జేసీకి బిగ్ షాక్ రూ. 100 కోట్ల జరిమానా

టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ చేసినందుకు మైనింగ్ లో నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 100 కోట్ల ఫైన్ వేశారు. భారీ ఫైన్ చెల్లించకపోతే రెవిన్యు రికవరీ యాక్ట్ క్రింద జేసీ కుటుంబానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ నోటీసులో స్పష్టంగా చెప్పారు.  అధికారంలో ఉన్నంత కాలం తమ ఇష్టారాజ్యంగా వ్యవహిరంచిన జేసీ కుటుంబం ప్రతిపక్షంలోకి రాగానే  ఇబ్బందులను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.

అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమిష్టారాజ్యంగా దాదాపు 35 ఏళ్ళు జిల్లాలో తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగించుకున్నారు. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చారో అప్పటి నుండి వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ముందుగా జేసీ ట్రావెల్స్ ముసుగులో చేసిన అక్రమాలు ఉల్లంఘించిన నిబంధనలు అన్నీ వెలుగు చూశాయి. వాళ్ళ అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టి జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్టు చేసి తర్వాత జైలుకు పంపారు.

ఇదే సమయంలో జిల్లాలో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ మైనింగ్ ఆరోపణలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుమన భ్రమరాంభ అనే కంపెనీల పేర్లతో చేసిన డెలమైట్ సున్నపురాయి మైనింగ్ లో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు ప్రాంతంలో జరిగిన మైనింగ్ లో అక్రమాలు జరిగినట్లు అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల అక్రమదోపిడికి జేసీ కుటుంబం పాల్పడినట్లు ఆధారాలను సేకరించారు.

తమ కార్ల డ్రైవర్లు ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్లతో లైసెన్సులు తీసుకోవటం వాళ్ళని కంపెనీల్లో డైరెక్టర్లుగా చూపటం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఎప్పటి నుండో ఆరోపణలున్నాయి. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులెవరు వాళ్ళ జోలికి పోలేదు. కానీ ఇపుడు సీన్ రివర్సయ్యింది. దాంతో వాళ్ళ అక్రమాలన్నీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. మరి తాజాగా అధికారులు ఇచ్చిన రూ. 100 కోట్ల జరిమానా విషయంలో జేసీ కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.
× RELATED పంజాబ్ హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ బంద్..!
×