ఐపీఎల్ బయో బబుల్ లోకి వైరస్ వెళ్లే చిల్లు ఎక్కడ పడింది?

కట్టుదిట్టమైన బయో బబుల్ మధ్య ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. అంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడు వైరస్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? గత ఏడాది యూఏఈలో తప్పని లెక్క ఇండియాలో ఎందుకు మిస్ అయ్యింది? బయో బబుల్ కు చిల్లు పెట్టి మరీ వైరస్ ఎంట్రీ ఇచ్చిందా? లేక.. ఐపీఎల్ జట్టు సభ్యులే బబుల్ కు రంధ్రం చేసి కొవిడ్ కు రాయల్ ఎంట్రీ ఇప్పించారా? అన్న ప్రశ్నలకు తాజాగా సమాధానం లభించింది. ఐపీఎల్ లో పాజిటివ్ కేసులు బయట పడటానికి కారణం ఏమిటి? అసలు లోపం ఎక్కడ దొర్లింది?అన్న వివరాల్ని లెక్క తీశారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ కమిటీ చేసిన విచారణలో వెల్లడైన షాకింగ్ నిజాలు ఇలా ఉన్నాయట.
- మే1న అహ్మదాబాద్ లో ఉన్న వరుణ్ పొట్టలో కాస్తంత సమస్య ఏర్పడితే స్కానింగ్ కోసం తాను బస చేసిన హోటల్ నుంచి బయటకు వెళ్లాడు. స్కానింగ్ పూర్తి చేసుకొని కాసేపటికి హోటల్ కు తిరిగి వచ్చాడు.
- బయో బబుల్ ప్రధాన సూత్రం.. బబుల్ లోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే.. మిగిలిన వారితో అతన్ని కలపకుండా కనీసం రెండు వారాల పాటు విడిగా ఉంచుతారు. కానీ.. ఆ ప్రధానమైన రూల్ బ్రేక్ అయ్యింది.
బయో బబుల్ ప్రధాన రూల్ ను వరుణ్ మిస్ చేసి.. నేరుగా తన జట్టు సభ్యులతో కలిసిపోయాడు.

-  ఆ తర్వాత  తన రాష్ట్రానికి చెందిన కోల్ కతా జట్టు సహచరుడు సందీప్ వారియర్ తో కలిసి హోటల్లో భోజనం చేశాడు. అనంతరం వారిద్దరు జట్టు సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణించి ప్రాక్టీస్ కోసం స్టేడియంకు చేరుకున్నాడు.
- స్టేడియంకు వెళ్లిన తర్వాత ఒంట్లో బాగోలేదని చెప్పటంతో విశ్రాంతి కోసం అక్కడే ఉన్న గదిలో ఉన్నాడు. మిగిలిన వారంతా ప్రాక్టీస్ కు వెళ్లారు.
-  బయో బబుల్ నిబంధన ప్రకారం ఏ రెండు జట్లు కలిసి ప్రాక్టీస్ చేయకూడదు. ఆ రూల్ ను బ్రేక్ చేస్తూ కోల్ కతా జట్టు స్టేడియంలోకి వెళ్లేసరికి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ జట్టు ఆటగాళ్లను కలిశారు.
- ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. వరణ్ తో కలిసి భోజనం చేసిన సందీప్.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కలిశారు. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం మిశ్రా జట్టుతో కలిసి హోటల్ కు వెళ్లాడు. అక్కడ అతడికి అస్వస్థతగా అనిపించింది.

- అదే సమయానికి సందీప్ కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో.. వరుణ్.. మిశ్రా ఒక్కొక్కరిగా టెస్టుల కోసం వెళ్లటం.. అందరూ పాజిటివ్ గా తేలటం జరిగిపోయింది. ఒక జట్టు సభ్యుడి స్కానింగ్ వ్యవహారం వేలాది కోట్లతో ముడిపడి ఉన్న ఐపీఎల్ ను అర్థాంతరంగా ముగిసేలా చేసింది. చిన్న నిర్లక్ష్యానికి చెల్లించాల్సి వచ్చిన భారీ మూల్యంగా చెప్పక తప్పదు.
× RELATED సర్పంచ్ తో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారిద్దరి సంభాషణ ఎలా సాగిందంటే?
×