ఫస్ట్ లుక్: 'భాగ్ సాలే' అంటున్న కీరవాణి తనయుడు..!

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'తెల్లారితే గురువారం' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న శ్రీ సింహ.. తాజాగా "భాగ్ సాలే" అనే మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. నేడు శ్రీ సింహ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ మరియు బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి - యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి "భాగ్ సాలే" చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీ సింహ లుక్ కొత్తగా ఉంటడంతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ లో శ్రీ సింహ షేడ్ ఫొటో.. టైటిల్ పక్కన పరుగులు పెడుతున్న ఇద్దరు వ్యక్తుల ఫొటోలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ తో మరో న్యూ కాన్సెప్ట్ మూవీ టాలీవుడ్ లో చూడొచ్చని అర్థమవుతోంది. ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి సుందర్ రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సత్య గిడుటూరి ఎడిటింగ్ వర్క్ చేయనున్నాడు. త్వరలో ఈ సినిమాలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. 'భాగ్ సాలే' సురేష్ ప్రొడక్షన్స్ - మధుర ఎంటర్టైన్మెంట్స్ - బిగ్ బెన్ సినిమాస్ కలయికలో వస్తున్న నాల్గవ సినిమా. మార్చి మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×