ధోని కెప్టెన్సీ లో కడప కుర్రాడు .. హరిశంకర్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు !

ఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్ .. ప్రపంచంలో కాసుల వర్షం కురిపించే లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ అని ఎవరైనా చెప్తారు. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. స్టార్స్ కి కోట్ల వర్షం కురిపించే ఈ ఐపీఎల్ .. క్రికెట్ లో రాణించాలి దేశం తరపున ఆడాలని కలలు కనే ప్రతి ఒక యువ క్రికెటర్ కి ఓ మలుపురాయి. ఈ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత జాతీయ జట్టులో కీలక ప్లేయర్స్ గా మారారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి బౌలర్ అయిన బుమ్రా హార్ట్ హిట్టర్ హార్దిక్ పాండ్య వంటి స్టార్స్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత జాతీయ జట్టు లో చోటు సంపాదించుకున్నారు.

తాజాగా 2021 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో కడప కుర్రాడికి అదృష్టం తలుపుతట్టింది. ధోనితో ఒక్క ఫొటో తీసుకుంటే చాలనుకున్న ఆ యువ ఆటగాడు ఇప్పుడు ఏకంగా ధోని కెప్టెన్సీ లో ఐపీఎల్ అల్ టైం హాట్ ఫెవరెట్ చెన్నై టీం లో ఆడబోతున్నాడు. ఇది నిజంగా అతని భవిష్యత్ ను మార్చే గమనమే అని చెప్పవచ్చు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ..

హరిశంకర్ రెడ్డి .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా  రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామ శివారులో నాగూరివాండ్లపల్లె ఉంది. ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. సెల్ ఫోన్ కవరేజ్ కూడా పూర్తిగా అందుబాటులో లేదు. ఆ గ్రామంలో రైతు రామచంద్రారెడ్డి భార్యతో కలిసి తమ నాలుగెకరాలం పొలం సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. అందులో ఒకరు ఉపాధి కోసం కువైట్ లో ఉండగా రెండో కుమారుడు హరిశంకర్ రెడ్డి క్రికెట్ ఆడుతున్నాడు.హరిశంకర్ 1998 జూన్ 2న పుట్టాడు. చిన్ననాటి నుంచి క్రికెటే ప్రాణంగా పెరిగాడు. తండ్రి చిన్నకారు రైతు అయినా హరిశంకర్ మాత్రం క్రికెట్ చుట్టూనే మనసు పెట్టి ప్రయత్నాలు చేసేవాడు. మొదటి నుంచి హరిశంకర్ ఆటలకే ప్రాధాన్యమిచ్చేవాడు. బడి కూడా మానేసి మ్యాచ్ చూడడానికే వెళ్లేవాడు. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో... చదువుకోరా అని చెబుతున్నా తాను క్రికెట్లోనే ఎదుగుతానని చెప్పేవాడు. చివరకు కడపలో జిల్లా స్థాయిలో రాణించి అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి వరుసగా రాణిస్తూ రంజీ జట్టు వరకూ ఎదిగాడు. తోటి వాళ్లమంతా చదువులు ఆ తర్వాత ఏదో పనులు చేసుకుంటున్నా హరిశంకర్ మాత్రం తనకు నచ్చిన క్రికెట్ని వదిలిపెట్టలేదు. ఇంట్లో పెద్దగా సహకారం లేకపోయినా స్వయంశక్తితో ఎదిగాడు.

సయ్యద్ ముస్తక్ అలీ టీ20 లీగ్ జోనల్ స్థాయిలో ప్రారంభ మ్యాచ్ తోనే హరిశంకర్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్గా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ ఆటగాడు 2017-18 సీజన్ తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.అక్కడి నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో హరిశంకర్ రెడ్డి ఆటగాడిగా మరింత నైపుణ్యం సాధిస్తూ ఎదుగుతూ వచ్చాడు. ప్రతి సీజన్లోనూ బంతితోనూ బ్యాట్తోనూ రాణించాడు. హార్డ్ హిట్టర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత ఆంధ్రా అండర్ 19 జట్టు తరపున అతడు రాణించాడు. ఆ తర్వాత విజయ్ హజారే టోర్నీలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018 జనవరిలో కేరళ జట్టుతో జరిగిన ముస్తక్ అలీ టోర్నీలో తీసిన 4 వికెట్లు అతని కెరీర్ ని నిలబెట్టాయని చెప్పాలి.

