ప్రతిష్ఠాత్మక YRF 50 సందర్భం.. ప్రభాస్ కోసం క్రేజీ స్క్రిప్ట్!

బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత సాహో లాంటి యాక్షన్ చిత్రంతోనూ బాలీవుడ్ లో సత్తా చాటాడు ప్రభాస్. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ దేశ విదేశాల్లో విస్తరించి ఉండడంతో సాహో కూడా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగులతో అదరగొట్టింది. నెగెటివ్ టాక్ వల్ల క్రేజు తగ్గినా హిందీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సత్తా చాటుకుంది.

దీంతో ప్రభాస్ స్టామినా ఏంటో ప్రపంచానికి అర్థమైంది. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజాలు అతడి లెవలెంతో అర్థం చేసుకున్నారని చెప్పాలి. అందుకే ఇప్పుడు దేశంలోని అతిపెద్ద స్టార్లలో ప్రభాస్ ఒకరిగా వెలుగుతున్నారు.  ఖాన్ ల వయసు అయిపోతున్న వేళ డార్లింగ్ ఇంకా 40 వయసులో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలను ప్లాన్ చేశాడు. ఆదిపురుష్ 3డి- సలార్ - నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇలా వరుసగా భారీ షెడ్యూళ్లతో అతడు బిజీ బిజీ.

అయితే ప్రభాస్ కోసం ఎంతో కాలంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ పడిగాపులు పడుతున్న సంగతి తెలిసినదే. అతడితో భారీ సినిమా చేయాలని యశ్ రాజ్ క్యాంప్ ఉవ్విళ్లూరుతోంది. దానికి తగ్గట్టు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. ప్రభాస్ చిక్కడం లేదు. అతడికి అసలు సమయమే లేదు. ప్రభాస్ ను కలుపుకుని హిందీ హీరోలతో ధూమ్ 4 చేయాలనుకున్నా యష్ రాజ్ సంస్థ కు కుదరలేదు.

తాజా గాసిప్ ఏమిటంటే.. యశ్ రాజ్ క్యాంప్ కేవలం ప్రభాస్ కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తోందిట. త్వరలో అతనిని సంప్రదించి స్క్రిప్టును వివరించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ హిందీ దర్శకుడు మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ప్రభాస్ ఇందులో సోలో హీరోగా నటిస్తారు. ఇప్పటికి ఇది కేవలం ఊహాగానం మాత్రమే. వైఆర్ ఎఫ్ సంస్థ 50 వసంతాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా వరుసగా క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తోంది. ఇవన్నీ పూర్తి చేసేందుకు చాలా సమయమే పడుతుంది. ఇటీవలే ఐదు సినిమాల రిలీజ్ తేదీల్ని ప్రకటించారు. అలాగే మల్టీస్టారర్ ధూమ్ 4 పైనా గట్టిగానే వర్క్ చేస్తున్నారు.

ఇంతకీ మనీష్ శర్మ ఎవరు? అంటే.. యష్ రాజ్ బ్యానర్ ఆస్థాన దర్శకుడు. ఈ సంస్థలోనే బ్యాండ్ బాజా బారాత్- లేడీస్ వర్సెస్ రికీ బెహల్-శుధ్ దేశీ రొమాన్స్ వంటి చిత్రాలకు మనీష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతడు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
× RELATED ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంకర్ వెంట పడ్డారు!
×