ట్రంప్ ను ఎవరూ వదిలిపెట్టటం లేదుగా?

తిరుగులేని అధికారం చేతిలో ఉన్నప్పుడు కిక్కురుమనకుండా ఉన్నోళ్లు.. అధికారం చేజారటం మొదలైనప్పటిని నుంచి బలహీనులు సైతం బలంగా మాట్లాడటం మొదలవుతుంది. పవర్ మహత్యం అలాంటిది మరి. నాలుగేళ్ల పాటు తనకు తోచిందే వేదం అన్నట్లుగా వ్యవహరించే ట్రంప్ మాటను ఏమీ అనలేని వారంతా.. ఆయన బలం తగ్గిన వేళలో చెలరేగిపోతున్న పరిస్థితి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బలం కాస్త తగ్గితే.. క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి అనంతరం ఆయన ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది.

అంతే.. అప్పటివరకు మౌనంగా ఉన్న వారు.. క్యాపిటల్ హిల్ మీద దాడి అనంతరం ట్రంప్ మీద కఠిన చర్యలకు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఇందులో ట్విటర్ ను ప్రముఖంగా చెప్పాలి. ఆయన అకౌంట్ ను జీవితకాలం బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఫేస్ బుక్.. గూగుల్ తో పాటు.. పలు సామాజిక మాథ్యమాల్లో ఆయన ఖాతాల్ని తొలగించటమో.. లేదంటే తాత్కాలికంగా నిలిపేయటం చేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి టిక్ టాక్ చేరింది. వాస్తవానికి టిక్ టాక్ లో ట్రంప్ కు అకౌంట్ లేదు. కానీ.. ట్రంప్ నిర్ణయాల కారణంగా ప్రభావానికి గురైన ఆ సోషల్ మీడియా సంస్థ.. తనదైన శైలిలో స్పందించింది. ట్రంప్ ప్రసంగాలకు చెందిన చిట్టి వీడియోల్ని తొలగిస్తున్నట్లు చెబుతూ.. విద్వేషపూరిత ప్రవర్తన.. హింసకు తమ వద్ద స్థానం లేదని పేర్కొంది.

హింసను గొప్పగా చూపించినా.. ప్రచారం చేసినా తమ సామాజిక నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఉంటే వారి మీద చర్యలు తీసుకోవటానికి తాము వెనుకాడమని చెబుతోంది. ఆగస్టు నుంచి ట్రంప్ కార్యనిర్వాహక వర్గం టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ సామాజిక మాథ్యమంపై ట్రంప్ కత్తి దూయటం జరిగింది. ఇప్పుడు ట్రంప్ బలహీనం కావటం.. ఆయన మీద ఆంక్షల కత్తి దూయటం ద్వారా.. కసిని తీర్చుకుంటున్నాయని చెప్పాలి.

తాజాగా ట్రంప్ యూ ట్యూబ్ చానల్ మీదా ఆంక్షల్ని విధించింది. గతంలో ఆయన చేసిన విద్వేష పూరిత వీడియోల్ని తొలగించే పనిలో పడింది. క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన దుండగుల్ని వెరీ స్పెషల్ అంటూ ట్రంప్ పొగిడిన వీడియోను సైతం యూ ట్యూబ్ తొలగించింది. తాజాగా యూ ట్యూబ్ ఒక ప్రకటన చేసింది.. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్న ట్రంప్ వీడియోల్ని తొలగించాలని నిర్ణయించినట్లుగాపేర్కొన్నారు. బలంగా ఉన్నప్పుడు లేని పాలసీలు.. నియమ నిబంధనలు బలహీనమైనంతనే గుర్తుకు రావటం గమనార్హం.


× RELATED జైల్లో ఒంటరిగా పద్మజ.. అదే మానసిక స్థితి.. ఈ ఘటన నేర్పుతున్న పాఠాలెన్నో..!
×