స్నేహ కంటే భూమిక ఫాస్టుగా ఉందే!

తెలుగు తెరపై పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపించిన నిన్నటితరం కథానాయికలలో స్నేహ .. భూమిక ముందువరుసలో నిలుస్తారు. ఇద్దరూ ఒకే ఏడాదిలో వెండితెరకి పరిచయమయ్యారు. ఎలాంటి స్కిన్ షో చేయకుండానే అందమైన కథానాయికలు అనిపించుకున్నారు .. స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. విశేషమేమిటంటే ఇద్దరూ కూడా మనసులను దోచే మందహాసంతో ఆకట్టుకున్నవారే. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నవారే.

స్నేహను చూస్తే అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది .. తెలుగు తెరపై వేసిన సంక్రాంతి ముగ్గులా అనిపిస్తుంది. అందుకే ఆమెకి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోల జోడీగా ఆమె ఖాతాలో మంచి విజయాలు ఉన్నాయి. అలాంటి స్నేహ .. వివాహం తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది. తన ఏజ్ కి .. క్రేజ్ కి తగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'వినయ విధేయరామ' సినిమాలలో ఆమె పోషించిన ముఖ్యమైన పాత్రలకి మంచి పేరు వచ్చింది. కానీ ఆ తరువాత ఎందుకనో గ్యాప్ వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆమె స్పీడ్ కనిపించడం లేదు.

ఇక భూమిక విషయానికొస్తే డీసెంట్ గ ఉండే పాత్రలను మాత్రమే ఆమె చేస్తుందా? లేదంటే ఆమె పోషించడం వలన ఆ పాత్రలు డీసెంట్ గా అనిపిస్తాయా? అనేది ఇప్పటికీ అర్థంకాని ప్రశ్ననే. కథానాయికగా హుందాతో కూడిన పాత్రలు చేసిన భూమిక రీ ఎంట్రీలోను తన అభిరుచికి తగిన పాత్రలనే చేస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' .. 'యూ టర్న్' .. 'సవ్యసాచి' సినిమాలు ఆమె స్థాయికి తగిన పాత్రలను ఇచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి .. త్వరలోనే అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రీ ఎంట్రీ తరువాత స్నేహ కంటే భూమిక స్పీడ్ చూపుతుండటం విశేషం.            
× RELATED ఆత్రేయ మాటకు వందనం .. ఆయన పాటకు అభివందనం! (ఆత్రేయ శత జయంతి)
×