ఓటు హక్కు వినియోగించుకున్న ట్రంప్..!

డోనాల్డ్ ట్రంప్ ..అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా అందరికి బాగా పరిచయమే. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. పోలింగ్ సమయం దగ్గర పడేకొద్ది ప్రచారంలో జోరుపెంచుతున్నారు. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ముందస్తు బ్యాలెట్ లో ఓటు వేశారు. నవంబర్ 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ఆయన తీవ్రం చేశారు. ప్రత్యర్థి డెమొక్రాట్ పార్టీకి చెందిన జో బిడెన్ ప్రచారంతో వెనుకబడి ఉన్న ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని పోలింగ్ కేంద్రంగా ఉన్న లైబ్రరీలో ఓటు వేశారు.

గత ఏడాది నూయార్క్ నుంచి ఫ్లోరిడాకు తన నివాసాన్ని ఆయన మార్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇక్కడ ముందస్తు ఓటును వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత.. ‘ట్రంప్ అనే పేరున్న వ్యక్తికి ఓటు వేశాను’ అని నవ్వుతూ చెప్పారు. సాధారణంగా మాస్కుకు దూరంగా ఉండే  ట్రంప్ దీనికి భిన్నంగా వ్యవహరించారు. మాస్కు ధరించి ఓటు వేశారు. ‘ఇది చాలా సురక్షితమైన ఓటు. మీరు బ్యాలెట్లో పంపినప్పుడు కంటే చాలా సురక్షితమని నేను మీకు చెప్పగలను’ అని ట్రంప్ అన్నారు. ఆధారాలు లేని మెయిల్-ఇన్ ఓటింగ్ మోసానికి దారితీస్తుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం తో అమెరికన్లు ముందస్తు ఓటింగ్ కి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
× RELATED గ్రేటర్ పోరు : మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి !
×