పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే తరువాయి వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాని ఓకే చేసి.. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేశాడు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాని స్టార్ట్ చేసాడు పవన్. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో అని అందరూ ఆలోచిస్తుంటే మరో మూడు సినిమాలకు కమిట్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఓ ప్రాజెక్ట్ చేయడానికి పవన్ ఒప్పుకున్నాడు. ఇలా కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా ఐదు సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్.. లేటెస్టుగా మరో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాకి సూర్య దేవర నాగవంశీ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ముగ్గురూ నిర్మాతలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇది మలయాళ హిట్ సినిమా 'అయ్యప్పయుమ్ కోషియమ్’కి రీమేక్ అని సమాచారం. దగ్గుబాటి రానా మరో హీరోగా కనిపించనున్నారు. పొగురున్న పొలిటికల్ లీడర్ గా రానా నటిస్తుండగా.. ఒక సిన్సియర్ సబ్ ఇన్స్పెక్టర్ గా పవన్ కళ్యాణ్ నటించనున్నాడు.

2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడైన పవన్ కళ్యాణ్.. చాలా ఆలోచించే ఈ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. గత ఎన్నికలలో సరైన స్థానం దొరక్కపోవడంతో మళ్ళీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న పవన్ ఆర్థికంగా బలపడాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. అందుకే అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమాలు కమిట్ అవుతాడని టాక్. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమాని దాదాపుగా పూర్తి చేసిన పవన్.. జెట్ స్పీడ్ తో షూటింగ్స్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మిగతా ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి కంప్లీట్ చేయగలరు. కాకపోతే ఇప్పుడు పవర్ స్టార్ లైనప్ లో ఏ సినిమాలు ముందుగా పూర్తి చేస్తాడనేది చూడాలి. అలానే ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఇలానే రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తాడా లేదా ఏదో ఒకదానికే పరిమితమవుతాడా అనే ప్రశ్న సినీ అభిమానులు మరియు జనసేన కార్యకర్తల మదిలో మెదులుతోంది. మరి జనసేన అధినేత మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
× RELATED ఆచార్యకు 'జిగేల్ రాణి' భారీ డిమాండ్స్.. ఏంటంటే??
×