అల్లుడు అదుర్స్

చిత్రం : అల్లుడు అదుర్స్

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్-నభా నటేష్-అను ఇమ్మాన్యుయెల్-ప్రకాష్ రాజ్-సోనూ సూద్-జయప్రకాష్ రెడ్డి-సప్తగిరి-శ్రీనివాసరెడ్డి-ఇంద్రజ-అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
రచన-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్

ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి లేటుగా వచ్చిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రమిది. సంక్రాంతికి కుటుం సమేతంగా ఆస్వాదించగలిగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్ర బృందం చెప్పుకున్న ఈ సినిమాలో అంత విశేషాలు ఏమున్నాయో చూద్దాం పదండి.

కథ: శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఓ పెద్దింటికి చెందిన చలాకీ కుర్రాడు. అతను స్కూల్లో ఉన్నపుడే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిందని తెలిసి డ్రాప్ అవుతాడు. ఆపై అతను కౌముది (నభా నటేష్)ను ప్రేమిస్తాడు. తన ముందే తన కూతురికి శ్రీను ఐలవ్యూ చెప్పడంతో కోపం తెచ్చుకున్న కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) శ్రీను మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ పంచాయితీ సందర్భంగా తనను బలవంతంగా కౌముదికిచ్చి పెళ్లి చేయాలని జైపాల్ రెడ్డి చూస్తున్నాడంటూ శ్రీను అడ్డం తిరుగుతాడు. అప్పుడే ఒక విచిత్రమైన ఒప్పందం జరుగుతుంది శ్రీను.. జైపాల్ మధ్య. ఆపై కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం శ్రీనును కౌముది ప్రేమించే సమయానికి గజా (సోనూ సూద్) ఎంటరవుతాడు. అతనెవరు..అతడి వల్ల శ్రీనుకు ఎదురైన అడ్డంకులేంటి.. చివరికి కౌముదిని శ్రీను సొంతం చేసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో మొత్తంగా నాలుగైదు నిమిషాలు కూడా కనిపించని హీరో తల్లి పాత్ర కోసం ఇంద్రజను తీసుకున్నారు. ఇక హీరో.. హీరోయిన్ చుట్టూ ఎప్పుడూ అరడజను మందికి తగ్గకుండా కనిపిస్తారు. వాళ్లలో చాలా వరకు పేరున్న ఆర్టిస్టులే. ఇంకా ప్రకాష్ రాజ్.. సోనూ సూద్ ల చుట్టూ కూడా పెద్ద పెద్ద బ్యాచులే ఉంటాయి. చిన్న చిన్న పాత్రల్ని సైతం ఇందులో పేరున్న ఆర్టిస్టులే చేశారు. ప్రతి సన్నివేశంలోనూ డజన్ల కొద్దీ ఆర్టిస్టులతో తెరంతా కళకళలాడిపోతుంటుంది. ఇక హీరోయిన్లుగా ఉన్న ఇద్దరు భామలు సరిపోరని.. మోనాల్ గజ్జర్ తో ఐటెం సాంగ్ కూడా చేయించారు. వీళ్లతో పాటల కోసం భారీ భారీ సెట్లకు తోడు.. ఫారిన్ లొకేషన్లు కూడా యాడ్ అయ్యాయి. ఇక సెట్లలో చిత్రీకరించిన పాటల్లో అయితే ఎక్కడా డ్యాన్సర్ల సంఖ్య వందకు తగ్గకుండా చూసుకున్నారు. అలాగే ఏ సన్నివేశంలోనూ బ్యాగ్రౌండ్లో ఒక మూలన సైతం ఇంచ్ కూడా భారీతనానికి లోటు లేదు. హీరో మీదికి ఎటాక్ చేయడానికి ఆయుధాలు సైతం మామూలువి వాడలేదు. గొడ్డళ్లు.. కత్తులు సైతం చాలా మోడర్న్ గా.. తళతళ మెరిసిపోతూ డిజైనింగ్ కలెక్షన్ లాగా అనిపిస్తాయి. ఐతే సినిమా కోసం ఇన్ని ఆకర్షణలు.. ఇంత భారీతనం జోడించిన సంతోష్ శ్రీనివాస్.. కొంచెమైనా కథాకథనాల మీద దృష్టిపెట్టి ఉంటే.. ఇంత ఔట్ డేటెడ్ సినిమా వచ్చేది కాదు.

