భారీ వర్షాలు వరదలతో కొంపల్లి వాసుల అవస్థలు !

ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మొత్తం తడిసి ముద్దయింది. చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. నగరం మొత్తం చెరువుని తలపించింది. వర్షం తగ్గి మూడు రోజులు అయిపోయినా కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీళ్లు అలాగే ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధి లోని పలు కాలనీలు నీటితో నిండిపోయాయి . కొంపల్లి ఉమామహేశ్వరి కాలనీ పాక్స్ సాగర్ బ్యాక్ వాటర్ తో మునిగింది. సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ దిగువన ఉన్న ఉమా మహేశ్వర కాలనీలో సుమారు 650 ఇల్లు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి.  

దీనితో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు  నిరాశ్రయులయ్యారు. కాలనీల్లో మురికినీరు బురదతో నానా కష్టాలు పడుతున్నారు. ఈ ప్రాంతం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళి పోతున్నారు. గత పదహేన్లు గా ఇక్కడ ఉంటున్నామని ఎప్పుడు వర్షం పడినా ఇదే తరహా నరకం అనుభవిస్తున్నామని స్ధానికులు వాపోతున్నారు. అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఫాక్స్ సాగర్ నుండి కాలనీల్లోకి వరద నీరు రావడంతో దిక్కు తోచని స్థితిలో ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దగ్గరలోని కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ లో నివాసం ఉంటున్నారు.  కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ లో ఉన్న ఫాక్స్ సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. అయితే నగరంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
× RELATED గ్రేటర్ ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం.. ఎందుకంటే ?
×