పవన్ ను ‘అజ్ఞాతవాసి’ భయం వెంటాడుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నాడు. దసరా సందర్భంగా సడెన్ సర్ప్రైజ్ అంటూ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ మలయాళంలో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రలో కనిపించనుండగా.. పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ మిలిటరీ మ్యాన్ క్యారెక్టర్ను రానా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకర సంగతులు చాలానే ఉన్నాయి. ఇప్పటిదాకా రెండే సినిమాలు అవి కూడా చిన్న స్థాయివి చేసిన సాగర్ లాంటి చిన్న దర్శకుడు పవన్ను డైరెక్ట్ చేయబోతుండటం అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ తర్వాత ఈ సినిమాను పవన్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చేయడమూ ఆశ్చర్యకరమే. ఎందుకంటే సితార బేనర్ మామూలుగా మీడియం బడ్జెట్ సినిమాలే చేస్తుంది. ఇది హారిక హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణకు చెందిన బేనరే. వాళ్లబ్బాయి నాగవంశీ ఈ బేనర్ బాధ్యతలు చూస్తాడు.

హారిక హాసిని బేనర్లో మొదట్నుంచి తీస్తున్నవి భారీ చిత్రాలే. దాన్నలా కొనసాగిస్తూ సితార బేనర్ పెట్టి మీడియం రేంజ్ సినిమాలే తీస్తున్నారు. బాబు బంగారం జెర్సీ భీష్మ లాంటి సినిమాలొచ్చాయి ఈ బేనర్లో. పవన్తో సినిమా అంటే పెద్ద స్థాయిది. బడ్జెట్ ఎక్కువ. అన్ని రకాలుగా రేంజ్ ఎక్కువే. కచ్చితంగా హారిక హాసిని బేనర్లోనే తీస్తారని అంతా అనుకుంటారు. కానీ దీన్ని సితార టేకప్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే హారిక హాసిని బేనర్లో పవన్ చేసిన ‘అజ్ఞాతవాసి’ దారుణమైన ఫలితాన్నందుకున్న నేపథ్యంలో పవన్ కానీ రాధాకృష్ణ కానీ మళ్లీ ఆ సంస్థలో సినిమా చేయడానికి ఇష్టపడక ‘సితార’లో ఈ సినిమా చేస్తుండొచ్చన్న సందేహాలు కలుగుతున్నాయి. లేదంటే హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ తప్ప వేరే దర్శకుడు సినిమాలు చేయడానికి వీల్లేదని ఏమైనా నియమం పెట్టుకున్నారేమో.
× RELATED నెల అయ్యింది.. కాజల్ భర్త రొమాంటిక్ పోస్ట్
×