సంతోష్ శ్రీనివాస్ కు మంచి పేరు తెచ్చి అతడి కెరీర్లో పెద్ద హిట్టుగా నిలిచిన ‘కందిరీగ’ వచ్చిన సమయానికి ఆ తరహా కమర్షియల్ సినిమాలు బాగా ఆడేవి. హీరో.. హీరోయిన్ తండ్రి.. విలన్ ఇళ్లలోకి చేరి వారిని ఒక ఆటాడుకునే.. తనకు ఎదురైన సమస్యలన్నీ పరిష్కరించేసే ఫార్ములాతో అప్పట్లో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇవి మొహం మొత్తేసి జనాలు వాటిని తిరస్కరించడం మొదలుపెట్టేశారు. ఈ టైపు సినిమాలు అరిగిపోయి.. ఆగిపోయి ఆరేడేళ్లు అయిపోయింది. ఇలాంటి సమయంలో కనీసం ఈ ఔట్ డేటెడ్ ఫార్ములాలో ఓ మోస్తరుగా అనిపించిన సినిమాల స్థాయిలో ‘అల్లుడు అదుర్స్’ ఉన్నా కూడా పండక్కి జనాలు సర్దుకుపోయేవాళ్లేమో. కానీ పది ఇరవై ఏళ్లు ముందు ఇలాంటి సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులు దండం పెట్టేసేవాళ్లేమో అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపూ. ఇంత సిల్ల ఐడియాలతో.. లాజిక్ లెస్ సీన్లతో ఈ మధ్య కాలంలో ఒక పేరున్న సినిమా ఏదీ రాలేదని ఘంటాపథంగా చెప్పేయొచ్చు. ఆరంభం నుంచి చివరి దాకా అంత అర్థరహితంగా.. అనాసక్తికరంగా సాగుతుంది ‘అల్లుడు అదుర్స్’.

హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అతను చూపించే శ్రద్ధ చూసి తనను అతను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంటుందా అమ్మాయి. కానీ తన మనసులో వేరే వ్యక్తి ఉంటాడు. అదే విషయం చెప్పగానే చిరాకు పడి వెళ్లిపోతాడు హీరో. కానీ తర్వాతి రోజు వచ్చి చాలా క్యాజువల్ గా.. ‘‘నువ్వు నా ఫస్ట్ లవ్.. తర్వాత నేను ప్రేమించే అమ్మాయి కంటే నువ్వే స్పెషల్. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో. కానీ నేను నిన్ను జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటా’’ అంటాడు. ఎవడో వచ్చి ఆమె భుజానికి డ్యాష్ ఇస్తే వాడి మక్కెలిరగదీస్తాడు. ‘‘మనల్ని ఇష్టపడే అమ్మాయికి ఏమైనా కూడా పర్వాలేదు.. కానీ మన ఫస్ట్ లవ్ కు ఏం కాకూడుదు’’ అంటూ లెక్చరిస్తాడు. ఇది హీరోగారి తొలి ప్రేమ కథా ‘చిత్రం’. ఇక రెండో ప్రేమకథ విషయానికొస్తే.. అతను తర్వాత ఇంకో అమ్మాయి ప్రేమలో పడతాడు. (జల్సాసినిమాలో లాగా ఆమె ఇతగాడి ఫస్ట్ లవ్ చెల్లెలే కావడం.. ‘‘నీకు గర్ల్ ఫ్రెండ్స్ ను సప్లై చేయడానికే నేను కూతుళ్లను కన్నట్లుంది’’ అని ప్రకాష్ రాజ్ డైలాగ్ పేల్చడం ట్విస్టు) హీరోయిన్ తండ్రి మెడ మీద కత్తి పెట్టి ఆమెకు ఐలవ్యూ చెప్పి మగతనం చూపించిన హీరో.. తర్వాత హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి ఏమీ చేయడు. హీరోయిన్ కూడా అతణ్ని చూస్తేనే చిరాకు పడిపోతుంటుంది. కానీ ఇంటర్వెల్ టైం అయినా ప్రేమించకపోవడం ఏంటి అన్నట్లుగా ఉన్నట్లుండి ఆమెలో అకారణంగా ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఇంతలో విలన్ ఎంట్రీ ఇచ్చి అతడి ప్రేమకు అడ్డం పడిపోతాడు. ఇక మనం చెప్పుకున్న పై ఫార్ములా సినిమాల్లో మాదిరే విలన్ పక్కనే చేరి అతణ్ని.. అతడి బ్యాచ్ ను ఒక ఆటాడేసుకుని హీరోయిన్ని దక్కించేసుకుంటాడు.

