ఏ సినిమాకైనా ఒకే రేటు ఏపీలోనేనా? తెలంగాణలో కాదా?

పెద్ద సినిమా.. చిన్న సినిమా. పెద్ద హీరో.. చిన్న హీరో.. పెద్ద దర్శకుడు.. చిన్న దర్శకుడు. భారీ బడ్జెట్.. హీరో రెమ్యునరేషన్ ఎక్కువగా ఇచ్చాం.. కారణం ఏమైనా కానీ.. ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ తో టికెట్ల ధరల్ని భారీగా పెంచేలా చేసే వసూళ్లకు ఏపీలో చెక్ పడినట్లే. సినిమా ఎవరిదైనా.. ఎంత భారీ బడ్జెట్ అయినా.. విడుదల రోజున మొదటి మూడు షోలకు ఒక రేటు.. తర్వాత మరో రేటు లాంటి నిర్ణయాలకు చెక్ పడినట్లే.

ఇకపై.. ఏ సినిమా అయినా.. విడుదల రోజైనా.. తర్వాతి రోజైనా.. టికెట్ ధర ఒక్కటే. పెరిగేది ఉండదు. సామాన్యులకు తీపికబురుగా మారిన ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. ఆ రాష్ట్రానికే పరిమితమైంది. మరి.. సామాన్యులకు.. సగటు అభిమానులకు సంతోషాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? అన్నది మరో ప్రశ్న.

అభిమానుల అభిమానాన్ని క్యాష్ చేసుకునే తీరుకు చెక్ పెడుతూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తుంటే.. కొందరు మాత్రం తప్పు పడుతున్నారు. అయితే.. ఈ విషయంలో వాదనలు ఎలా ఉన్నా.. అభిమానుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవటం మాత్రం తప్పని చెప్పాలి.

అభిమాన దేవుళ్లంటూ చెప్పే పెద్దలు.. తమ సినిమా విడుదల సమయంలో మాత్రం.. ఆ దేవుళ్ల నుంచి భారీగా వసూళ్లకు  పాల్పడటం సరైనది కాదు కదా? అందుకే.. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం ఏపీకి మాత్రమే పరిమితమై.. తెలంగాణలో అమలు కాకపోవటం ఏమిటన్న మాటకు కేసీఆర్ సర్కారు సమాధానం చెబితే బాగుంటుంది. నిజానికి సినిమా టికెట్ ధరల విషయంలోనే కాదు.. థియేటర్లో అమ్మే తినుబండారాల మీదా ప్రభుత్వం ఒక చూపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు.
× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×