ట్రైలర్ టాక్ - ‘నువ్వుంటే నా జతగా’.. పెళ్లితోనే ప్రేమ మొదలవుతుంది!

శ్రీకాంత్ బిరోజు, గీతికా ర‌త‌న్ జంట‌గా సంజ‌య్ క‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘నువ్వుంటే నా జతగా’. సుమ క‌ర్ల‌పూడి నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేమ‌లో ఉండే స‌వాళ్లు.. సంతోషాల మేలు క‌ల‌యిక‌గా ఈ మూవీని తెర‌క్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. గ్యాని సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ లేటెస్ట్ గా రిలీజైంది.

ప్ర‌తీ ప్రేమ క‌థ మిగిలిన వారికి రొటీన్ గా అనిపించిన‌ప్ప‌టికీ.. ల‌వ్ లో ఉన్నోడికి మాత్రం త‌న క‌థే గొప్ప‌గా ఉంటుంద‌ని చెప్తున్నాడు ద‌ర్శ‌కుడు. స‌గ‌టు ప్రేమికుడి వ్యూ నుంచి చూస్తే.. ఇది వాస్త‌వం కూడా. ఈ సినిమా ద్వారా ఇదే విష‌యాన్ని చెప్ప‌బోతున్నాన‌ని ట్రైల‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు సంజ‌య్ క‌ర్ల‌పూడి.

‘జీవితంలో ఎటు వెళ్లాలో తెలియ‌క అంద‌రూ ఒక చోట ఆగిపోతారు.. నేనూ ఆగిపోయాను..’ అంటూ హీరో చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో మొదలైన ట్రైలర్.. చివరి వరకూ ప్యూర్‌ లవ్ అండ్ హై ఎమోషన్ ను క్యారీ చేసింది. సాధ్యమైనంత‌ త్వరగా లవర్స్ కు పెళ్లి చేసేసి.. ఆ తర్వాత ఎదురయ్యే లైఫ్ స్ట్రగుల్స్ పై గురిపెట్టినట్టున్నాడు దర్శకుడు.

పెళ్లి తర్వాత ప్రేమ అంతం అవుతుందని భావిస్తారు కానీ.. నిజమైన ప్రేమ పెళ్లి తర్వాతే మొదలవుతుందని చెప్పాడు. అదే సమయంలో.. ప్రేమ బాధనిస్తుంది.. బలాన్ని కూడా ఇస్తుందంటూ.. లవ్ అనే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలనూ టచ్ చేశాడు. ‘నేను ఏ డెసిషన్ తీసుకున్నా నీ కోసమే’ అని హీరోయిన్ తో చెప్పించి.. ‘నేను ఏ డెసిషన్ తీసుకున్నా అది మనకోసమే’ అని హీరోతో పలికించాడు. దీనిద్వారా.. అమ్మాయి నిజంగా ప్రేమిస్తే భర్తే సర్వస్వం అని భావిస్తుందని.., భర్త మాత్రం లవ్ తోపాటు వారి భవిష్యత్ ను కూడా ప్రేమిస్తాడు(ప్రేమించాలి) అని చెప్పుకొచ్చాడు.

చివరగా.. కాపురంలో తలెత్తిన ఇబ్బందులతో వారిద్దరూ విడిపోతారని కూడా ట్రైలర్లోనే చెప్పేసిన డైరెక్టర్ సంజయ్.. తమ గ్యాప్ ను భరించలేక ఇద్దరూ పడుతున్న వేదనను కూడా చూపించాడు. ఇలా.. దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్లో.. సినిమా మొత్తం ఎలా ఉండబోతోందో ముందే చెప్పేశాడు. మధ్య తరగతి జీవితాలను ఇతి వృత్తంగా తీసుకొని ల‌వ్ జ‌ర్నీ స్టార్ట్ చేసిన డైరెక్ట‌ర్.. ఈ క‌థ‌ను ఎలా న‌డిపించాడు? ఎలాంటి ముగింపు ప‌లికాడ‌న్న‌దే? ఇక్క‌డ ఆస‌క్తి క‌రం. అందుకే.. రొటీన్ జోన‌ర్ ఎంచుకున్నాన‌ని ముందుగానే ప్ర‌క‌టించి, త‌న‌దైన మార్క్ ఇందులో ఉండ‌బోతోంద‌ని చెప్పాడు. మ‌రి, అదేంట‌న్నది చూడాలి.


× RELATED ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించిన 'హార్ట్ ఎటాక్' బ్యూటీ..!
×