కరోనా:మళ్లీ లాక్ డౌన్ దిశగా మోడీ.. 4న కీలక నిర్ణయం?

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్నాయి. యూరప్ లో ఇప్పటికే రెండో లాక్ డౌన్ విధించగా.. అమెరికా సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కరోనా విలయానికి సంబంధించి చలికాలం సెకండ్ వేవ్ భయాలు దేశంలోనూ పెరిగిపోతున్నాయి.

దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాధిలో గత ఏడు దశాబ్ధాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గుబులు రేపుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం కొత్తగా 38722 కేసులు 443 మరణాలు నమోదయ్యాయి.  ఆదివారం సిబ్బందికి సెలవు కావడంతో టెస్టులు తక్కువగా చేపట్టడం వల్లే కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని తెలిసింది. దేశం మొత్తం మీద కేసులు 94.44 లక్షలకు చేరాయి.  మరణాల సంఖ్య 1.37 లక్షలకు చేరింది.

సెకండ్ వేవ్ భయాలు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో కరోనా పరిస్థితులు దిగజారిపోకుండా ఉండేందుకు ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నట్టు నిపుణులు హెచ్చరించడంతో మోడీ ఈనెల 4న అఖిలపక్ష భేటి ఏర్పాటు చేశారు.  మోడీ అధ్యక్షతన పార్లమెంట్ లోని అన్ని ఫ్లోర్ లీడర్లతో శుక్రవారం భేటి అవుతారు. ఈ భేటిలో అందరి అభిప్రాయాలను మోడీ తీసుకుంటారు. వ్యాక్సిన్ పంపిణీపైన కూడా చర్చిస్తారని సమాచారం. వ్యాక్సిన్ నిల్వ పంపిణీ ఏర్పాట్లపై సమీక్షిస్తారు.

ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మళ్లీ దేశంలో లాక్ డౌన్ విధించబోతున్నారనే ప్రచారం గుప్పుమంది. యూరప్ దేశాల్లో రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతున్నందున.. భారత్ లోనూ అలాంటి పరిస్థితి తలెత్తవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కానీ భారత్ లో రెండో దశ లాక్ డౌన్ ఉండబోదని కేంద్ర పెద్దలు ఇదివరకే స్పష్టం చేశారు. ఒకసారి లాక్ డౌన్ తోనే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో రెండో లాక్ డౌన్ ను దేశం తట్టుకోదని నిపుణులు చెబుతున్నారు. మరి కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తిగా మారింది.
× RELATED నిమ్మగడ్డ నుంచి ఆ ఇద్దరినీ జగన్ కాపాడుతాడా?
×