ఉల్లి ధరలు పైపైకి...కారణమేంటి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశానికంటిన సంగతి తెలిసిందే. ఉల్లిపాయలు కోస్తున్నప్పుడే కాదు....కొంటున్నపుడు కూడా కన్నీళ్లు వస్తున్నాయని ఉల్లి వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరోవైపు ఉల్లిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించి దాని ధరను అదుపులోకి తేవాలని భావించిన కేంద్రం ఆలోచన వర్కవుట్ కాలేదు. దీనికితోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల ధాటికి చేతికి పలు రాష్ట్రాల్లో చేతికి అందివచ్చిన ఉల్లిపంట నీటిపాలైంది. ఈ నేపథ్యంలో మార్కెట్ లో ఉల్లిధరలు ఘాటెక్కిస్తున్నాయి. కేజీ ఉల్లిపాయలు రూ.80-100 వరకు పలుకుతున్నాయి. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్రం పలు ప్రత్యామ్నాయాలు చేపట్టింది. అయినప్పటికీ మరి కొద్ది రోజుల పాటు ఉల్లి లొల్లి తప్పదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఉల్లిపాయ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955కు సవరణలు చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్(నిత్యావసర సరుకులు) నుంచి ఉల్లిని మినహాయించింది. స్టాక్ పరిమితి విధానం ప్రవేశ పెట్టి సామాన్యులకు ఉల్లి అందుబాటులో ఉండేలా చేసింది. గోదాముల్లోని ఉల్లిని వివిధ రాష్ట్రాలకు తరలిస్తోంది.  దీంతో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించి... ఇరాన్ టర్కీ వంటి ఉల్లి పండించే దేశాల నుంచి దిగుమతి నిబంధనలను  కేంద్రం సడలించింది.అయినప్పటికీ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  అయితే ఉల్లి ధరలు పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఉత్తర కర్ణాటక తెలుగు రాష్ట్రాలతోపాటు ఉల్లి పండించే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు రావడం కూడా ఉల్లిధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఖరీఫ్ సీజన్ అయిన జూన్-జులైలో విత్తనాలు వేస్తే అక్టోబర్ మాసంలో చేతికి వచ్చే పంట నీట మునిగింది.

రబీ సీజన్ అయిన డిసెంబర్-జనవరిలో విత్తనాలు వేస్తే మార్చి నాటికి చేతికి వచ్చే పంటపైనే ఇపుడు ఆశలన్నీ పెట్టుకున్నారు రైతులు. కొంతకాలంగా యూరియా ఎక్కువ వాడటంతో ఉల్లి నిల్వ ఉండే సమయం తగ్గిపోయింది. మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పరిమితంగా ఉల్లి నిల్వలున్నా....అవి దేశవ్యాప్తంగా సరిపోవు. ఇక దిగుమతులు చేసుకొని ఉల్లిని అందుబాటులో ఉంచడం మరో మార్గం. అందుకే ఇరాన్ టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఉల్లి కిలో రూ.40 నుండి రూ.45 వరకు పలుకుతోంది. దిగుమతుల కన్నా మన దేశంలో పండిన ఉల్లి చేతికి వస్తేనే ధరలు తగ్గుతాయి.  నవంబరు చివరి నాటికి ఖరీఫ్ పంట చేతికి రావడం కష్టం. కాబట్టి డిసెంబరు చివరి వరకు ఉల్లి ధరలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
× RELATED గ్రేటర్ పోరు : మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి !
×