కరోనాతో ప్రముఖ హాస్యనటుడు మృతి

సినీప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది ద‌ర్శ‌కులు, న‌టులను బ‌లిగొన్న క‌రోనా మ‌హ‌మ్మారి.. తాజాగా మ‌రో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడిని పొట్ట‌న‌పెట్టుకుంది. కొన్ని రోజులుగా కొవిడ్ తో బాధ‌ప‌డుతున్న కోలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌ పాండు.. ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.

పాండుతోపాటు ఆయ‌న స‌తీమ‌ణి కూడా కొవిడ్ బారిన ప‌డ్డారు. వీరిద్ద‌రూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. పాండు వ‌య‌సు 74 సంవత్సరాలు. కొవిడ్ తోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌డంతో.. ప‌రిస్థితి విష‌మించి ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. పాండు స‌తీమ‌ణి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

పాండు మృత‌దేహాన్ని ఆసుపత్రి నుండి నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. బెసంత్ నగర్ శ్మ‌శాన వాటిక‌లో ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు.

తమిళ చిత్రం ‘‘కారైఎల్లం షెన్మాబాగపూ’’తో తెరంగేట్రం చేసిన పాండు.. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు. ఎన్నో ప్ర‌ముఖ చిత్రాల్లో న‌టించి, గొప్ప క‌మెడియ‌న్ గా పేరు సంపాదించుకున్నారు. రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్లతోపాటు మ‌రెంద‌రో హీరోల‌తో క‌లిసి న‌టించారు.

పాండు తనదైన ముద్రవేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. జ‌య‌ల‌లిత పార్టీ అన్నాడీఎంకే చిహ్నం రెండాకుల గుర్తును రూపొందించింది పాండునే కావ‌డం విశేషం. అంతేకాదు.. త‌మిళ‌రాష్ట్ర టూరిజం లోగోను సైతం ఈయ‌నే డిజైన్ చేశారు. త‌న న‌ట‌న‌తోపాటు డిజైనింగ్ ద్వారా కూడా ఎంతో మందిని ఆక‌ట్టుకున్నారు. పాండు మృతిప‌ట్ల ప‌లువురు కోలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

× RELATED సీన్ కోసం నిజంగానే నా చెంప వాయగొట్టాడు.. ఏడ్చేసా!
×