టీకా ఎగుమతి విషయంలో భారత్ పై అమెరికా ఒత్తిడి

భారత్ నుండి  కరోనా నివారణ వ్యాక్సిన్ ఎగుమతి మొదట్లో వివాదాస్పదం అయ్యింది. ఈ ఏడాది మార్చికి ముందు ఇండియా పలుదేశాలకు కరోనా వ్యాక్సిన్ ను ఎగుమతి చేసింది. సుమారు ఏడు కోట్ల డోసులను వివిధ దేశాలకు ఇచ్చింది. మార్చి సమయంలో ఈ ఎగుమతులు జరగగా ఏప్రిల్ నెల నుంచి ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ పీక్స్ కు చేరింది. ఆ సమయంలో ఎగుమతి అయిన వ్యాక్సిన్ పై దుమారం చెలరేగింది. ఏడెనిమిది కోట్ల డోసుల వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసిందంటూ మోడీ సర్కారు పై విమర్శలు తప్పలేదు. ఆ వ్యాక్సిన్ డోసులను మహారాష్ట్ర వంటి చోట వాడి ఉంటే సెకెండ్ వేవ్ అంత తీవ్ర రూపు దాల్చేది కాదు అంటూ విమర్శలు చేశారు.

దేశంలో పరిస్థితి ఏమిటి..అనేది పట్టించుకోకుండా కనీసం ఒక్క శాతం ప్రజలకు కూడా అప్పటికి వ్యాక్సిన్ వేయకుండా విదేశాలకు వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం ఏమిటనేది  తీవ్ర విమర్శలకు దారి  తీసింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు డిమాండ్ కు తగ్గట్టుగా దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగు. ఒకవైపు చాలా మంది వ్యాక్సిన్  కావాలని అనడం లేదు. ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా రెండో డోసుకు వెళ్లడం తగ్గింది.ఇలా సుమారు రెండు కోట్ల మందికి పైనే రెండో డోసు వ్యాక్సినేషన్ చేయించుకోలేదట. ఇక ఇప్పుడు 45 ఏళ్ల వయసు లోపు వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తున్నా వారిలో కొంతమంది అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రాల వద్ద వ్యాక్సిన్ డోసులు కోట్ల సంఖ్యలో పెండింగ్ లో ఉంటున్నాయి.

మూడో వేవ్ వస్తే తప్ప ప్రజలు వ్యాక్సిన్ కోసం పరుగులు తీసేలా లేరు. వ్యాక్సిన్ వేయించుకుంటే వేయింకున్నారు లేదంటే లేదు కానీ మూడో వేవ్ ప్రభావం లేకపోతే అదే చాలు.ఆ సంగతలా ఉంటే.. ఇండియాలో భారీ ఎత్తున ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లపై అమెరికా కన్ను పడింది. ఇండియాలో 75 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందన్న వార్తల నేపథ్యంలోనో తాజాగా జరిగిన అధినేతల వర్చువల్ మీటింగ్ లోనో ఈ ప్రస్తావన వచ్చిందట. భారత్ మళ్లీ కరోనా వ్యాక్సిన్ లను విదేశాలకు ఎగుమతి చేసే పని మొదలుపెట్టాలని అమెరికా అంటోందట.

అటు వాణిజ్యపరమైన ఇటు పేద దేశాలకు సన్నిహిత దేశాలకు.. ఈ తరహాలో కరోనా వ్యాక్సిన్లను ఎగుమతి చేయాలని అమెరికా సూచన లాంటి ఒత్తిడి చేస్తోందని సమాచారం. తద్వారా వివిధ దేశాల వ్యాక్సిన్ అవసరం తీరుతుందనేది అమెరికా వాదనగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇండియా ఏం చేస్తుందనేది ఆసక్తిదయాకమైన అంశం.75 కోట్ల డోసులు అంటూ సంబరంగా చెబుతున్నాం కానీ ఇండియాకు కావాల్సింది 190 కోట్ల వయోజనుల వ్యాక్సిన్లు అనే విషయాన్ని మరవలేం. రెండో డోసును ప్రజలు లైట్ తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడు వ్యాక్సిన్ కు డిమాండ్ లేదని చెప్పి మళ్లీ  భారీ స్థాయిలో ఎగుమతులు చేసే పరిస్థితి ఉందా కరోనా విషయంలో కీడెంచి మేలెంచాలనే తీరున నడుచుకోవడమే భారత ప్రభుత్వానికి మంచిది. మరోసారి తీవ్ర పరిస్థితులు తలెత్తితే మాత్రం మోడీ ప్రభుత్వం మరింత వ్యతిరేకతను పెంచుకోవడం తథ్యం.
× RELATED గుజరాత్ లో పట్టుబడిన 15000 కోట్ల డ్రగ్స్ కథేంటి?
×