హీరో ఎంట్రీ దగ్గర్నుంచి ‘అల్లుడు అదుర్స్’ ఒక పరమ రొటీన్.. ఔట్ డేటెడ్ సినిమా అని అర్థమవుతూనే ఉంటుంది. ఇది లాజిక్కుల్లేని నాన్ సీరియస్ సినిమా అనే అభిప్రాయం పడిపోతుంది. కానీ ఈ తరహా ఫార్ములా సినిమాలు మళ్లీ ట్రై చేస్తున్నపుడు కామెడీ అయినా ఒక మోస్తరుగా పండేలా చూసుకుంటారు. అందుకోసం ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ ‘అల్లుడు అదుర్స్’లో చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వు వచ్చే సన్నివేశం ఒక్కటీ లేదు. విపరీతమైన హడావుడి.. ఆర్టిస్టుల ఓవరాక్షన్ తప్పితే జెన్యూన్ లాఫ్స్ కు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. జెమిని కామెడీలో అరిగిపోయిన కామెడీ సినిమాల సీన్లనే మళ్లీ చూస్తున్నట్లు ఉంటుంది తప్ప.. ఒక్క సీన్ కూడా కొత్తది లేదు. ఉన్న మనిషిని లేనట్లుగా భ్రమింపచేస్తూ ప్రకాష్ రాజ్ తో హీరో ఆడుకునే సన్నివేశాలైతే మరీ సిల్లీగా సాగి.. సినిమా మీద ఏ కాస్త ఇంప్రెషన్ ఉన్నా కూడా అది పోగెట్టేలా చేస్తాయి. ఇక హార్రర్ కామెడీ టైపులో చేసిన సీన్లకైతే దండం పెట్టేయాల్సిందే. కేవలం పాటలు.. ఫైట్లలో భారీతనం.. నభా నటేష్-మోనాల్ గజ్జర్ ల గ్లామర్ కోసం చూసే మాస్ ప్రేక్షకులు తప్పితే ఈ సినిమాతో ఎవ్వరూ కనీస స్థాయిలోనూ సంతృప్తి చెందరు.

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘రాక్షసుడు’ సినిమాలో చూసి కాస్త పర్వాలేదు అనుకున్న వాళ్లందరూ ‘అల్లుడు అదుర్స్’లో అతణ్ని చూసి బెంబేలెత్తిపోతారు. కొన్ని సీన్లలో శ్రీనివాస్ హావభావాలు.. డైలాగ్ డెలివరీని భరించడం చాలా కష్టమవుతుంది. కేవలం డ్యాన్సులు.. ఫైట్లు బాగా చేశాడు అని ఒక టెంప్లేట్ మాట అనుకోవాల్సిందే తప్పితే.. శ్రీనివాస్ ఏ రకంగానూ మెప్పించలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు.. హార్రర్ కామెడీ సీన్లలో అయితే శ్రీనివాస్ మరీ పేలవంగా కనిపించాడు. హీరోయిన్ నభా నటేష్ తనకు కుదిరినంత మేర అందాలు ఆరబోసింది. ఇలాంటి సినిమాలో హీరోయిన్ నుంచి నటన ఆశించడం అత్యాశే అవుతుంది. నభా కనీసం గ్లామర్ పరంగా అయినా ఆకట్టుకుంది. కానీ అను ఇమ్మాన్యుయెల్ కు ఆ ఛాన్స్ కూడా లేకపోయింది. ఆమెది సినిమాలో ఒక వృథా పాత్ర. తన లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ చేయాల్సిన పాత్ర కాదది. ప్రకాష్ రాజ్.. సోనూ సూద్ లను పూర్తిగా వృథా చేసేశారు. వాళ్ల కెరీర్లలోనే అత్యంత పేలవమైన పాత్రలుగా ఇవి మిగిలిపోతాయి. ఆర్టిస్టుల జాబితా తీస్తే చాలా పెద్దదే ఉంటుంది కానీ.. ఎవరి గురించీ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేకపోయింది.

సాంకేతిక వర్గం: ‘అల్లుడు అదుర్స్’ కథ విన్నాక ఇంతకంటే ఏం చేస్తాం అన్నట్లుగా దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఓలా చికా మినహాయిస్తే కాస్త హమ్ చేసుకునే అవకాశం ఏ పాటా ఇవ్వలేదు. ఇక సినిమా రషెస్ చూశాక దేవిశ్రీ మరింత నీరసపడ్డట్లున్నాడు. అసలే ఫాంలో లేని అతను.. మరింత మొక్కుబడిగా నేపథ్య సంగీతం లాగించేశాడనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపూ. ఛోటా కే నాయుడు ఛాయాగ్రహణం సినిమాకు తగ్గట్లుగా సాగింది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి కానీ.. కొత్తదనం ఏమీ లేదు. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. ప్రతి సన్నివేశంలోనూ అవసరానికి మించిన భారీతనమే కనిపిస్తుంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఎవరో రిజెక్ట్ చేస్తే పక్కన పడేసిన స్క్రిప్టును తీసుకుని ‘అల్లుడు అదుర్స్’ చేశాడా అన్న సందేహాలు కలుగుతాయి. కనీసం లాజిక్ గురించి ఆలోచించకుండా.. రీరైటింగ్ అన్నదే లేకుండా.. కసరత్తు లేకుండా ఏం తోచితే అది రాసేసి తీసేశారేమో అనిపించేలా ‘అల్లుడు అదుర్స్’ ఉంది. దర్శకుడిగా ప్రస్తుతం అతడి పనితీరుపై అనేకానేక సందేహాలు రేకెత్తిస్తుందీ సినిమా.

చివరగా: అల్లుడు అదుర్స్ కాదు.. బెదుర్స్

రేటింగ్ - 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
× RELATED 'వకీల్ సాబ్'
×