'కపటధారి'

చిత్రం: 'కపటధారి'

నటీనటులు: సుమంత్-నాజర్-నందిత శ్వేత-జయప్రకాష్ సుమన్ రంగనాథన్-సంపత్-వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: సైమన్ కింగ్
ఛాయాగ్రహణం: రసమతి
నిర్మాత: ధనంజయన్-లలిత ధనంజయన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి

‘మళ్ళీ రావా’ సినిమాతో ఫాంలోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు సుమంత్. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు అతను ఓ రీమేక్ మూవీని నమ్ముకున్నాడు. కన్నడలో విజయవంతమైన ‘కవుల్దారి’ రీమేక్ ‘కపటధారి’లో అతను నటించాడు. ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ లాగా కనిపించిందీ సినిమా. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గౌతమ్ (సుమంత్) ఒక ట్రాఫిక్ ఎస్ఐ. ఐతే తన విధుల్లో భాగంగా అతడి దృష్టి ఓ స్థలంలో బయటపడ్డ మూడు మృత కళేబరాల మీదికి వెళ్తుంది. ఆ శవాల వెనుక కథేంటో తెలుసుకోవడం కోసం పరిశోధన మొదలుపెడతాడు.ముందు అతడికి ఏ దారీ కనిపించదు కానీ.. పరిశోధించే కొద్దీ కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ మృత దేహాలు 35 ఏళ్ల ముందువని తెలుసుకున్న అతను.. ఈ కేసును విచారించి మధ్యలో వదిలేసిన ఒకప్పటి పోలీసాఫీసర్ రంజిత్ కుమార్ (నాజర్) కలుస్తాడు. ఈ క్రమంలో మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ అదే సమయంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఛేదించి ఈ కేసును గౌతమ్ ఎలా ఛేదించాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘కపటధారి’ మాతృక ‘కవుల్దారి’ ఆసక్తికర మలుపులతో సాగే థ్రిల్లర్ మూవీనే. ఎప్పుడో 35 ఏళ్ల ముందు జరిగిన నాలుగు హత్యల వెనుక మిస్టరీ ఏంటో తెలియక అప్పటి పోలీసులు సహా అందరూ ఆ కేసు గురించి మరిచిపోతే.. వర్తమానంలో ఒక ట్రాఫిక్ పోలీస్ ఛేదించడం అనే ఆసక్తికర పాయింట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఐతే మాతృక చూసినపుడు బాగానే అనిపించినా.. అందులో కొన్ని లోపాలు కనిపిస్తాయి. కథ ఒక తీరుగా నడవదు. స్క్రీన్ ప్లే అప్ అండ్ డౌన్స్ తో సాగుతుంది. పాత్రల్లో గందరగోళం కనిపిస్తుంది. ‘కవుల్దారి’ని రీమేక్ చేస్తున్నపుడు ఆ లోపాల్ని సరిదిద్ది.. మరింత పకడ్బందీగా తీర్చిదిద్ది ఉంటారని ఆశిస్తాం. కానీ ‘కపటధారి’ ఒరిజినల్ కంటే బలహీనంగా.. అనాసక్తికరంగా సాగి నిరాశకు గురి చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. దాదాపుగా మాతృకను ఉన్నదున్నట్లుగా దించేసినప్పటికీ.. అక్కడున్న ఇంపాక్ట్ ఇక్కడ లేకపోయింది. మంచి పాయింట్ చుట్టూనే కథను నడిపినా.. మర్డర్ మిస్టరీ సస్పెన్సుని బాగానే నిలబెట్టినా.. ఆ మిస్టరీ రివీలయ్యే క్రమాన్ని ఆసక్తికరంగానే చూపించినా.. మధ్య మధ్యలో నిలకడ లేకుండా సాగే కథనం.. స్లో నరేషన్ ఈ సినిమాకు బలహీనతలుగా మారాయి.

