అప్పగింతల వేళ ఏడ్చి.. ఏడ్చి గుండె ఆగి చనిపోయింది

ఇంట్లో పెళ్లి ఖాయమైందన్నంతనే కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పండుగ వాతావరణం నెలకొంటోంది. పెళ్లి వరకు ఈ ఉత్సాహం అంతకంతకూ పెరిగిపోవటమే తప్పించి..ఏ క్షణంలో బాధ.. వేదన అన్నది కనిపించదు. కానీ.. పెళ్లి పూర్తి అయి.. అప్పగింతలు మొదలు పెట్టగానే ఒక్కసారి వాతావరణం మారిపోతుంది. అప్పటివరకున్న సరదా స్థానే.. గంభీరత చోటు చేసుకోవటం.. ఇంతకాలం తమ ఇంట్లో పెంచి పెద్ద చేసిన అమ్మాయి.. అత్తింటికి వెళ్లిపోతుందన్న వేదనతో కన్నీళ్లు పెట్టుకోవటం.. ఎక్కి ఎక్కి ఏడవటం చాలా చోట్ల చూస్తేనే ఉంటారు. కొంతమందికి అయితే పెళ్లి ఎపిసోడ్ మొత్తంలో అప్పగింతల వేళ అస్సలు నచ్చదు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. తాజాగా ఒడిశాలో జరిగిన ఒక పెళ్లిలో.. అప్పగింతల వేళ ఊహించని విషాదం చోటు చేసుకుంది. పుట్టింటిని వదల్లేక అదే పనిగా ఏడ్చిన వధువు గుండెపోటుకు గురై మరణించారు. దీంతో.. పెళ్లికి వచ్చిన వారంతా షాక్ తినటంతో పాటు.. పెళ్లింట విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఒడిశాలోని జులుందా గ్రామానికి చెందిన గుప్తేశ్వరికి తెటెల్ గావ్ కు చెందిన బిశికేశన్ తో పెళ్లి ఖాయమైంది.

వీరి పెళ్లి తాజాగా ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం అప్పగింతలు మొదలయ్యాయి. దీంతో.. వధువు అదే పనిగా ఏడ్చి ఏడ్చి.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు తేల్చటంతో.. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
× RELATED మళ్లీ ట్రంప్ చేతుల్లోకి సోషల్ మీడియా ఖాతాలు?
×