మాస్టర్ డిస్టిబ్యూటర్లకు అమెజాన్ ప్రైమ్ భారీ షాక్..!!

తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన భారీ సినిమా మాస్టర్. ఈ మూవీ గతేడాది విడుదల కావాల్సింది కానీ లాక్ డౌన్ వలన వాయిదాపడి ఈ ఏడాది విడుదలైంది. మాస్టర్ కోసం సినీ అభిమానులు ఓపికగా ఎదురుచూసారు. మధ్యలో ఆలస్యం అవుతుందని డిజిటల్ స్ట్రీమింగ్ ఆఫర్స్ భారీగా వచ్చినా మాస్టర్ మేకర్స్ నో చెప్పేసి థియేటర్ లోనే విడుదల చేశారు. ఇప్పుడు ఎంతగానో వెయిటింగ్ చేసిన మాస్టర్ సినిమా పై జనాలు కనకవర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 13న విడుదలైన మాస్టర్.. మొదటిరోజు నుండి వసూళ్లపరంగా అసలు తగ్గడం లేదు. దళపతి కెరీర్ లోనే ఈ మూవీకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ మెసేజ్ యాక్షన్ సినిమా.. తమిళనాడుతో పాటు విడుదలైన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ అదరగొట్టింది. మాస్టర్ జాన్ పాత్రలో విజయ్.. విలన్ భవాని పాత్రలో విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం పైసావసూల్ మూవీ అనిపించుకుంది మాస్టర్. ఓవైపు దళపతి మాస్టర్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు తదుపరి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. మాస్టర్ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు 9కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పటికే 15కోట్ల పైగా వసూల్ చేసిందని సమాచారం. అయితే మాస్టర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అలాగే ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇంతలో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అదే అమెజాన్ వారు మాస్టర్ సినిమా జనవరి 28 రాత్రి 10:15 గంటల నుండి అమెజాన్ లో లభిస్తుందని చెప్పారు. ఈ సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతున్నందున థియేటర్ యాజమాన్యలకు షాక్ అనే చెప్పాలి. అయితే మరికొన్ని వారాలపాటు మాస్టర్ థియేటర్లలో రన్ అయ్యే అవకాశం ఉంది. కానీ అమెజాన్ వారు భారీ ధర చెల్లించినట్లు తెలుస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుందని టాక్. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.
× RELATED అల్ట్రా స్లిమ్ లుక్ తో జివ్వనిపిస్తున్న అనూ
×