మెహబూబాకు నిరసనల సెగ...షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

జాతీయ జెండా ఆర్టికల్-370పై 3 రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. మెహబూబా వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముగ్గురు పీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.    జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని అంతవరకు ఎన్నికల్లో పోటీచేయబోమని మెహబూబా చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించేంత వరకు జాతీయ జెండాను చేబట్టబోమన్న మెహబూబా వ్యాఖ్యలపై పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెహబూబా వ్యాఖ్యలపై జమ్మూలోని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జమ్మూలోని పీడీపీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు `తిరంగా యాత్ర`తో నిరసన చేపట్టారు.

అంతేకాకుండా పీడీపీ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ నేతలు మెహబూబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శ్రీనగర్ లో లాల్చౌక్లోని క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేసేందుకు యత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ముగ్గురు నేతలు తమ రాజీనామా లేఖలను మెహబూబా ముఫ్తీకి పంపారు. మెహబూబా చర్యలు దేశభక్తి కొందరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం తమకు చాలా అసౌకర్యంగా అనిపించాయని రాజీనామా లేఖలో వారు పేర్కొన్నారు.
× RELATED గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం టార్గెట్ 50
×