'అరణ్య'

చిత్రం : 'అరణ్య'

నటీనటులు: రానా దగ్గుబాటి - విష్ణు విశాల్ - జోయా హుస్సేన్ - శ్రియ పిల్గోంకర్ - అనంత్ మహదేవన్ - రఘుబాబు తదితరులు
సంగీతం: శాంతను మొయిత్రా
ఛాయాగ్రహణం: అశోక్ కుమార్
మాటలు: వనమాలి
నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రభు సాల్మన్

కరోనా వల్ల వాయిదా పడి చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాల్లో ‘అరణ్య’ ఒకటి. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించిన బహుభాషా చిత్రమిది. ఆసక్తికర ప్రోమోలతో అంచనాలు పెంచిన ‘అరణ్య’.. ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి)కు అడవులన్నా - అందులో ఉండే వన్య ప్రాణులన్నా అమితమైన ఇష్టం. అతడి తాతలు తమ అధీనంలో ఉన్న 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేస్తే.. అదే అడవిలో పెరిగి పెద్దవాడై అక్కడుండే ఏనుగులు సహా అన్ని వన్య ప్రాణుల సంరక్షణ భాధ్యతలను 40 ఏళ్లుగా చూస్తూ ఉండటమే కాదు.. లక్షకు పైగా చెట్లు నాటినందుకు అతడికి ‘ఫారెస్ట్ మ్యాన్’గా రాష్ట్రప్రతి అవార్డు కూడా అందుకుంటాడు. ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అటవీ మంత్రి అయిన రాజగోపాలం (అనంత్ మహదేవన్) కళ్లు ఆ అడవిపై పడతాయి. ఆ ప్రాంతంలో 60 ఎకరాల్లో ఓ స్మార్ట్ సిటీ కట్టడానికి రంగం సిద్ధం చేస్తాడు. దీంతో అక్కడుండే వందలాది ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈ స్థితిలో అడవిని.. ఏనుగులను కాపాడుకోవడానికి అరణ్య ఏం చేశాడన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

జీవ వైవిధ్యాన్ని కాపాడకుంటే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని.. అడవులు, అందులోని జంతుజాలం అంతరించిపోతే భవిష్యత్తు అంధకారం అని చాటిచెప్పే మంచి అంశంతో తెరకెక్కిన సినిమా ‘అరణ్య’. ఐతే కేవలం సందేశం ఇస్తాం అంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసేయరు. ఆ సందేశాన్ని ఎంత బలంగా చెబుతాం.. దీని చుట్టూ అల్లుకున్న కథ ఎంత పకడ్బందీగా ఉంది.. కథనంలో ఎంత ఆసక్తి ఉంది అన్నది ప్రధానం. ‘అరణ్య’లో ఇవే మిస్సయ్యాయి. ‘అరణ్య’లో చెప్పాలనుకున్న విషయం చాలా సీరియస్. అది సార్వజనీనమైనది. ఇలాంటి విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాలని ఎవ్వరూ ఆశించరు. కానీ బలమైన భావోద్వేగాలు మాత్రం ఆశిస్తారు. ఈ కథతో.. ఇందులోని ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పాటు చేయగలితే ‘అరణ్య’ బాగానే ఎంగేజ్ చేసేది. కానీ ఆ విషయంలో దర్శకుడు ప్రభు సాల్మన్ విఫలమయ్యాడు. ప్రధాన పాత్ర చిత్రణే సరిగా లేని ఈ చిత్రంలో.. మిగతా క్యారెక్టర్లయితే మరీ పేలవం. ఎగుడుదిగుడుగా సాగే కథనానికి తోడు.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని ఉపకథలు ‘అరణ్య’ను నీరు గార్చేశాయి. ఒక క్లాసిక్ లాగా మొదలై.. ఒక మామూలుగా సినిమా ముగుస్తుంది ‘అరణ్య’.

