'వైల్డ్ డాగ్'

చిత్రం : 'వైల్డ్ డాగ్'

నటీనటులు: అక్కినేని నాగార్జున-సయామీ ఖేర్-దియా మీర్జా-అలీ రెజా-అతుల్ కులకర్ణి-అవ్జిత్ దత్ త‌దిత‌రులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: షనీల్ డియో
మాటలు: కిరణ్ కుమార్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి-అన్వేష్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాల్మన్ అహిషోర్

కొన్నేళ్లుగా వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న అక్కినేని నాగార్జున.. తన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీని ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వైల్డ్ డాగ్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

ఏసీపీ విజయ్ వర్మ జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఎంతో నిజాయితీగా, ముక్కుసూటిగా పని చేస్తున్న అధికారి. ఎన్నో ముఖ్యమైన ఆపరేషన్లను తన టీంతో కలిసి విజయవంతంగా పూర్తి చేసిన విజయ్.. హైదరాబాద్ గోకుల్ చాట్ దగ్గర జరిగిన పేలుళ్లలో తన కూతురిని కోల్పోతాడు. కోపంలో తనను తాను అదుపు చేసుకోలేని అతను పనిష్మెంట్ కింద డెస్క్ జాబ్ చేయాఃల్సి వస్తుంది. ఇలాంటి స్థితిలో పుణెలో జరిగిన ఉగ్రవాద దాడి కేసును అతను డీల్ చేయాల్సి వస్తుంది. మళ్లీ ఎన్ఐఏలో చేరిన విజయ్.. తన టీంతో కలిసి పుణె పేలుళ్ల కేసు పరిశోధన మొదలుపెడతాడు. కానీ అతడికి అన్నీ అడ్డంకులే ఎదురవుతాయి. పేలుళ్ల సూత్రధారిని పట్టుకోవడం కోసం విజయ్.. అండర్ కవర్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు. దీన్ని విజయ్ టీం ఎలా అమలు చేసింది.. కేసును ఛేదించడానికి ఎక్కడిదాకా వెళ్లింది.. వారి ప్రయత్నం ఏమేర ఫలించింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఇండియాలో ఓటీటీ విప్లవం మొదలయ్యాక మన ప్రేక్షకులు.. ఆ ఫ్లాట్ ఫామ్స్ లో ఎన్నో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు చూశారు. అంతర్జాతీయ సిరీస్ లకు తోడు.. మన దగ్గరా ఎన్నో ఒరిజినల్స్ తయారయ్యాయి. వాటిలో ఉగ్రవాద నేపథ్యంలో సాగే ఫ్యామిలీ మ్యాన్.. స్పెషల్ ఆప్స్ లాంటి సిరీస్ లు బాగా ఆకట్టుకున్నాయి. దాడులకు సంబంధించి ఉగ్రవాదుల ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది.. ఈ కేసులను పోలీసులు ఎలా డీల్ చేస్తారనేది ఎంతో పకడ్బందీగా తీర్చిదిద్దారు వీటిలో. ఇప్పుడు ఇదే నేపథ్యంలో సినిమా అంటే.. వాటికి దీటుగా.. వాటిని మించిన బిగితో ఉండాలని ఆశిస్తాం. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ అనగానే ప్రేక్షకులు సర్ప్రైజులు.. షాకులు.. ట్విస్టులు ఆశిస్తారు. ఐతే ‘వైల్డ్ డాగ్’ ఈ విషయంలో నిరాశ పరుస్తుంది. పేరుకు థ్రిల్లర్ జానరే కానీ.. ఇందులో ప్రేక్షకులు ఆశించే థ్రిల్స్ లేకపోయాయి. అలాగని ఇది ఆషామాషీగా తీసేసిన చిత్రమేమీ కాదు. ఒక అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో ఏమాత్రం డీవియేషన్ లేకుండా.. సూటిగా సుత్తి లేకుండా సాగిపోయే కథను చెప్పే ప్రయత్నం జరిగింది ఇందులో. ఒకే పాయింట్ మీద నడిచే ‘వైల్డ్ డాగ్’ అనుకున్నంతగా థ్రిల్ చేయకపోయినా.. ఆద్యంతం ప్రేక్షకుల ఆసక్తినైతే నిలిపి ఉంచుతుంది. లార్జర్ దన్ లైఫ్ కమర్షియల్ సినిమాల మధ్య.. వాస్తవికంగా సాగే ‘వైల్డ్ డాగ్’ ఓ భిన్నమైన చిత్రంగా నిలుస్తుంది.

