్ స్టోరీ' మీదనే ఇండస్ట్రీ ఆశలన్నీ..!
×