
ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది హురున్ గ్లోబల్ 500 నివేదిక. తాజాగా విడుదలైన ఆ నివేదిక ప్రకారం దేశానికి చెందిన పదకొండు కంపెనీల విలువ ఏకంగా రూ.60 లక్షల కోట్లకు చేరుకోవటంగమనార్హం. ఇది దేశ జీడీపీలో మూడో వంతు కావటం విశేషంగా చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో మన దేశానికి చెందినవి పదకొండు ఉన్నట్లుగా సదరు నివేదిక తేల్చింది.
ఇక.. టాప్ 500 విలువైన కంపెనీల విలువ 50 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవటం ఒక ఎత్తు అయితే.. ఇది ప్రపంచంలోని ఆరు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల సంయుక్త జీడీపీకి సమానం కావటం మరో విశేషంగా చెప్పాలి. ఇక.. ఆ ఆరు దేశాలు ఏమంటే.. అమెరికా.. చైనా.. జపాన్.. జర్మనీ.. భారత్.. బ్రిటన్ గా చెబుతున్నారు. ఈ కంపెనీలన్ని కలిపి 4.3 కోట్ల మందికి ఉపాధిని ఇస్తున్నాయి. ఇది జర్మనీ దేశ జనాభాతో సమానం కావటం మరో విశేషంగా చెప్పాలి. ఈ కంపెనీల అమ్మకాలు చైనా జీడీపీకి కంటే ఎక్కువ కావటం గమనార్హం. డాలర్లలో చెప్పాలంటే ఈ కంపెనీల అమ్మకాలు 18లక్షల కోట్ల డాలర్లుగా లెక్క కట్టారు.
ప్రపంచంలో టాప్ 500 కంపెనీల్లో మన దేశానికి చెందిన రిలయన్స్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబరు ఒకటి నాటికి కంపెనీ విలువ 20.5 శాతం పెరిగి 168.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఈ కంపెనీ 54వ స్థానంలో నిలిచింది. టీసీఎస్ విలువ 30 శాతం పెరిగి 139 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశంలో అత్యంత విలువైన పదకొండు కంపెనీల్లో ఏడు ముంబయిలోనే ఉండటం విశేషం. మిగిలిన నాలుగు కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఫుణె.. బెంగళూరు.. కోల్ కతా.. ఢిల్లీలలో ఉన్నాయి. టాప్ 500 కంపెనీల్లో అత్యధిక కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. ఆ దేశంలో 242 కంపెనీలు ఉంటే..
చైనాలో 51 కంపెనీలు.. జపాన్ లో 30 కంపెనీలు ఉన్నాయి.
టాప్ 500 కంపెనీల్లో మన దేశానికి చెందిన పదకొండు కంపెనీలు చూస్తే..
క్ర.సం కంపెనీ ప్రపంచ ర్యాంకు
01. రిలయన్స్ 54
02. టీసీఎస్ 73
03. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 105
04. హిందుస్థాన్ యునిలీవర్ 190
05. ఇన్ఫోసిస్ 201
06. హెచ్ డీఎఫ్ సీ 249
07. కోటక్ మహీంద్రా బ్యాంకు 284
08. ఐసీఐసీఐ బ్యాంకు 316
09. భారతీ ఎయిర్ టెల్ 440
10. బజాజ్ ఫైనాన్స్ 451
11. ఐటీసీ 480