‘వైల్డ్ డాగ్’ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా. 2010లో జరిగిన పుణె బేకరీ బాంబు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఎన్ఐఏ టీం చేసిన భారీ ఆపరేషన్ నేపథ్యంలో సాగే సినిమా ‘వైల్డ్ డాగ్’. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా అన్నాక ఉన్నదున్నట్లు తెరపై చూపిస్తే కుదరదు. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అయినా.. థ్రిల్లింగ్ మూమెంట్స్ జోడించడం.. ట్విస్టులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయడం అవసరం. ఐతే ‘వైల్డ్ డాగ్’ దర్శకుడు సాల్మన్ అలా చేయలేదు. ఇండియాలో జరిగిన అతి పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ కు సంబంధించి తాను పరిశోధించి తెలుసుకున్న విషయాలను ఎంత ఆసక్తికరంగా చెప్పాలి అన్నది మాత్రమే చూశాడు. ఈ విషయంలో అతను చాలా వరకు విజయవంతం అయినప్పటికీ.. ప్రేక్షకులు ఇలాంటి కథల నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తారు. కాబట్టి ఒకింత నిరాశ తప్పదు. అలాగే ‘వైల్డ్ డాగ్’ ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించడంలోనూ విఫలమైంది. అందుకు కథలో అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోలేదు.

పైన చెప్పుకున్న వెబ్ సిరీస్ లు చూసినా.. ఉగ్రవాద నేపథ్యంలో వచ్చిన వేరే సినిమాలు చూసినా.. అందులో ఒక ఫ్యామిలీ యాంగిల్ కచ్చితంగా ఉంటుంది. దాని ద్వారా ప్రేక్షకుల్లో ఎమోషనల్ కనెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ‘వైల్డ్ డాగ్’లోనూ ఆ యాంగిల్ ఉంది. ఇందులో హీరో స్వయంగా ఉగ్రవాద దాడిలో కూతురిని కోల్పోయిన బాధితుడిగా చూపించారు. కానీ దాన్ని ఉద్వేగభరితంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మరీ సాధారణంగా ఆ సన్నివేశాలను డీల్ చేయడంతో హీరో తాలూకు బాధను ప్రేక్షకులు ఫీలవడానికి.. ఎమోషనల్ గా ఈ కథతో కనెక్ట్ కావడానికి అవకాశం లేకపోయింది. ‘వైల్డ్ డాగ్’ ఆరంభంలో చాలా మామూలుగా అనిపించడానికి ఇదే కారణం. ఫస్ట్ ఇంప్రెషన్లో ‘వైల్డ్ డాగ్’కు మైనస్ మార్కులు పడ్డా.. ఆ తర్వాత హీరో ఛార్జ్ తీసుకుని కేసును డీల్ చేసే విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగేలా తర్వాతి ఎపిసోడ్లు నడుస్తాయి. ముఖ్యంగా పేలుళ్ల సూత్రధారి ఎవరని కనిపెట్టి.. అతడికి వలపన్నే ఎపిసోడ్ ‘వైల్డ్ డాగ్’కు హైలైట్‌ గా నిలుస్తుంది. ఈ టెంపోను కొనసాగించేలా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టుకుని ఉంటే.. ‘వైల్డ్ డాగ్’ మంచి హై ఇచ్చేది.

