ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి..? కేంద్రం క్లారిటీ

దేశంలో ఇప్పుడు రెండు వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతిచ్చింది. కోవాగ్జిన్ కోవిషీల్డ్ టీకాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చేరాయి. మరి ఈ రెండు టీకాల్లో ఏది సురక్షితం..? ఏది బాగా పనిచేస్తుంది? దేన్ని వేసుకోవాలనే దానిపై జనాల్లో సవాలక్ష సందేహాలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

ఈ రెండు వ్యాక్సిన్ల భద్రతపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ క్లారిటీనిచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్లలో ఈ రెండే అత్యుత్తమమని పేర్కొన్నారు.

వేలాది మందిపై ప్రయోగాలు జరిపిన తర్వాత వాటికి ఎమర్జెన్సీ అనుమతి ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని కూడా వివరించింది. ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తానని నీతి అయోగ్ సభ్యుడు తెలిపారు.

కేంద్ర ఆరోగ్యశాఖ కూడా దీనిపై స్పందించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు కోవిషీల్డ్ కోవాగ్జిన్ రెండూ కూడా సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక దేశంలో త్వరలో మరో నాలుగు టీకాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. జైడస్ క్యాడిలా స్పుత్నిక్ వి బయోలాజికల్ ఇ జెన్నోవా సంస్థల వ్యాక్సిన్ ప్రయోగాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. మరికొద్దిరోజుల్లోనే వీటిని కూడా ఆమోదించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

వ్యాక్సిన్లపై ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆరోగ్యశాఖ ఆదేశించింది. రెండు మోతాదుల్లో వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆరోగ్యశాఖ సూచించింది.
× RELATED పంజాబ్ హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ బంద్..!
×