కమల్ హాసన్ చాలా ఏళ్ల కిందట తీసిన ‘పోతురాజు’ అనే సినిమాలో స్క్రీన్ ప్లే పరంగా ఒక ఆసక్తికర పద్ధతిని ఫాలో అయ్యాడు. అందులో ముందు విలన్ కోణంలో కథ చెప్పడం మొదలుపెడతాడు. అప్పుడు మనం ఒక పర్సెప్షన్లో ఉంటాం. కానీ తర్వాత హీరో కోణంలో కథ చెప్పడం మొదలయ్యాక అన్ని విషయాలూ బోధపడతాయి. వాస్తవాలు తెలుస్తాయి. ‘కపటధారి’లో మర్డర్ మిస్టరీకి సంబంధించిన అంశాన్ని డీల్ చేయడంలో ఇదే స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారు. సినిమాలో ప్రత్యేకంగా నిలిచే అంశం ఇదే. కానీ ఇది పక్కన పెడితే ‘కపటధారి’లో చాలా విషయాలు అనాసక్తికరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ కథ ఆసక్తికరంగా మొదలై.. మధ్యలో పక్కదోవ పడుతుంది. ట్రాఫిక్ పోలీస్ మర్డర్ మిస్టరీని ఛేదించానికి రంగంలోకి దిగడం, ఈ క్రమంలో అతడికి పోలీసు విభాగం నుంచే అడ్డంకులు ఎదురు కావడం.. అతను అయినా పట్టువదలకుండా 35 ఏళ్ల ముందు నాటి హత్యల వెనుక మిస్టరీని ఛేదించే దిశగా ముందుకు సాగడం ఆరంభంలో ‘కపటధారి’పై ప్రేక్షకులు అంచనాలు పెంచుకునేలా చేస్తాయి. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన తంతును అప్పటి పాత్రలతో వారి వారి కోణాల్లో చెప్పించడం కొత్తగా ఉంటుంది. ఆ సన్నివేశాలు చూస్తే  హత్యల వెనుక ఏం జరిగిందో ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ పూర్తి గుట్టు విప్పకుండా అక్కడి నుంచి కొన్ని మలుపులతో కథను నడిపించాడు దర్శకుడు. పోలీసులు ఏ కేసునైనా విచారించేటపుడు పైకి ఫోకస్ అయ్యే ఒక అబద్ధాన్ని పట్టుకుంటే నిజం మరుగున పడిపోతుందని ఇందులో నాజర్ పాత్రతో చెప్పిస్తారు. ‘కపటధారి’లో ముందు కథను మొదలుపెట్టిన తీరు చూసినపుడు కూడా ప్రేక్షకులు ఈ అబద్ధపు మాయలో పడి.. ఏదో ఊహించుకుంటారు. కానీ చివర్లో చిక్కుముడి వీడినపుడు అసలు విషయాలు తెలిసి షాకవుతారు.

ఐతే ఆరంభంలో కథానాయకుడు కేసును ఛేదించడం మొదలుపెట్టినపుడు.. అలాగే ప్రి క్లైమాక్స్‌ లో ట్విస్ట్ రివీల్ అయ్యేటపుడు ప్రేక్షకులను థ్రిల్ చేసే ‘కపటధారి’ మధ్యలో ఎటెటో తిరుగుతుంది. ఈ సినిమాతో ఉన్న పెద్ద సమస్య.. కథ ఒక క్రమ పద్ధతిలో నడవకపోవడం. మధ్య మధ్యలో ఏవేవో అనవసర పాత్రలు, సన్నివేశాలు వచ్చి ఫ్లోను దెబ్బ తీస్తుంటాయి. ముఖ్యంగా సుమన్ రంగనాథన్ పాత్రను ఎందుకు పెట్టారో అర్థం కాదు. దాని వల్ల సినిమాకు చేకూరిన లాభం పెద్దగా లేదు. అలాగే జయప్రకాష్ పాత్రను మరీ గందరగోళంగా తీర్చిదిద్దారు. నాజర్ పాత్ర ఆసక్తికరంగా మొదలవుతుంది కానీ.. అది కూడా ఒక దశ దాటాక నామమాత్రం అయిపోతుంది. విలన్ పాత్రను రంగంలోకి తేవడంలో చాలా ఆలస్యమైపోయిన భావన కలుగుతుంది. విలన్ పాత్ర వెనుక గుట్టునంతా బయటికి తీసే సన్నివేశాలు బాగున్నా ఈ సినిమాకు ఇచ్చిన ముగింపు మాత్రం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. థ్రిల్లర్ సినిమాలకు అసవరమైన వేగం లోపించడం ‘కపటధారి’లో మరో సమస్య. చకచకా సన్నివేశాలు సాగిపోయేలా.. కథనం పరుగులు పెట్టేలా ఉంటే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఇందులో ట్విస్టులు బాగానే అనిపించినా.. ఓవరాల్ గా ఈ సినిమా అనుకున్నంత ఇంపాక్ట్ వేయడంలో మాత్రం విఫలమైంది.

