సైకిల్ మీద దూసుకెళుతున్న అతడు.. కాబోయే సీఎం

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన అంచనాలు.. అధ్యయనాలు.. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదిక.. వెరసి డీఎంకే అధినేత స్టాలిన్ చేతికి తమిళనాడు పగ్గాలు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే స్టాలిన్ సైతం యమా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఫలితాలు వెలువడటమే ఆలస్యమన్నట్లుగా ఆయన కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు.

ఎన్నికల హడావుడిలో పడి వ్యాయామం మీద శ్రద్ధ పెట్టని ఆయన.. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి మళ్లీ తన రోటీన్ కార్యక్రమాల మీద ఫోకస్ చేస్తున్నారు. వ్యాయామానికి అమితమైన ప్రాధాన్యత ఇచ్చే స్టాలిన్.. గడిచిన నెలన్నరగా దాని గురించి పట్టించుకున్నదే లేదు. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దశను పూర్తి చేసుకున్న ఆయన.. మే 2న వెలువడే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన పొద్దుపొద్దున్నే.. పక్కా అథ్లెట్ మాదిరి రెఢీ అయి.. సెక్యురిటీ హడావుడి లేకుండా జాగ్రత్తలు తీసుకొని సైకిల్ తో రోడ్డు మీదకు వచ్చేశారు. తలకు హెల్మెట్.. కళ్లకు గాగుల్స్ పెట్టేసుకొని.. చేతికి గ్లౌజ్ లతో రోడ్డు మీద కుర్రాడిలా దూసుకెళ్లారు. చెన్నై ఈసీఆర్ మార్గంలో ఏకంగా 30కి.మీ. సైక్లింగ్ చేయటం ద్వారా తనకున్న ఫిట్ నెస్ ఎంతన్నది చెప్పేశారు.

సైకిల్ మీద రివ్వున వెళుతున్న స్టాలిన్ ను మార్గమధ్యంలో పలువురు గుర్తు పట్టారు. ఆయనతో సెల్ఫీలు.. ఫోటోలు దిగేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్టాలిన్ సైతం.. ఎవరిని నిరాశకు గురి చేయకుండా ఫోటోలు దిగారు. తనకు అభివాదం చేసే వారికి స్పందిస్తూ ముందుకు వెళ్లారు. ఏమైనా.. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించే పలువురు.. ఆయన ఫిట్ నెస్ ను తెగ పొడిగేస్తున్నారు.నిజంగానే రేపొద్దున ఆయన చేతికి అధికారం వస్తే మరెలా వ్యవహరిస్తారో చూడాలి.


× RELATED పత్ని బిగి కౌగిలితో ఆ ఉత్సాహమే వేరప్పా
×