ఇంటర్వెల్ దగ్గర.. ఆ తర్వాత ‘వైల్డ్ డాగ్’ కొంచెం నెమ్మదించినా.. కథ టర్న్ తీసుకునే విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రభుత్వ సహకారం లేకుండా హీరో అండ్ టీం తమ ప్రాణాలను రిస్క్ చేసి మరీ మరో దేశానికి వెళ్లి తాము టార్గెట్ చేసిన ఉగ్రవాదిని తీసుకురావడానికి నడుం బిగించడం ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లాక హీరో బృందానికి.. ఉగ్రవాది బలగానికి మధ్య ఎత్తులు పై ఎత్తులకు సంబంధించిన సన్నివేశాలు అనుకున్నంత ఉత్కంఠభరితంగా ఉండవు. సోసోగా సాగిపోతాయి. యాక్షన్ ఘట్టాలు బాగున్నా.. కథలో మాత్రం ఉత్కంఠ మిస్సయింది. ఐతే చివరికి ఉగ్రవాది హీరో టీం చేతికి చిక్కాక ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఇండియాకు తీసుకువచ్చే ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకుంటుంది. ‘వైల్డ్ డాగ్’లో ప్రేక్షకులను కొంత సర్ప్రైజ్ చేసేది ఈ ఎపిసోడే. కథనం అప్పటిదాకా పడిలేస్తూ సాగినా.. చివరికి వచ్చేసరికి సినిమా మీద ఇంప్రెషన్ పెరగడానికి అవకాశం లభించింది. ఓవరాల్ గా చూస్తే ‘వైల్డ్ డాగ్’ తెలుగులో వచ్చిన ఒక విభిన్న ప్రయత్నం అనడంలో సందేహం లేదు. వాస్తవ కథను ఉన్నంతలో ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం జరిగింది. మరీ థ్రిల్లింగ్ గా లేకపోయినా.. రెండు గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టే కథాకథనాలు ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడ్డానికి ఇది ఓకే.

నటీనటులు:

అక్కినేని నాగార్జున విజయ్ వర్మ పాత్ర కోసం మంచి ఎఫర్టే పెట్టాడు. ఎన్ఐఏ ఆఫీసర్ అంటే నమ్మే విధంగా ఆయన ఫిజిక్.. బాడీ లాంగ్వేజ్ ఉన్నాయి. హీరో కాబట్టి మరీ బిల్డప్ ఏమీ లేకుండా.. సటిల్ గా ఈ పాత్రను చేసే ప్రయత్నం చేశాడు నాగ్. ఐతే హీరో స్వయంగా ఉగ్రవాదుల బాధితుడైనపుడు ఆ పాత్రలో ఉండాల్సినంత ఉద్వేగాన్ని తన పాత్ర ద్వారా ఆయన చూపించలేకపోయాడు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. దియా మీర్జా పాత్ర మరీ నామమాత్రం. సయామి ఖేర్.. అలీ రెజా సహా హీరో టీంలో ఉండే అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అతుల్ కులకర్ణి కూడా ఓకే. విలన్ పాత్రలో చేసిన నటుడు పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

తమన్ నేపథ్య సంగీతం ‘వైల్డ్ డాగ్’కు పెద్ద అసెట్. మంచి ఫాంలో ఉన్న అతను.. దానికి తగ్గ ఔట్ పుటే ఇచ్చాడు. ఈ జానర్ సినిమాలకు ఎలాంటి ఆర్ఆర్ కావాలో అలాంటిదే ఇచ్చాడు తమన్. పాటలు లేని ఈ సినిమాలో నేపథ్య సంగీతం ఆకర్షణగా నిలుస్తుంది. షనీల్ డియో ఛాయాగ్రహణం కూడా బాగుంది. ఆద్యంతం విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ రాజీ పడలేదు. సినిమాకు అవసరమైందంతా సమకూర్చింది. రైటర్ కమ్ డైరెక్టర్ సాల్మన్.. పనితనం ఓకే అనిపిస్తుంది. రైటింగ్ దగ్గర ఇంకొంచెం కసరత్తు జరగాల్సింది.. కథకు కీలకమైన ఎపిసోడ్లు ఇంకొంచెం షార్ప్ గా ఉండేలా చూసుకోవాల్సింది. అయినప్పటికీ ఎన్నో పరిమితులున్న కథను అతను పకడ్బందీగానే చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి టేకింగ్ బాగుంది.

చివరగా: వైల్డ్ డాగ్.. నాట్ థ్రిల్లింగ్.. బట్ ఎంగేజింగ్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED 'వకీల్ సాబ్'
×