1800పాయింట్లతో మార్కెట్ కుప్పకూలితే.. ఇన్ఫోసిన్ ఎందుకలా మెరిసింది?

వంద కాదు రెండొందలు కాదు ఏకంగా 1800పాయింట్లు. స్టాక్ మార్కెట్ లో ఇంత భారీగా సెన్సెక్స్ కోల్పోవటం మాటలు కాదు. ఈ ఏడాదిలో అత్యంత దారుణమైన పతనం ఈ రోజున స్టాక్ మార్కెట్ లో చోటుచేసుకుంది. దేశీయంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ.. సెంటిమెంట్ దారుణంగా దెబ్బ తింది. దీంతో.. మార్కెట్ భారీగా క్రాష్ అయ్యింది. ఏకంగా 1800పాయింట్లు కోల్పోవటం ద్వారా.. మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నమోదైంది.

మార్కెట్లోని మదుపరుల సొమ్ము రూ.6.86లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో లక్షలాది మంది తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ ఇంతలా పతనమైన వేళలో.. ఆ షేర్.. ఈ షేర్ అన్న తేడా లేకుండా నేలచూపులు చూసింది. అలాంటివేళలో.. ఇన్ఫోసిస్ షేర్ ఒక్కటి మాత్రం మెరుపులు మెరిపించింది. ఎందుకలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు.

తమ బోర్డు సమావేశంలో వాటాల్ని తిరిగి కొనుగోలుచేసే ప్రతిపాదనను తాము పరిశీలిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ విషయాన్ని ఆదివారమే స్టాక్ ఎక్సైంజీలకు సమాచారం ఇవ్వటంతో.. ఈ షేరును కొనుగోలు చేయటానికి పోటీ పడ్డారు. దీంతో.. ఈ షేరు విలువ 2.72 శాతం పెరిగి రూ.1480కి చేరుకుంది. దీంతో.. ఈ షేరు 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఓవైపు మార్కెట్ భారీగా క్రాష్ అయితే.. ఇందుకు భిన్నంగా ఇన్ఫోసిస్ షేరు ధర మాత్రం బీఎస్ఈలో ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకోవటం గమనార్హం.

× RELATED ఏపీలో ఇకపై ఆ కోర్సులన్ని ‘ఇంగ్లిష్’లోనే !
×