నటీనటులు:

సుమంత్ తనకు సరిపోయే పాత్రను.. సినిమాను ఎంచుకున్నాడు కానీ.. అతడి నటనలో ఇంకొంచెం ఇంటెన్సిటీ ఉండుండాల్సింది అనిపిస్తుంది. లుక్ పరంగా అతను బాగున్నాడు. పాత్ర అతడికి నప్పింది. నాజర్ హీరో తర్వాత అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఒక ద‌శ‌లో హీరోను ఈ పాత్ర డామినేట్ చేస్తుంది. కానీ తర్వాత ఆ క్యారెక్టర్ని తేల్చేశారు. విల‌న్ పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ న‌టుడు సంప‌త్ కూడా ఆక‌ట్టుకున్నాడు. హీరోయిన్ నందిత శ్వేత‌ది నామ‌మాత్ర‌మైన పాత్ర‌. ఆమె చేయ‌డానికి ఇందులో ఏమీ లేక‌పోయింది. వెన్నెల కిషోర్ కూడా ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. ఈ సీరియ‌స్ సినిమాలో అత‌డికి పెద్ద‌గా స్కోప్ లేక‌పోయింది. జ‌య‌ప్ర‌కాష్ బాగానే చేశాడు కానీ.. అత‌డి పాత్ర‌ను స‌రిగా తీర్చిదిద్ద‌లేదు.

సాంకేతిక వ‌ర్గం:

ఒక బ్యాగ్రౌండ్ సాంగ్ మిన‌హాయిస్తే క‌ప‌ట‌ధారిలో పాట‌లేమీ లేవు. ఆ పాట‌తో పాటు నేప‌థ్య సంగీతంతో సైమ‌న్ కింగ్ ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా విల‌న్ పాత్ర‌తో ముడిప‌డ్డ స‌న్నివేశాల్లో వ‌చ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్త‌గా అనిపిస్తుంది. ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిస్తుంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీకి అవ‌స‌ర‌మైన మేర నిర్మాణ విలువ‌లు పాటించారు నిర్మాత ధ‌నంజ‌య‌న్. ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి మాతృక‌ను యాజిటీజ్ ఫాలో అయిపోయాడు త‌ప్ప కొత్త‌గా చేసిందేమీ లేదు. చాలా వ‌ర‌కు ఒరిజిన‌ల్ ను ఫాలో అయిన‌ప్ప‌టికీ.. దాంతో పోలిస్తే తెలుగు వెర్ష‌న్లో గ్రిప్ త‌గ్గిపోవడం దర్శకుడి వైఫల్యమే. ప్రదీప్ క‌థ‌ను చెప్పే విధానంలో ఇంకాస్త వేగం చూపించి ఉండాల్సింద‌నిపిస్తుంది.

చివ‌ర‌గా: క‌ప‌ట‌ధారి.. కాన్సెప్ట్ బాగుంది కానీ..!

రేటింగ్-2.25/5
    
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED 'వకీల్ సాబ్'
×