అంతంత మాత్రం చదువు. తల్లిదండ్రులు పొలం పనుల్లో చెమటచిందిస్తుంటే.. తాను మాత్రం ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ బాల్తో కుస్తీ పట్టేవాడు. పొలాల గట్లపై తిరుగుతూ ఊరి చివర మైదానాల్లోనే రోజంతా గడిపేవాడు. అటు చదువూ లేక ఏ పని నేర్చుకోకుండా క్రికెట్టే ధ్యాసగా తిరుగుతున్న అతడు ఏమైపోతాడోనని తల్లిదండ్రులు ఆలోచించని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఊరి జనాలు కూడా పనిపాట లేకుండా తిరుగుతున్నాడంటూ సూటిపోటిమాటలతో వెక్కిరించేవారు. వీడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని తల్లిదండ్రులను హెచ్చరించారు. కానీ వీరందరికీ తెలియని విషయం ఏమంటే.. అతడు ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నాడని వీళ్లెవరికీ తెలియని ఎప్పుడూ చూడని ఓ గెలుపు కోసం పరిగెత్తుతున్నాడని మొత్తానికి.. అతడు చేసిన పోరాటం ఫలించి కన్న కలలు ఫలించిన రోజు.. ఆ గ్రామమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అతడి వైపు చూసింది. సూటిపోటి మాటలు అన్న వారే ఇప్పుడు వాహ్ గ్రేట్.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్నటి వరకు ఊరిలోని ఖాళీ జాగాల్లో బంతులు విసిరిన తెలుగు తేజం ఇకపై అంతర్జాతీయ మైదానంలో బౌన్సర్లు వేయనున్నాడు. ఈ ఆంధ్రా కుర్రాడు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వంటి దిగ్గజం సారథ్యంలో సరసన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడనున్నాడు. హరిశంకర్ రెడ్డిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ కు గాను రూ.20 లక్షలకు వేలంలో దక్కించుకుంది.

 హరిశంకర్రెడ్డి డిగ్రీ వరకు సరదాగా చదువుకున్నాడు. కానీ స్నేహితులతో కలిసి ఎప్పుడూ క్రికెట్ మైదానాల చుట్టూ తిరిగేవాడు. ఎలాంటి పని లేకుండా క్రికెట్ ధ్యాసతోనే పెరిగిన తమ కుమారుడు ఈ స్థాయికి ఎదుగుతాడనుకోలేదంటూ తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి లక్ష్మీదేవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఎప్పుడూ క్రికెట్ బ్యాటు బాలు పట్టుకుని తిరిగే వాడని ఎమైపోతాడోనని అనుకున్నామని లక్ష్మీదేవి చెప్పారు. బడికి పొమ్మన్నా లేదా పొలం పనికి రావాలన్నా వినకుండా ఎప్పుడూ క్రికెట్ అంటూ ఊళ్లు పట్టుకుని తిరిగేవాడని వివరించారు. ఇలా తిరుగుతున్న తమ కుమారుడిని తల్లిదండ్రులుగా తమను గ్రామస్తులు కూడా సూటిపోటి మాటలు అనేవారన్నారు. కానీ ఈరోజు తన కుమారుడు సాధించిన ఘనత గురించి అందరూ చెప్పుకుంటుంటే సంతోషంగా గర్వంగా ఉందని అమాయకంగా చెప్పారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉందని హరిశంకర్ రెడ్డి అన్నారు. ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్న తాను.. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడబోతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఐపీఎల్ లో ధోని నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని ఈ రైట్ ఆర్మ్ పేసర్ పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి తమతో పాటు అటలాడిన స్నేహితుడు జాతీయ స్థాయికి ఎదగడంపై అతడి మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే జాతీయ జట్టులోనూ స్థానం దక్కించుకునే స్థాయికి హరిశంకర్ రెడ్డి ఎదుగుతాడని గ్రామస్థులు స్నేహితులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐపీఎల్ లో హరిశంకర్ రెడ్డి ఎలా రాణిస్తాడో చూడటానికి యావత్ ఆంధ్రరాష్ట్రం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. అల్ ది బెస్ట్ హరిశంకర్ రెడ్డి.
× RELATED దేశంలో ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా అలజడి .. కొత్తగా ఎన్నంటే ?
×