కరోనా కారణంగా నెలలోనే నిరుద్యోగులుగా మారిన 70 లక్షల మంది !

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ సెకండ్ వేవ్  దేశ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావమే చూపుతోంది. దేశంలో నిరుద్యోగ రేటు 7.97 శాతానికి చేరింది. మార్చిలో 6.5 శాతంగా ఉన్న ఈ రేటు ఒక్క నెలలోనే ఒకటిన్నర శాతం మేర పెరగడం గమనార్హం. ఒక్క ఏప్రిల్ నెలలోనే దేశవ్యాప్తంగా మరో 70 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ సంస్థ వెల్లడించింది. వచ్చే కొన్ని  రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే అవకాశం ఉంది. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్రాలు లాక్ డౌన్ లు కర్ఫ్యూలు విధిస్తుండటమే ఈ ఉద్యోగాల కోతకి ప్రధాన కారణం. లాక్డౌన్ల కారణంగానే ఉద్యోగాల సంఖ్య పడిపోతున్నదని సీఎంఐఈ ఎండీ మహేష్ వ్యాస్ వెల్లడించారు.

ఇప్పటికీ వైరస్ వ్యాప్తి ఇంకా ఉద్ధృతంగానే ఉన్న నేపథ్యంలో మే నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై జీడీపీ వృద్ధి రేటు మైనస్ లోకి పతనమైంది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్లు వస్తున్నా కేంద్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు.  గత ఆర్థిక సంవత్సరం మూడు నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు రెండంకెలకు చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే సెకండ్ వేవ్ ఆంక్షల కారణంగా ఇప్పుడు దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బార్ క్లేస్ బ్యాంక్ పీఎల్ సీ ఇండియా వృద్ధి రేటు అంచనాను 11 నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇక ఏప్రిల్ నెలలోనూ తయారీ రంగంలో ఉద్యోగాలు పోతున్నట్లు ఐహెచ్ ఎస్  మార్కిట్ చేసిన మరో సర్వేలో తేలింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్నదని లాక్డౌన్ల కారణంగా ఎంతో మంది కూలీలు తిరిగి గ్రామాల బాట పడుతున్నారని తెలిపింది. ఇక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏప్రిల్ నెలలో 40 శాతం కంటే దిగువకు వచ్చింది.
× RELATED రోనాల్డో-కోకాకోలా వివాదం: క్యాష్ చేసుకున్న ఫెవికాల్
×