ఏపీ వాలంటీర్లకు క్యాష్ అవార్డ్స్ ప్రకటించిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో వరం ప్రకటించారు. ఈసారి వాలంటీర్ల సేవలకు గుర్తింపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకొని అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

కృష్ణ జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్ జగన్ ప్రధానం చేశారు. గ్రామ వలంటీర్లందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. వాలంటీర్లలో 53శాతం మంది మహిళలే ఉన్నారని.. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగామన్నారు.

రూపాయి లంచం లేకుండా పింఛన్ అందిస్తున్న గొప్ప సైనికులని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పేదల బాధలు తెలుసుకున్న గొప్ప మనసున్న వారని కితాబిచ్చారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా వాలంటీర్ భావిస్తున్నారని.. ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

ఇక నుంచి వాలంటీర్లకు ప్రతీ ఏటా ఇలా పురస్కారాలు అందిస్తామని జగన్ తెలిపారు. ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని.. ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.

ఏపీ సర్కార్ ఈ పురస్కారాలకు రూ.240 కోట్లు ఖర్చు చేస్తోంది. సేవా మిత్ర అవార్డుకు రూ.10వేలు సేవా రత్న అవార్డుకు రూ.20వేలు సేవా వజ్ర అవార్డుకు రూ.30వేలతో వాలంటీర్లకు పురస్కారాలు ఇస్తున్నారు.


× RELATED ఆ రాష్ట్రంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్
×