మూగ జీవాల మీద తీసిన సినిమాల్లో ప్రేక్షకుల్లో ఎక్కువగా కదలిక తెచ్చినవి ఏనుగుల మీద తీసినవే. తెలుగులో వచ్చిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’.. తమిళంలో ‘అరణ్య’ దర్శకుడు రూపొందించిన ‘గుంకి’ (తెలుగులో గజరాజు) లాంటి సినిమాల్లో గొప్పగా భావోద్వేగాలు పండాయి. ఆ తరహా ఎమోషనల్ కనెక్ట్ ‘అరణ్య’లో మిస్సయింది. వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో ఏనుగుల పాత్రను మాటల రూపంలో చెప్పడం బాగానే ఉంది కానీ.. ఈ సినిమాలో వాటికి తలెత్తిన సమస్యను సన్నివేశాల ద్వారా హృద్యంగా.. ఆలోచన రేకెత్తించేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మనిషి నగరాలు.. పట్టణాల్లో చెట్లను నరుక్కుంటూ వెళ్లి.. అన్ని ప్రాంతాలనూ కాంక్రీట్ జంగిల్స్ గా మార్చేస్తున్నాడన్న చర్చ సరైందే కానీ.. ఈ సినిమాలో దట్టమైన అడవి మధ్యలో టౌన్ షిప్ కట్టడం అనే ఆలోచనే అర్థ రహితంగా అనిపిస్తుంది. ఇది చాలా కృత్రిమంగా అనిపించి.. ఆరంభంలోనే ఈ సమస్యతో డిస్కనెక్ట్ అయిపోతాం.

ఇక అరణ్య పాత్రను సైతం సహజంగా తీర్చిదిద్దకపోవడం మరింతగా ఆ కనెక్షన్ ను కట్ చేస్తుంది. అతణ్ని ‘అడవి దొంగ’లో హీరో మాదిరి అడవి మనిషిలా చూపిస్తే.. ఆ తర్వాత అతడి అసహజ-మొరటు ప్రవర్తనకు అర్థం ఉండేది కానీ.. ఆరంభంలోనే అతడితో పోష్ ఇంగ్లిష్ మాట్లాడించి.. ప్రవర్తన మాత్రం మొరటుగా అర్థరహితంగా ఉండటంతో ఆ క్యారెక్టర్ అసహజంగా అనిపిస్తుంది. సమస్యకు పరిష్కారం గురించి తర్కంతో ఆలోచిచంచకుండా ఆ పాత్ర ఇష్టానుసారం ప్రవర్తించడంతో దానిపై సానుభూతి కానీ.. సానుకూలత కానీ కలగవు. ఈ పాత్ర తీరు చికాకు పెట్టడంతో సమస్య పక్కదోవ పట్టేసింది. ఇక నక్సలైట్ గా జోయా.. మావటిగా విష్ణు విశాల్ పాత్రలను మొదలుపెట్టిన తీరు చూస్తే.. వీరి ఉపకథలు కథతో కనెక్ట్ అయి ఉంటాయని.. మలుపులకు కారణమవుతాయని.. చివరికి వీళ్లు కూడా హీరోతో కలిసి కాజ్ కోసం పని చేస్తారని ఆశిస్తాం. ఈ పాత్రలను అర్ధంతరంగా ముగించి వీళ్లు సినిమాలో ఎందుకున్నారనే ప్రశ్నను రేకెత్తిస్తాడు దర్శకుడు.

సినిమా మొదలైన తొలి పావు గంటలోనే సమస్య ఏంటో తేలిపోయాక.. దానికి హీరో ఎలాంటి పరిష్కారం చూపిస్తాడు.. అది ఎంత అర్థవంతంగా ఉంటుంది అని ఎదురు చూస్తాం. కానీ హీరోకు విలన్ నుంచి ఎదురయ్యే అడ్డంకులు కానీ.. ఇతను చివరికి సమస్యను పరిష్కరించే తీరు కానీ ఏమాత్రం కొత్తగా కనిపించవు.  మధ్యలో వచ్చే రొటీన్ సన్నివేశాలు విసిగిస్తాయి. ఇలాంటి సినిమాలకు బలమైన ముగింపు కూడా ఆశిస్తాం కానీ.. ఉన్నట్లుండి సినిమాను ఎండ్ చేసి అంతే అయిపోయిందా అనే అయోమయంలోకి నెడుతుంది ‘అరణ్య’.రానా తన నటనతో కొన్ని సన్నివేశాల వరకు ఎంగేజ్ చేస్తే.. ఏనుగులతో ముడిపడ్డ కొన్ని సెంటిమెంట్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. ఇంతకుమించి ‘అరణ్య’లో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. మంచి కథాంశం ఉంటే సరిపోదు.. దానికి తగ్గ బలమైన కథనం లేనపుడు ప్రయత్నం వృథా అని ‘అరణ్య’ రుజువు చేస్తుంది.

