జగన్ ఫేక్ అయితే...అసెంబ్లీ కూడా ఫేకేనా ?

‘జగన్ ఓ పేక్ సీఎం..తప్పుడు మనుషులు తప్పుడు ప్రభుత్వం’  ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలు విమర్శలు. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటితో జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుండి చంద్రబాబు+టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలను మోసం చేసి జగన్ ఓట్లేయించుకున్నారని ఒకసారి ప్రజలు మోసపోయి ఓట్లేశారని మరోసారి ఏదేదో మట్లాడుతునే ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా సవాళ్ళు చేసిన విషయం జనాలందరికీ తెలిసిందే. వీటన్నింటికి తాజాగా జగన్ను ఫేక్ సీఎం అనేశారు. ప్రభుత్వాన్ని కూడా చివరకు తప్పుడు ప్రభుత్వం అంటు ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో తాను ఓడిపోతానని చంద్రబాబు కలలో కూడా ఊహించలేదు. వైసీపీ అధికారంలోకి వస్తుందని చాలామందికి తెలిసిపోయినా చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు. దానికి తోడు 151 సీట్ల బ్రహ్మాండమైన గెలుపుతో వైసీపీ అధికారంలో రావటాన్ని చంద్రబాబు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు.  

కోపంతో నోటికొచ్చింది మాట్లాడేసిన చంద్రబాబు మరచిపోయిందేమంటే జగన్ ఫేక్ అయితే అసెంబ్లీ కూడా ఫేకే. అసెంబ్లీ ఫేక్ అయితే చంద్రబాబు కూడా ఫేక్ ప్రతిపక్ష నేతే అని. శాసనసభాపక్ష నేత అయినపుడు ఇదే శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా ఫేకే అవుతారు కదా . జగన్ ఫేక్..అసెంబ్లీ ఫేక్ అన్న తర్వాత తాను మాత్రం ఒరిజినల్ ఎలాగవుతారన్న లాజిక్ ను చంద్రబాబు మరచిపోయారు. చంద్రబాబు అయినా టీడీపీ నేతలైనా అర్ధం చేసుకోవాల్సిందేమంటే జగన్ అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చారని.

తమకు ఓట్లేసిన జనాలే జగన్ కు కూడా ఓట్లేశారన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోతున్నారు. రాజకీయాలన్నాక గెలుపోటములు చాలా సహజం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తనకు తాను కితాబు ఇఛ్చుకునే చంద్రబాబుకు ఇంతచిన్న విషయాన్ని మరచిపోతున్నారు. ముందు జగన్ను సీఎంగా అంగీకరిస్తే చాలా సమస్యలు వాతంటవే పరిష్కారమవుతాయి. తాను అధికారంలో ఉన్నపుడు అసెంబ్లీలో కానీ బయటకానీ జగన్ను ఎంతగా అవమానించింది వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది చంద్రబాబు టీడీపీ నేతలు మరచిపోయినట్లు నటిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పటి తమ యాక్షన్ కు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రియాక్షన్ ఎదురవుతుండే సరికి తట్టుకోలేకపోతున్నారు. అప్పట్లో చంద్రబాబు తనను అవమానించాడు కాబట్టి ఇపుడు తాను కూడా అలాగే అవమానిస్తానని జగన్ అనటాన్ని ఎవరు హర్షించరు. కానీ వర్తమాన రాజకీయాల్లో నేతల్లో అత్యధికులు ఒక తానుగుడ్డలే కాబట్టి ప్రతీకార రాజకీయాలు తప్పటం లేదు. కాబట్టి తప్పదు చంద్రబాబు భరించాల్సిందే.
× RELATED పంజాబ్ హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ బంద్..!
×