నటీనటులు:

సినిమా సంగతెలా ఉన్నా.. ‘అరణ్య’లో రానా పెర్ఫామెన్స్ మాత్రం టాప్ క్లాస్ అనడంలో సందేహం లేదు. రానా కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో అరణ్య ఒకటనడంలో సందేహం లేదు. ఫారెస్ట్ మ్యాన్ గా ప్రేక్షకులను కొత్త అనుభూతి పంచడానికి అతను పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో పాటు హావభావాల విషయంలో అతను ఎంతో కసరత్తు చేశాడని అర్థమవుతుంది. కొన్ని చోట్ల అతడి నటన పాత్ర ప్రవర్తన కొంచెం కృత్రిమంగా అనిపించినా.. ఓవరాల్ గా రానా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. విష్ణు విశాల్ నటన పర్వాలేదు. కానీ అతడి పాత్రే దశా దిశా లేనట్లుగా తయారైంది. జోయా హుస్సేన్ క్యారెక్టర్ కూడా అంతే. ఆమె పాత్ర సినిమాలో ఎందుకుందో అర్థ: కాదు. జర్నలిస్టు పాత్రలో శ్రియ పిల్గోంకర్ ఓకే. విలన్ పాత్రలో అనంత్ మహదేవన్ అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. రఘుబాబు తన పాత్ర పరిధిలో బాగా చేశాడు.

సాంకేతిక వర్గం:

‘అరణ్య’కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. శాంతను మొయిత్రా పాటలేవీ అంత గుర్తుండవు కానీ.. నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్లో కదలిక తేవడానికి ప్రయత్నించాడు. కానీ ప్యాథటిక్ ఫీల్ తేవడం కోసం ఒకే తరహా సౌండ్స్ మళ్లీ మళ్లీ ఉపయోగించడంతో ఒక దశ దాటాక మొహం మొత్తుతుంది. అశోక్ కుమార్ ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్లలో ఒకటి. అటవీ నేపథ్యంలో వచ్చే విజువల్స్ ఆకట్టుకుంటాయి. కెమెరామన్ కష్టం తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రసూప్ పొకుట్టి సౌండ్ డిజైన్ సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటి. దానిపై ఆసక్తి ఉన్నవాళ్లకు రసూల్ పనితనం అర్థమవుతుంది. ఇక దర్శకుడు ప్రభు సాల్మన్ విషయానికొస్తే.. అతడి ప్రకృతిపై ఉన్న ప్రేమను మరోసారి చూపించాడు. మానవుడి మూలాలను గుర్తు చేస్తూ.. మనం చేస్తున్న తప్పుల్ని అతను గుర్తు చేశాడు. అతను చెప్పాలనుకున్న విషయం మంచిదే. కానీ మరింత ఆసక్తికరమైన కథనంతో రావాల్సింది. ఒక మంచి సినిమాకు అవసరమైన సెటప్ కుదిరినా.. ఆ తర్వాత కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోకపోవడంతో అతను ప్రేక్షకులను రంజింపజేయలేకపోయాడు. ప్రధాన పాత్రలను సరిగా తీర్చిదిద్దకపోవడంతో ప్రేక్షకులు త్వరగా సినిమాతో డిస్కనెక్ట్ అయిపోతారు.

చివరగా: అరణ్య..దారి తప్పిన మంచి ప్రయత్నం

రేటింగ్: 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED 'వకీల్ సాబ్'
×